మండలాలు ఏర్పాటు చేసేవరకూ పోరు ఆగదు

ABN , First Publish Date - 2022-08-01T05:41:54+05:30 IST

నూతన మండలాల కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ గ్రామాలకు మండలాలకు ఉండాల్సిన అర్హతలున్నాయని, వెంటనే మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రోజుకోరీతిన నిరసన తెలుపుతున్నారు.

మండలాలు ఏర్పాటు చేసేవరకూ పోరు ఆగదు
వలిగొండ మండలం వేములకొండలో నిరసన వ్యక్తం చేస్తున్న అఖిలపక్షం నాయకులు

వలిగొండ, నార్కట్‌పల్లి, చింతపల్లి, జూలై 31: నూతన మండలాల కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ గ్రామాలకు మండలాలకు ఉండాల్సిన అర్హతలున్నాయని, వెంటనే మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రోజుకోరీతిన నిరసన తెలుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండను నూతన మండలంగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ఆదివారం నాటికి నిరసన 8వ రోజుకు చేరింది. మండలానికి కావాల్సిన అన్ని అర్హతలు వేములకొండకు ఉన్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు మండల ఏర్పాటుకు సహకరించాలని అఖిలపక్షం నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాంరెడ్డి, వెంకన్న, రవీందర్‌, మత్స్యగిరి, బాలయ్య, జనార్థన్‌రెడ్డి, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.


‘అమ్మనబోలు’ కోసం నేడు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా 

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలును మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. మండలసాధన సమితి ఆధ్వర్యంలో 10 రోజులుగా నిర్వహిస్తున్న రోజువారీ నిరసన కార్యక్రమాల్లో తీవ్రతను పెంచాలని నిర్ణయించారు. రిలే దీక్షలు, కళాకారుల ప్రదర్శనలు, ఆటపాటలతో గ్రామానికే పరిమితమైన ఉద్యమాన్ని జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాలని సంకల్పించారు. ఈమేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేయాలని మండల సాధన సమితి పిలుపునిచ్చింది. మండల ఏర్పాటులో విలీనమయ్యే ప్రతిపాదిత గ్రామాల ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల నాయకులు చొరవ తీసుకుని కలెక్టరేట్‌ ఎదుట జరిగే ధర్నాకు భారీఎత్తున జన సమీకరణ చేయాలని నేతలు పిలుపునిచ్చారు.


మాల్‌ను మండల కేంద్రంగా ప్రకటించాలి 

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని మాల్‌ను నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని మండల సాధన సమితి కన్వీనర్‌ సందెపట్ల లక్ష్మణ్‌సాగర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 13 నూతన మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో స్థానిక ప్రజల సౌలభ్యం కోసం మాల్‌ను నూతన మండలంగా ఏర్పాటు చేయాలన్నారు. గతంలోనే నూతన మండలాలను ఏర్పాటుచేసే సమయంలో మాల్‌ను మండల కేంద్రంగా ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుందన్నారు. వెంటనే మాల్‌ను మండలకేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేకుంటే అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకొని ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

Read more