ఉమ్మడి జిల్లాపై వరాల జల్లు

ABN , First Publish Date - 2022-12-02T00:14:20+05:30 IST

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్లను గెలిపిస్తే 15 రోజుల్లో హామీలు అమలు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించారు. ఆ మేరకు ఫలితం వెల్లడైన నెల రోజుల్లో ఐదుగురు మంత్రుల బృందం మునుగోడుకు వచ్చింది.

ఉమ్మడి  జిల్లాపై వరాల జల్లు

ఏడు నెలల్లో రూ.1,544కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళిక

10వేల మంది మునుగోడు యువతకు ఉపాధి

మూడు హ్యాండ్‌లూమ్‌ క్లస్టర్లు, 100 పడకల ఆస్పత్రి

నారాయణపురంలో గురుకుల పాఠశాల, బంజారా భవన్‌

ఆరు గంటల పాటు ఐదుగురు మంత్రుల కసరత్తు

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్లను గెలిపిస్తే 15 రోజుల్లో హామీలు అమలు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించారు. ఆ మేరకు ఫలితం వెల్లడైన నెల రోజుల్లో ఐదుగురు మంత్రుల బృందం మునుగోడుకు వచ్చింది. అభివృద్ధి సమీక్ష ఒక్క మునుగోడుకే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమీక్షంచడంతోపాటు భారీగా నిధులు కేటాయించి వాటిని ఖర్చు చేసేందుకు నిర్ణీత సమయాన్ని ఖరారు చేశారు. కేవలం నాలుగు శాఖల ద్వారా రానున్న ఏడు నెలల్లో రూ.1,544కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)

మునుగోడుకు అంచనాకు మించి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను మంత్రుల బృందం కేటాయించింది. సమీక్షలో పలు అంశాలను ఎమ్మెల్యేలు లేవనెత్తగా మంత్రులు, అధికారులు ప్రతీ అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.1544 కోట్లతో రానున్న ఏడు నెలల కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. గురువారం మునుగోడులో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పల్లె, పట్టణ ప్రగతి, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, విద్యుత్‌, మిషన్‌భగీరథ, రోడ్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, నీటిపారుదల తదితర పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో మునిసిపాలిటీల అభివృద్ధికి రూ.334కోట్లు, రోడ్ల అభివృద్ధికి రూ.402కోట్లు, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కోసం రూ.700కోట్లు, గిరిజన సంక్షేమం కోసం రూ.100కోట్లు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు రూ.8కోట్లు మొత్తం రూ.1544కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో రూ.100కోట్లతో రోడ్లు, రూ.175కోట్లతో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనులు, రూ.30కోట్లతో చండూరు మునిసిపాలిటీ, రూ.50కోట్లతో చౌటుప్పల్‌ మునిసిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు. మునుగోడులో 100పడకల ఆస్పత్రి, చండూరును రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని ప్రకటించారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలో ఒక గిరిజన పాఠశాల, రూ.కోటితో బంజారా భవన్‌, దండుమల్కాపురం వద్ద 100 ఎకరాల్లో 10వేల మందికి ఉపాధి కల్పిస్తూ టాయ్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్నందున పట్టణాభివృద్ధి ప్రణాళికబద్ధంగా ఉండాలనేది సీఎం ఆలోచన అని, అందుకు అనుగుణంగా సమన్వయంతో పనులు పూర్తిచేయాలని సూచించారు.

మునిసిపాలిటీల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి

గత ఎనిమిదేళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునిసిపాలిటీల్లో రూ.454కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. నల్లగొండ అర్బన్‌ అథారిటీ, భువనగిరి జిల్లాలో వైటీడీఏ అథారిటీతో పాటు 19 మునిసిపాలిటీల్లో వచ్చే మార్చి 31లోగా అభివృద్ధి కార్యక్రమాలను ఒక లక్ష్యంతో పూర్తి చేయాలన్నారు. చిన్న, పెద్ద మునిసిపాటీల్లో టీఎ్‌సబీపాస్‌ ద్వారా భవన నిర్మాణాలకు 21 రోజుల్లోపే అన్ని అనుమతులు ఇస్తున్నామని, 75 చదరపు అడుగులు లోపు అయితే నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతీ మునిసిపాలిటీలో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మిస్తున్నామని, వచ్చే మార్చి 31లోగా వీటిని పూర్తిచేయాలన్నారు. మునిసిపాలిటీ పరిధిలో వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరం ఉన్నచోట కొత్త నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతీ మునిసిపాలిటీలో ఆధునిక దోబీఘాట్‌ల నిర్మాణం కోసం చర్యలు తీసుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేయాలన్నారు. డంపింగ్‌ యార్డుల్లో చెత్త తొలగింపునకు బయోమైనింగ్‌ ప్రక్రియ ప్రారంభించాలని, మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ దశలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోదించి పంపాలన్నారు. మునిసిపాలిటీల్లో ప్రతీ ఇంటికి డిజిటల్‌ డోర్‌ నెంబరు ఏర్పాటు చేస్తామన్నారు. మునిసిపాలిటీల్లో ఉన్న సెలూన్ల వివరాలు పంపాలని, వారికి కొంత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా ప్రతీ ఇంటికి నీటిని అందించాలని, ఇంకా ఎక్కడైనా తాగునీరు అందని ప్రాంతాలుంటే గుర్తించి వెంటనే సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. మునిసిపాలిటీల్లో వార్డు ఆఫీసర్‌ను నియమిస్తామని, 50వేల జనాభాకు తక్కువ ఉన్న మునిసిపాలిటీలో రెండు వార్డులకు ఒక వార్డు ఆఫీసర్‌ను ఉంటారన్నారు.

