కాంగ్రెస్‌లో ఎవరిగోల వారిదే

ABN , First Publish Date - 2022-12-16T01:16:38+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రె్‌సకు బలమైన జిల్లా ఉమ్మడి నల్లగొండ. అయితే ఇటీవల వరుస రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌ కంచుకోట బీటలు వారుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రె్‌సను వీడగా ఎంపీ వెంకట్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో? అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. తాజాగా, ప్రధాని మోదీతో భేటీకి ముహూర్తం ఖరారు కావడంతో పార్టీలో వెంకట్‌రెడ్డి ఉంటారా? లేదా? అనే చర్చ గల్లీ నుంచి ఢిల్లీ దాకా నడుస్తోంది.

కాంగ్రెస్‌లో ఎవరిగోల వారిదే

నేడు ప్రధాని మోదీతో భేటీకానున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఇంకా ఖరారుకాని సూర్యాపేట డీసీసీ అధ్యక్ష పదవి

పీసీసీ కమిటీలపై ఢిల్లీకి లేఖలు, నేరుగా ఫిర్యాదులు

మిర్యాలగూడలో బీఎల్‌ఆర్‌కు చెక్‌పెట్టే యత్నం

భగ్గుమంటున్న స్థానిక నేతలు

రాష్ట్రంలో కాంగ్రె్‌సకు బలమైన జిల్లా ఉమ్మడి నల్లగొండ. అయితే ఇటీవల వరుస రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌ కంచుకోట బీటలు వారుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రె్‌సను వీడగా ఎంపీ వెంకట్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో? అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. తాజాగా, ప్రధాని మోదీతో భేటీకి ముహూర్తం ఖరారు కావడంతో పార్టీలో వెంకట్‌రెడ్డి ఉంటారా? లేదా? అనే చర్చ గల్లీ నుంచి ఢిల్లీ దాకా నడుస్తోంది.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానాన్ని పెండింగ్‌లో పెట్టడంపై ఎంపీ ఉత్తమ్‌, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి సీరియ్‌సగా ఉన్నారు. మిర్యాలగూడలో పనిచేసుకుంటూ వెళ్తున్న బీఎల్‌ఆర్‌కు పార్టీ కమిటీల్లో స్థానం లేకుండా చేయడంతో ఇక్కడ కాంగ్రెస్‌ చీలినట్టయింది. హుజూర్‌నగర్‌, కోదాడలో ఉత్తమ్‌ దంపతులకు తప్ప మరొకరికి స్థానం దక్కకపోడంపై స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో క్రియాశీలకంగా మారిన కొద్దిరోజుల్లోనే చలమల కృష్ణారెడ్డికి ప్రధాన కార్యదర్శిగా స్థానం ఇవ్వడంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నల్లగొండ అసెంబ్లీ నుంచి ఏ ఒక్కరికీ అవకాశం లేకపోడంపై అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేకపోవడం, రేవంత్‌రెడ్డి నుంచి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుండడంతో సాధారణ ఎన్నికల నాటికి కీలక నేతల్లో ఎంత మంది పార్టీలో ఉంటారనే చర్చ పైస్థాయిలో నడుస్తోంది.

