రూ.2.9 కోట్లతో సాగర్‌ కాల్వకు మరమ్మతులు

ABN , First Publish Date - 2022-05-24T06:28:00+05:30 IST

దెబ్బతిన్న నాగార్జునసాగర్‌ కాల్వల రూపురేఖలు మారనున్నాయి. మరమ్మతులకు గురైన చోట పనులకోసం నాలుగేళ్ల తర్వాత జీ

రూ.2.9 కోట్లతో సాగర్‌ కాల్వకు మరమ్మతులు
నడిగూడెం మండలం రామాపురం వద్ద సాగర్‌ ఎడమకాల్వలో చేపట్టిన మరమ్మతు పనులు

నాలుగేండ్ల తర్వాత మంజూరైననిధులు

నడిగూడెం మండలంలో మొదలైన పనులు 

నడిగూడెం, మే 23 : దెబ్బతిన్న నాగార్జునసాగర్‌ కాల్వల రూపురేఖలు మారనున్నాయి. మరమ్మతులకు గురైన చోట పనులకోసం నాలుగేళ్ల తర్వాత జీవో 45 ద్వారా 2022-23 సంవత్సరానికి ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ కింద సాగర్‌ కాల్వల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.9 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులకు పరిపాలన అనుమతి, టెండర్‌ ప్రక్రియ పూర్తయి సోమవారం నుంచి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన కాల్వ పరిస్థితులు మారే అవకాశం మెండుగా ఉంది. నాలుగేళ్ల తర్వాత మంజూరైన నిధులతో జిల్లాలోని నేరేడుచర్ల, గరిడేపల్లి, చిలుకూరు, మునగాల, నడిగూడెం మండలాల్లో దెబ్బతిన్న ఎడమ కాల్వ లైనింగ్‌, కోతకు గురై బుంగలు పడిన ప్రాంతాలతో పాటు యూటీలు, స్లూయీ్‌సల మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ పనులను సైతం వేసవిలో ప్రతిరోజూ చేపట్టనుండగా, కాల్వకు వారబంధి నిర్వహించే సమయంలో చేపట్టనున్నారు. 

44 కిలోమీటర్లకు పైగా...

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఎడమ కాల్వ పరిధిలోని 44.159 కిలోమీటర్ల పరిధిలో వివిధ రకాల పనులు చేపట్టనున్నారు. నేరేడుచర్ల మండలంలోని సాగర్‌ ఎడమ కాల్వ 87.350 కిలోమీటర్‌ మైలురాయి నుంచి 99.852 కిలోమీటర్‌ మైలురాయి వరకు మట్టితోలకం, అండర్‌ టన్నెల్‌ వద్ద సైడ్‌వాల్స్‌ నిర్మాణాన్ని రూ.19 లక్షలతో చేపట్టనున్నారు. అనంతరం 102 మైలురాయి నుంచి 102.611 మైలురాయి వరకు రూ.16 లక్షలు, 106 మైలురాయి నుంచి 114.92 కిలోమీటరు వరకు రూ.26 లక్షలతో పనులు ప్రారంభించారు. 128.946 నుంచి 131.111 కిలోమీటరు వరకు రూ.17 లక్షలు, 122.347 నుంచి 131.509 వరకు రూ.19 లక్షలు, కోదాడ మండలం రెడ్లకుంట మేజర్‌ పరిధిలోని అత్యవసర స్లూయిస్‌ పనులను రూ.19 లక్షలతో పనులు చేపట్టారు. 120.400 నుంచి 120.540 వరకు రూ.45 లక్షలతో కుడికాల్వ మరమ్మతులు, దుంగల పూడ్చివేత, జారిపోయినచోట కాల్వకట్ట లైనింగ్‌ పనులు చేపడుతున్నారు. చివరి ప్రాంతంలోని నడిగూడెం మండలంలో 122 నుంచి 125.900 కిలోమీటర్ల పరిధిలో రూ.48 లక్షలతో కోతకు గురైన కాల్వకు మరమ్మతులు చేపడుతున్నారు. అదేవిధంగా ఇందులో భాగంగా ముక్త్యాల బ్రాంచ్‌ పరిధిలోని రెడ్లకుంట మేజర్‌ అత్యవసర సూయిజ్‌ను రూ.19 లక్షలతో నిర్మించనున్నారు. ఆయా ప్యాకేజీల్లో కొన్ని టెండర్ల ప్రక్రియ దశలో ఉన్నాయి. 

గతానుభవం దృష్ట్యా...

సాగర్‌ కాల్వలకు గండి పడి పంటలతో పాటు గ్రామాలు దెబ్బతిన్న ఉదంతాలు ఉన్న నేపథ్యంలో వేసవిలో ముందస్తుగా మరమ్మతులు పనులు మొదలుపెట్టారు. గతంలో 2006లో చిలుకూరు మం డలం 106 మైల్‌రాయి వద్ద భారీ గండి పడి కాసర్లగూడెం, జెర్రిపోతులగూడెం, ఆచార్యులగూడెం, పోలేనిగూడెం, బేతవోలు గ్రామాలు పూర్తి స్థాయిలో నీటి ముంపునకు గురయ్యారు. దీంతో పెద్ద నష్టం జరిగింది. ఆయా ప్రాంతాలను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పరిశీలించి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినప్పటికీ వానాకాలం తోడు కావడంతో కాల్వకు పడ్డ గండిని పూడ్చడానికి సుమారు నెల సమయం పట్టింది. అనంతరం కాల్వల అధునీకీకరణ జరిగినప్పటికీ అక్కడక్కడ కాల్వలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అనుభవం దృష్ట్యా ముందస్తుగా పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు మొదలుపెట్టారు. 

కాల్వకట్టపై రైతులు ప్రయాణాలు చేయొద్దు  : డీఈ రఘు

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ కట్టకు మరమ్మతులు జరుగుతున్నందున పొలాలకు, ఇతర గ్రామాలకు చాకిరాల వంతెన నుంచి నడిగూడెం వంతెన వరకు ప్రయాణించే రైతులు మరమ్మతుల పనులు పూర్తయ్యే వరకు రాకపోకలు చేయవద్దు. పనులు జరుగుతున్న చోట ప్రమాద సూచికల బోర్డులు ఏర్పాటు చేసినా వాటిని తీసివేసి వెళ్తుండడంతో ప్రమాదాలు జరిగితే సమస్యలు ఏర్పడతాయి. పనులకు ఆటంకం కలుగకుండా రైతులు, ప్రజలు సహకరించాలి. 


Updated Date - 2022-05-24T06:28:00+05:30 IST