యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

ABN , First Publish Date - 2022-03-05T06:32:45+05:30 IST

ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
స్వస్తివాచన పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

శాస్త్రోక్తంగా స్వస్తిపుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన

రాత్రి మృత్సంగ్రహణం, అంకురారోపణ


యాదాద్రి టౌన్‌ : ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10గంటలకు వేదమంత్రోచ్చారణ, మంగళవాయిద్యాల నడుమ స్వస్తిపుణ్యాహవాచనంతో బ్రహ్మోత్సవాలకు వేదపండితులు శ్రీకారంచుట్టారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో ఐదుళ్లుగా బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండగా,ఈ ఏడాది చివరి సారిగా ఇక్కడే ఉత్సవాలునిర్వహిస్తున్నారు.


 విశ్వక్సేనుడికి తొలిపూజ

దేవతల సర్వసేనానాయకుడు విశ్వక్సేనుడికి తొలిపూజ నిర్వహించా రు. బాలాలయ కల్యాణమండపంలో పట్టువస్త్రాలు, ముత్యాల ఆభరణాలతో స్వామివారిని దివ్య మనోహరం గా అలంకరించి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశా రు. ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని తొలిపూజ నిర్వహించారు. ఆల య పరిసరాలను శాస్త్రోక్తంగా శుద్ధి చేసేందుకు స్వస్తిపుణ్యాహవాచన పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తుల ఎదుట పంచామృత కలశాలు, దర్భ(గరక)లు ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం పుణ్యజలాలతో స్వామి వారికి నిజాభిషేకం నిర్వహించి, కొండపై నలుదిక్కుల పవిత్ర జలాన్ని చల్లారు. అనంతరం లక్ష్మీనృసింహుడికి రక్షాసూత్రధారణ చేసి ప్రధానార్చకులతో పాటు అర్చకులు కంకణాలు ధరించారు. నిర్వాహకులైన ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్‌.గీతారెడ్డితో పాటు పులువురికి కంకణధారణ చేశారు.


చతుర్వేద, ప్రబంధ పారాయణాలు

బ్రహ్మోత్సవ ప్రారంభం సందర్భంగా రుత్వికులు, వేదపండితులు చతుర్వే ద మంత్రపారాయణాలు, ఉపనిషత్తులు, పంచసూక్తములు, మూలమంత్ర పఠనం చేశారు. అనంతరం అర్చకులు, రుత్వికులకు స్వామివారి బ్రహ్మోత్స వ దీక్షా వస్త్రాలను ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈవో గీతారెడ్డి అందజేశారు. ఈ వైదిక పర్వాలను దేవస్థాన ప్రధానార్చకుడు నల్లన్‌ధిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, మరింగంటి మోహనాచార్యులు, ఉపప్రధానార్చకులు, నిర్వహించారు. సాయంత్రం 6.30గంటలకు బాలాలయ కల్యాణ మండపంలో మృత్సంగ్రహణం, అంకురారోపణ పర్వాలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో అగ్నిప్రతిష్ఠ, అంతకుముందు హవన పూజలు కొనసాగాయి.


పోచంపల్లి పట్టు వస్త్రాల సమర్పణ

బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి లక్ష్మీనృసింహుడికి భూదాన్‌పోచంపల్లికి చెందిన పద్మశాలి మహాజన సంఘం చేనేత పట్టువస్త్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించింది. కార్యక్రమంలో పోచంపల్లి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీ, సంఘం అధ్యక్షుడు భారత పురుషోత్తం, ఉపాధ్యక్షుడు సీత సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బోగ రాములు, తదితరులు పాల్గొన్నారు.



ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వయంభు పాంచనారసింహుడు కొలువైన ప్రధానాలయం లో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు కొనసాగాయి. రక్షాసూత్రాలకు గర్భాలయంలో పూజలు నిర్వహించిన ఆచార్యులు వాటిని మంగళవాయిద్యాల నడుమ బాలాలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. బాలాలయంలో కవచమూర్తులను సువర్ణ పుష్పాలతో అర్చించారు. పంచామృతాభిషేకం, తులసీదళాలు, కుంకుమలతో అర్చించారు. సాయంత్రం ఆండాల్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవ నిర్వహించారు. కాగా, వివిధ విభాగాల ద్వారా రూ.9,83,140 దేవస్థాన ఖజానాకు ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు.


ప్రధాన ఆలయ ఉద్ఘాటన శుభలేఖలకు పూజలు

స్వయంభు పాంచనారసింహుడు కొలువైన ప్రధాన ఆలయ ఉద్ఘాటన సుముహూర్త శుభలేఖలకు బాలాలయ కల్యాణమండపంలో దేవస్థాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 21న ఉద్ఘాటన పూజలకు శ్రీకారం చుట్టనుండగా, 28వ తేదీన మహాపూర్ణాహుతి, కుంభసంప్రోక్షణతో వేడుకలు పరిసమాప్తమవుతాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఉద్ఘాటన శుభలేఖలకు యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల తొలి రోజు పూజలు నిర్వహించి ఈవో గీతారెడ్డికి అందజే శారు.


 యాదాద్రికి చేరిన అఖండ జ్యోతి

  స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని బర్కత్‌పురా యాదగిరిభవన్‌ నుంచి ప్రారంభమైన అఖండ జ్యోతియాత్ర శుక్రవారం సాయంత్రం యాదాద్రికి చేరింది. అంతకుముందు ఈ యాత్రకు భువనగిరిలో కలెక్టర్‌ పమేలాసత్పథి స్వాగతం పలికారు. వడాయిగూడెం వద్ద సర్పంచ్‌ గుండు మనీష్‌, యాదగిరిగుట్టలో శ్రీవైష్ణవ సేవా సమాఖ్య సభ్యులు స్వాగతం పలికారు.

Updated Date - 2022-03-05T06:32:45+05:30 IST