ప్రధానితో వెంకట్‌రెడ్డి భేటీకి ముహూర్తం ఖరారు

కాంగ్రె్‌సలో ఇమడలేక, వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల ఎజెండాతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చర్చకు నిలిచారు. రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు తామే ప్రత్యామ్నాయమని చాటేందుకు ఉప ఎన్నికలే ఎజెండాగా బీజేపీ ముందుకు వెళ్తోంది. ఆ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికతో తన లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ ఎంపీ వెంకట్‌రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని టార్గెట్‌చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంకట్‌రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికను ఎదుర్కొంటారని, మునుగోడు తరహాలోనే భువనగిరి పార్లమెంట్‌కు ఉప ఎన్నిక వస్తుందన్న చర్చ సాగింది. ఇదిలా ఉంటే సీనియర్‌ నేత వెంకట్‌రెడ్డికి తాజాగా ప్రకటించిన పీసీసీ కమిటీల్లో స్థానం దక్కకపోవడం కాంగ్రెస్‌ పెద్దల అభిమతాన్ని చెప్పకనే చెప్పింది. దీనికి అనుబంధంగా సాధారణ ఎన్నికలకు నెల రోజుల ముందు వరకు తాను రాజకీయ వ్యాఖ్యలు చేయనంటూ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్‌లో ఉన్నానని, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనని, మంత్రి పదవిని చెప్పుతో సమానంగా వదిలేశానని, ఇక పీసీసీ కమిటీలేందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన వెంకట్‌రెడ్డి గంటల వ్యవధిలోనే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరగా, ఈనెల 16న ఉదయం 11గంటలకు షెడ్యూల్‌ ఖరారైంది. గంగానదిని శుద్ధి చేసిన తరహాలో నవామీ మూసీ ప్రాజెక్టు ప్రగతి, ఈ పథకం అమలులో వస్తున్న ఇబ్బందులు, మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, హైదరాబాద్‌-విజయవాడ హైవే వంటి ఎజెండాతో ప్రధానిని ఎంపీ వెంకట్‌రెడ్డి కలుస్తున్నట్లు పీఎం కార్యాలయం నుంచి సమాచారం విడుదలైంది. అయితే ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసిన గంటల వ్యవధిలోనే ప్రధాని మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం చర్చనీయాంశమైంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ గతంలో పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించగా, సీఎల్పీ నేతగా అవకాశం కల్పించాలని రాజగోపాల్‌రెడ్డి గతంలో అధిష్ఠానాన్ని కోరారు. ఈ రెండు నెరవేరకపోగా రేవంత్‌రెడ్డికి పీసీసీ బాధ్యతలు ఇవ్వడం, ఆయనతో నేరుగా యుద్ధానికి దిగడంతో బ్రదర్స్‌ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడగా ఎంపీ వెంకట్‌రెడ్డి వేస్తున్న అడుగులు కాంగ్రె్‌సలో కలవరం రేపుతున్నాయి.

కమిటీల కలకలం

జిల్లాలో ఆధిపత్యం సాధించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రయత్నం, ఆది నుంచి నియోజకవర్గాల్లో పాగా వేసిన బడా నేతలు వారి ప్రాంతాల్లో మరొకరికి అవకాశం లేకుండా చేయడం వంటి పరిణామాలతో ఉమ్మడి జిల్లా కాంగ్రె్‌సలో కలకలం రేగుతోంది. ప్రతీ నియోజకవర్గంలో సంస్థాగతంగా ప్రత్యక్ష యుద్ధానికి దిగే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో డీసీసీలకు పాత వారినే ఖరారు చేస్తూ జాబితా విడుదల చేశారు. అయితే పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి చెక్‌ పెట్టే యోచనతో సూర్యాపేట డీసీసీ అధ్యక్ష స్థానాన్ని పెండింగ్‌లో ఉంచారు. ఈ విషయాన్ని సూర్యాపేట జిల్లాలో ఆధిపత్యం కొనసాగిస్తున్న సీనియర్‌ నేతలు సీరియ్‌సగా తీసుకున్నారు. తన అనుచరుడు చెవిటి వెంకన్నకు మరోసారి డీసీసీ ఇవ్వాల్సిందేనని దామోదర్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని దామోదర్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేశారు. అయినా డీసీసీ విషయంలో తన మాట నెగ్గకపోవడంపై అసంతృప్తితో ఉన్న దామోదర్‌రెడ్డి అధిష్ఠానానికి మూడు పేజీల లేఖ రాసినట్లు సమాచారం. హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో పీసీసీ ప్రతినిధుల జాబితాతో పాటు తాజాగా పీసీసీ కమిటీల్లోనూ ఉత్తమ్‌ దంపతులకు తప్ప మరొకరికి అవకాశం లేకపోవడంపై స్థానికంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. ఉత్తమ్‌తో కొనసాగుతున్న సీనియర్‌ నేతలే ఈ అంశాన్ని స్థానికంగా చర్చకు పెట్టారు. కోదాడ నుంచి సీనియర్‌నేత లక్ష్మారెడ్డికి అవకాశం ఇవ్వాలని ఉత్తమ్‌ పట్టుబట్టినప్పటికీ రేవంత్‌ చెక్‌ పెట్టినట్లు సమాచారం.

