మోడల్‌ కాలనీ ఖాళీ చేయించారు

ABN , First Publish Date - 2022-08-19T05:59:39+05:30 IST

హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఫణిగిరిగట్టు వద్ద మోడల్‌ కాలనీలో ఇళ్లు ఆక్రమించి నాలుగు రోజులుగా నివాసముంటున్న ఎన్నెస్పీ కాల్వకట్ట బాధితులను రెవెన్యూ, పోలీస్‌, మునిసిపల్‌ అధికారులు ఖాళీ చేయించారు.

మోడల్‌ కాలనీ ఖాళీ చేయించారు
మోడల్‌కాలనీ వద్ద ఇళ్లు ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయిస్తున్న పోలీసులు

పోలీసులు, నిర్వాసితుల మధ్య తోపులాట 

అరెస్ట్‌ చేసి, స్టేషన్‌కు తరలించిన పోలీసులు

ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

హుజూర్‌నగర్‌, ఆగస్టు 18: హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఫణిగిరిగట్టు వద్ద మోడల్‌ కాలనీలో ఇళ్లు ఆక్రమించి నాలుగు రోజులుగా నివాసముంటున్న ఎన్నెస్పీ కాల్వకట్ట బాధితులను రెవెన్యూ, పోలీస్‌, మునిసిపల్‌ అధికారులు ఖాళీ చేయించారు. గురువారం ఉదయం అధికారులు వచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. దీంతో బాధితులు తాము ఖాళీ చేయబోమని భీష్మించుకోవడంతో పోలీసులు, మునిసిపల్‌, రెవిన్యూ సిబ్బంది మోడల్‌ కాలనీలోని గదుల్లో నిర్వాసితుల నిత్యావసర వస్తువులు, సరుకులను బలవంతంగా ట్రాక్టర్లలో తరలించారు. దీంతో అధికారులు, బాధితుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బాధితులు అధికారులను ప్రతిఘటించినప్పటికీ పోలీసుల సహకారంతో అధికారులు ఇళ్లు ఖాళీ చేయించారు. ఇళ్ళలోని సామగ్రిని మునిసిపాలిటీ ట్రాక్టర్‌లోకి ఎక్కించడంతో పాటు నిర్వాసితులను బలవంతంగా అరెస్టుచేసి వ్యాన్‌ ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఫణిగిరిగట్టు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము ఏ రాజకీయ పార్టీలకు చెందిన వారంకాదని, కేవలం ఇళ్లు కూలిపోయి ఎన్నెస్పీ కాల్వకట్టలపై నిర్వాసితులుగా ఉండి నాలుగు నెలలుగా ప్రభుత్వ సాయంకోసం ఎదురు చూస్తున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో గత ఎనిమిదేళ్లక్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్‌ కాలనీకి వచ్చి ఉంటున్నామన్నారు. ఇక్కడ వసతులు లేకున్నా, గూడు లేక తల దాచుకుంటున్నామన్నారు. తమను అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. తమకు నిలవ నీడలేక కిరాయిలు కట్టలేక పనిచేసుకుంటేనే పూట గడిచే పేదలమని ఆవేదన వ్యక్తంచేశారు. తమను ఆదుకోవాలని అధికారులను వేడుకున్నప్పటికీ పోలీస్‌ యంత్రాంగం అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇళ్ల వద్దకు వెళ్లొద్దని సూచించిన అనంతరం రెండు గంటల తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలచేశారు. ఇళ్లు ఆక్రమించుకున్న వారందరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.


ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వాసితుల ధర్నా

పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వాసితులంతా ధర్నాకు దిగారు. పోలీసులు ఇళ్లు ఆక్రమించిన వారిని విడుదల చేయడంతో న్యాయం చేయాలంటూ బాధితులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తమకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగు నెలలుగా ఇళ్లు లేక రోడ్లపై ఉంటున్నామని చెప్పారు. రెవెన్యూ అధికారులు వచ్చి తమ ఇళ్లు కూలగొట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో శీతల రోషపతి, యల్క సోమయ్య, వెంకన్న, సైదులు, జయక్రిష్ణ, గీతా, రహీం, అలీం, రేణుక, మీనాక్షి, మంగమ్మ, మేరి, ఉమా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:59:39+05:30 IST