నాలుగు చేనేత క్లస్టర్లు

భువనగిరి, సంస్థాన్‌నారాయణపురం, గట్టుప్పల్‌, తేరేటుపల్లిలో నాలుగు చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. చేనేత జౌళిశాఖ ద్వారా ఇస్తున్న యార్న్‌పై 40శాతం సబ్సిడీని వెంటనే అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దండుమల్కాపూర్‌ ఐటీ పార్కు సందర్శన కోసం ప్రజాప్రతినిధులు స్టడీ టూర్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కోరిక మేరకు పోచంపల్లిలో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ ఏర్పాటుకు స్థల సమస్యను పరిష్కరించి రానున్న మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో మల్టీపుల్‌ లిప్ట్‌ ఇరిగేషన్‌ పనులు, చెక్‌డ్యాంలకు సంబంధించి ఎన్ని పనులకు ఎన్ని పూర్తయ్యాయి, కొత్త చెక్‌ డ్యాంలకు ప్రతిపాదనలు వివరాలతో సమగ్ర నివేదికతో వారంరోజుల్లోపు అందజేయాలన్నారు.

మిషన్‌ భగీరథ ఆలోచన కేటీఆర్‌దే

ఉమ్మడి నల్లగొండ జిల్లా మీద సీఎం కేసీఆర్‌కి ప్రేమ ఎక్కువ అని, ఇంటింటికీ తాగునీరు అందించి ఫ్లోరిన్‌ అనే బ్రహ్మ రాక్షసిని కూకటి వేళ్లతో తొలగించారని, అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు అందించాలనే ఆలోచన మంత్రి కేటీఆర్‌దేనని, ఆయన ఎంతో ముందు చూపుతో దీని మీద దృష్టిపెట్టారని అన్నారు. పల్లె సీమలు ప్రగతిలో పోటీ పడుతున్నాయని, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా చేసిన పనులను ప్రజలకు వివరంగా తెలిసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దేశంలో ఉపాఽధి పనుల కింద ఎక్కువ పని దినాలను నిర్వహించింది తెలంగాణ రాష్ట్రమేనని, నిధుల విడుదలలో కేంద్రం ఎన్నో అవాంతరాలను సృష్టిస్తోందన్నారు. 2014 నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి ప్రారంభమైందని, సాగు, తాగు నీటి సమస్యలు తీర్చుకున్నామన్నారు. ఎనిమిదేళ్లలో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేశామని, జిల్లాకు అన్ని శాఖల ద్వారా ఎక్కువ నిధులు అందుతున్నాయని, తద్వారా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు.

. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, మిషన్‌ భగీరథ గ్రిడ్‌లైన్‌ దెబ్బతిన్నదని, పనులు వెంటనే చేపట్టాలని కోరారు. ట్యాంక్‌ బండ్స్‌, ఫీడర్‌ చానళ్లపై పిచ్చి మొక్కలు, చెట్లు మొలిచినందున ఉపాధి హామీ పథకం కింద వాటిని తొలగించాలన్నారు. సమీక్షా సమావేశంలో ట్రైకార్‌ చైర్మన్‌ రాంచంద్రనాయక్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, గుజ్జ దీపిక యుగంధర్‌రావు, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్‌కుమార్‌, రవీంద్రకుమార్‌, ఎన్‌.భాస్కర్‌రావు, నోముల భగత్‌, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాద వ్‌, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు టి.వినయ్‌కృష్ణారెడ్డి, పమేలా సత్పథి, హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్‌, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:14:22+05:30 IST