బత్తులకు చెక్‌ పెట్టేందుకు

మిర్యాలగూడలో కాంగ్రెస్‌ నిట్టనిలువునా చీలింది. బీఎల్‌ఆర్‌ (బత్తుల లక్ష్మారెడ్డి) ఒకవైపు డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ మరో వైపు గ్రూపులుగా విడిపోయారు. స్థానికంగా గుర్తింపు పొందిన బీఎల్‌ఆర్‌కు పీసీసీ ప్రతినిధుల జాబితాలో, తాజాగా పీసీసీ కమిటీల్లోనూ స్థానం దక్కలేదు. స్థానికంగా లేకపోయినా జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి పేరును పీసీసీ ప్రతినిధులతో పాటు ప్రధాన కార్యదర్శి జాబితాలో స్థానం కల్పించడంతో సీనియర్‌ నేతలు బీఎల్‌ఆర్‌కు చెక్‌ పెట్టేందుకు సిద్ధపడ్డారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా అమరేందర్‌రెడ్డి కొనసాగుతారని, తాజాగా డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ చేసిన ప్రకటన ప్రత్యక్ష యుద్ధానికి దారి తీస్తోంది. శంకర్‌నాయక్‌కు కౌంటర్‌గా బీఎల్‌ఆర్‌ గ్రూపునకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు చిలుకూరి బాలకృష్ణ, నూకల వేణుగోపాల్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి భగ్గుమన్నారు. శంకర్‌నాయక్‌ ప్రకటనపై ఎంపీ ఉత్తమ్‌, సీనియర్‌ నేత జానాకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి వ్యవస్థ కాంగ్రె్‌సలో లేదని, ఆ మేరకు మీడియా సమావేశంలో స్పష్టం చేయాలని ఇద్దరు సీనియర్‌ నేతలు సూచించడంతో శంకర్‌నాయక్‌కు కౌంటర్‌గా వారు సమావేశం నిర్వహించారు. జానా తనయుడు రఘువీర్‌కు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఉన్న స్నేహం కారణంగా ఆయనకు వరుసగా కమిటీల్లో ప్రాధాన్యం దక్కుతోందన్న ప్రచారం ఉంది. పీసీసీ కమిటీల్లో స్థానానికి సంబంధించి ఎంపీ ఉత్తమ్‌ ఇచ్చిన జాబితాలో బీఎల్‌ఆర్‌ పేరు ఉన్నా, మరో గ్రూప్‌ అభ్యంతరం పెట్టడంతో ఆయన పేరు గల్లంతైందన్న ప్రచారం స్థానికంగా ఉంది. పీసీసీ కమిటీల్లో భువనగిరి సీనియర్‌ నేత బర్రె జహంగీర్‌కు స్థానం కల్పించకపోవడంపై మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆగ్రహంగా ఉన్నారు.

మునుగోడు ఉప ఎన్నికతో

మునుగోడు ఉప ఎన్నికతో క్రియాశీలకంగా మారిన కొద్ది రోజుల్లోనే చలమల కృష్ణారెడ్డికి ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించడంపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు మునుగోడు నేతలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నల్లగొండ అసెంబ్లీ నుంచి పీసీసీ కమిటీల్లో ఎంపీ వెంకట్‌రెడ్డికి, స్థానికంగా టికెట్‌ ఆశిస్తున్న నేతలు దుబ్బాక నర్సింహారెడ్డి, తండు సైదులుగౌడ్‌ వంటి నేతల పేర్లకు స్థానం లేకుండా పోయింది. ఈ నియోజకవర్గం నుంచి ఎవ్వరికీ అవకాశం ఇవ్వకపోవడంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడం, జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలకు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర రాజకీయ వైరం నేపథ్యంలో సాధారణ ఎన్నికల నాటికి ఎంత మంది దిగ్గజాలు పార్టీలో ఉంటారో? వెళ్లిపోతారో? అనే చర్చ జిల్లా కాంగ్రె్‌సలో ఉంది.

Updated Date - 2022-12-16T01:16:39+05:30 IST