ఆర్టీసీ ఆదాయంలో రాష్ట్రంలోనే మొదటిస్థానం

ABN , First Publish Date - 2022-08-15T06:09:37+05:30 IST

టీఎస్‌ ఆర్టీసీకి రాఖీ పండుగ కలిసొచ్చింది. ఆర్టీసీ చరిత్రలోనే నల్లగొండ రీజియన్‌ రికార్డు స్థాయి ఆదాయాన్ని గడించింది.

ఆర్టీసీ ఆదాయంలో రాష్ట్రంలోనే మొదటిస్థానం

ఒక్కరోజే రీజియన్‌లో రూ.1.72 కోట్ల ఆదాయం 

రాఖీ పండుగ ఆదాయం

నల్లగొండఅర్బన్‌, ఆగస్టు 14: టీఎస్‌ ఆర్టీసీకి రాఖీ పండుగ కలిసొచ్చింది. ఆర్టీసీ చరిత్రలోనే నల్లగొండ రీజియన్‌ రికార్డు స్థాయి ఆదాయాన్ని గడించింది. 101 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) సాధించి నల్లగొండ రీజియన్‌ రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. 94 శాతం ఆక్యుపెన్సీ సాధించి మెదక్‌ రెండో స్థానంలో నిలిచింది. నల్లగొండ రీజియన్‌లోని ఏడు డిపోల పరిధిలో ఈ నెల 12వ తేదీన ఆర్టీసీ బస్సుల్లో 2.80లక్షల మంది ప్రయాణించగా, రూ.1.72 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణ రోజుల్లో రూ.1.20 కోట్లలోపే ఆదాయం వస్తుండగా, రాఖీ పండుగ రోజైన ఈ నెల 14న అదనంగా రూ.52లక్షలు ఆదాయం సమకూరింది. సాధారణ రోజుల్లో రీజియన్‌లో ఈపీకే (ఎర్నింగ్‌ పర్‌ కిలోమీటర్‌) రూ.45 మించేది కాదు పండుగ రోజు మాత్రం రూ.59.51 పైసలు ఈపీకే సాధించారు. రీజియన్‌లో 7 డిపోల్లో నల్లగొండ డిపో ఆదాయంలో మొదటిస్థానం నిలవగా రెండో స్థానంలో దేవరకొండ, మూడో స్థానంలో సూర్యాపేట డిపోలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలోనే రికార్డు స్థాయిలో నల్లగొండ రీజియన్‌కు ఆదాయం రావడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆర్టీసీ జిల్లా అధికారులను ప్రశంసించారు. 

Updated Date - 2022-08-15T06:09:37+05:30 IST