ధాన్యం సేకరణకు సిద్ధం

ABN , First Publish Date - 2022-10-07T06:26:37+05:30 IST

ఖరీఫ్‌ మరో నెలరోజుల్లో ముగియనుంది. మరో రెండువారాల్లో రైతులు పండించిన ధాన్యం చేతికిరానుంది. వరికోతలు ప్రారంభం కాగానే ధాన్యం సేకరించేందుకు జిల్లాయంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

ధాన్యం సేకరణకు సిద్ధం
భువనగిరిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం(ఫైల్‌)

రెండువారాల్లో కొనుగోళ్లు షురూ 

మద్దతు ధర క్వింటాలుకు రూ.1960 

 జిల్లాలో 286 కేంద్రాలు

యాదాద్రి, ఆక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ మరో నెలరోజుల్లో ముగియనుంది. మరో రెండువారాల్లో రైతులు పండించిన ధాన్యం చేతికిరానుంది. వరికోతలు ప్రారంభం కాగానే ధాన్యం సేకరించేందుకు జిల్లాయంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సారి ఖరీ్‌ఫలో వరి దిగుబడి రెట్టింపు స్థాయిలో 6.59లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందా? లేదా ఎఫ్‌సీఐ నేరుగా కొనుగోలు చేస్తుందా అన్న అంశంపై సందిగ్ధం నెలకొంది. అయితే వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. రెవెన్యూ, సివిల్‌ సప్లయీస్‌, డీఆర్డీవో, కోఆపరేటీవ్‌, మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రెండువారాల్లోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేయాలని ఆదేశించారు. మొదటి విడతగా భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, చౌటుప్పల్‌, రాజాపేట, చౌటుప్పల్‌, తదితర మండలాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి ప్రభుత్వం వరికి మద్దతు ధరను గ్రేడ్‌ ఏరకానికి రూ.1960, సాధారణ రకానికి రూ.1940 నిర్ణయించింది. వానాకాలంలో పండించిన వరిని సేకరించేందుకు గానూ జిల్లాలోని 17మండలాల్లోనూ రైతులు వరిని సాగు చేస్తారు. గత సంవత్సరంలో కొనుగోలు కేంద్రాల్లో రైతుల పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా వారినుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 


పారదర్శకంగా ఉండేందుకు..

ధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండేందుకు గానూ జిల్లాలోని రైతుల వివరాలను ‘ఆన్‌లైన్‌’లో పొందుపరిచారు. ఏయే మండలాల్లో ఎంతమంది రైతులు ఉన్నారన్న సమాచారంతోపాటు, రైతుల భూములకు సంబంధించిన సర్వేనెంబర్లతో సహా సెంటర్‌ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) సహకారంతో ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రాల్లోనూ రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు. కొనుగోలుకేంద్రాల నిర్వాహకులకు పౌరసరఫరాల శాఖ ట్యాబ్‌లతోపాటు ప్రింటర్లను కూడా పంపిణీ చేయనున్నారు. ధాన్యం నాణ్యతను పరిశీలించేందుకు ప్రతీకేంద్రంలోనూ అసిస్టెంట్‌ అగ్రికల్చర్‌ ఆఫీసర్‌(ఏఈవో), వీర్వోలు,తహసీల్దార్లు పర్యవేక్షించనున్నారు. కేంద్రాలవద్ద వైద్య సౌకర్యాన్ని కూడా ఏర్పాటుచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘లెవీ’సేకరణలో మార్పులు తీసుకొచ్చింది. కేంద్రం నిబంధనల ప్రకారం రైతుల వద్ద 100శాతం ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థనే కొనుగోలు చేయాలి. దీంతో పౌరసరఫరాల శాఖ మద్దతు ధరకు వరిధాన్యం సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది.


6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ వానాకాలంలో సీజన్‌లో 6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈసీజన్‌లో జిల్లాలో వరి సాధారణ సాగువిస్తీర్ణం 2,99,676హెక్టార్లు కాగా, ఈ ఏడాది 2,99,676 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేశారు. ప్రతీ హెక్టార్‌కు దాదాపు 4.5 మెట్రిక్‌ టన్నుల నుంచి 5మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. జిల్లాలో వచ్చిన ధాన్యం దిగుబడిలో స్థానికంగా ప్రజల అవసరాలు, రైస్‌ మిల్లర్లు  కొనుగోల్లు చేసే ధాన్యం మినహాయిస్తే.. మిగిలిన 6లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. గత ఖరీ్‌ఫలో జిల్లాలో దాదాపు 2.60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్‌, మార్కెటింగ్‌ శాఖల కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసింది. ఈ ధాన్యం కొనుగోళ్లకు దాదాపు 1.08కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని అంచనాలు వేస్తున్నారు. అయితే అధికారుల వద్ద ఇప్పటికే 4.11లక్షల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. మిగతా గన్నీ బ్యాగులను సమకూర్చుకోనున్నారు. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా 286 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.  


కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు : గోపీకృష్ణ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ 

జిల్లాలో ధాన్యం సేకరణకు అవసరైన ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రణాళికను రూపొందించాం. ఈ నెలాఖరు వరకు అన్ని మండలాల్లోనూ వరిపంట చేతికి వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 286కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించనున్నాం. రైతులకు కనీస మద్దతు ధర కల్పించే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు రైతులు ఆశ్రయించాలి. 

Read more