గుర్రపు డెక్కను తొలగించి రైతులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2022-10-17T06:02:35+05:30 IST
చెరువు చుట్టుపక్కల పొలాల్లో విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్క ఆకును తొలగించి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజనాయుడు కోరారు.
నేరేడుచర్ల, అక్టోబరు 16: చెరువు చుట్టుపక్కల పొలాల్లో విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్క ఆకును తొలగించి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజనాయుడు కోరారు. ఆదివారం మండలంలోని చిల్లేపల్లి చెరువు చుట్టుపక్కల పొలాలను సీపీఐ బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో చెరువు చుట్టూ ఉన్న వందలాది ఎకరాల పంట పొలాల్లో గుర్రపు డెక్క అల్లుకుందన్నారు. సదరు కాంట్రాక్టర్ నుంచి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. చిల్లేపల్లి, చింతకుంట్ల, బోడల్దిన్న గ్రామాల్లో పొలాలను వ్యవసాయాధికారులు, తహసీల్దార్ పరిశీలించి గుర్రపు డెక్క ఆకుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు రావుల సత్యం, కత్తి శ్రీనివాసరెడ్డి, చిలకరాజు శ్రీను, లక్ష్మి ఉన్నారు.