యాదాద్రీశుడికి స్వాతి నక్షత్ర పూజలు

ABN , First Publish Date - 2022-02-23T05:52:07+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం పల్లకి సేవ పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.

యాదాద్రీశుడికి స్వాతి నక్షత్ర పూజలు
అభిషేక మూర్తులకు హారతి నివేదిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, ఫిబ్రవరి 22: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం పల్లకి సేవ పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన ఆచార్యులు స్వయంభువులను ఆస్థానపరంగా ఆరాధించి కవచమూర్తులను హారతి కొలిచారు. బాలాలయ కల్యాణమండపంలో 108కలశాలను ఏర్పాటు చేసి ఆగమ శాస్త్రరీతిలో హోమ పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను 108 సువర్ణపుష్పాలతో కొలిచారు. బాలాలయ మండపంలో నిత్య కల్యాణోత్స వం, ప్రతిష్ఠా అలంకారమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చనలు, సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, స్వాతి నక్షత్రం సందర్భంగా పల్లకి సేవ, సహస్రనామార్చన లు కొనసాగాయి. కొండకింద పాత గోశాలలోని సత్యనారాయణస్వామి వ్రతమండపంలో వ్రత పూజలు, శివాలయం లో రామలింగేశ్వరస్వామికి నిత్య పూజలు శైవాగమ పద్ధతి లో నిర్వహించారు. ఈ పూజా పర్వాలను దేవస్థాన అర్చకబృందం నిర్వహించగా, ఆలయ అనువంశిక ధర్మకర్త బీ.నరసింహమూర్తి దంపతులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతి నక్షత్ర పూజల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో గిరిప్రదక్షిణ చేసి మొక్కు చెల్లించుకున్నారు. ఇదిలా ఉండగా యాదాద్రికొండపైన విష్ణుపుష్కరిణి, పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామిని పంచామృతాలతో అభిషేకించిన అర్చకులు నాగవల్లి దళాలతో అర్చించి మహానివేదన చేశారు.

భక్తుల సందడి

మేడారం వెళ్లిన భక్తులు తిరుగుప్రయాణంలో యాదాద్రిక్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు. దీంతో ఆలయం వద్ద భక్తుల సందడి ఏర్పడింది. సేవా మండపాలు, తిరువీధులు కోలాహలంగా మారాయి. కొండకింద పాతగోశాలలోని వ్రతమండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో 99మంది దంపతులు పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. స్వామి వారి ప్రసాదాల విక్రయంతో రూ.5.56లక్షలు, వివిధ విభాగాల ద్వారా రూ.12,04,209 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరింది.

బంగారు తాపడానికి విరాళం అందజేత

యాదాద్రి ప్రధానాలయ విమానగోపురం బంగారు తాప డం కోసం టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి రూ.1,16,116 విరాళంగా అందజేశారు. బాలాలయంలో కవచమూర్తులను దర్శించుకుని విరాళాన్ని అందజేశారు.

Read more