తోటలకు తెగుళ్లు

ABN , First Publish Date - 2022-03-05T06:36:22+05:30 IST

ఆరుగాలం కష్టపడి వరి, మెట్ట పంటలు సాగుచేసి నా లాభదాయకం కాకపోవడంతో రైతులు పండ్లతోటల సాగుపై దృష్టిసారించారు. ఎర్రనేలలు, నీటి వసతి ఉండటంతోపాటు ప్రభుత్వం ప్రోత్సాహం కూడా తోడవుతుండటంతో ఉమ్మడి జిల్లాలో చాలామంది రైతులు తోటల పెంపకం చేస్తున్నారు.

తోటలకు తెగుళ్లు
మామిడి తోటలో తామర పురుగు ఆశించి వాడిపోయిన పూత

మామిడి పూతకు తామర పురుగు

రెండేళ్లుగా నష్టపోతున్న రైతులు


మోత్కూరు : ఆరుగాలం కష్టపడి వరి, మెట్ట పంటలు సాగుచేసి నా లాభదాయకం కాకపోవడంతో రైతులు పండ్లతోటల సాగుపై దృష్టిసారించారు. ఎర్రనేలలు, నీటి వసతి ఉండటంతోపాటు ప్రభుత్వం ప్రోత్సాహం కూడా తోడవుతుండటంతో ఉమ్మడి జిల్లాలో చాలామంది రైతులు తోటల పెంపకం చేస్తున్నారు. నాలుగైదేళ్లు కష్టపడితే ఆ తర్వాత మంచి ఆదాయం వస్తుందని ఆశించగా, రెండేళ్లు కరోనాతో మామిడి, బత్తాయి, నిమ్మ తదితర పంటల దిగుబడులను విక్రయించలేక నష్టపోయారు. ఈ ఏడాది వాతావరణ మార్పులతో తెగుళ్లు సోకడం పండ్ల తోటల రైతులను కుంగదీస్తోంది.


ఉమ్మడి జిల్లాలో 85వేల ఎకరాలకుపైగా పండ్ల తోటలు సాగవుతున్నాయి. యాదాద్రి జిల్లాలో 11,968 ఎకరాల్లో మామిడి తోటలు, 870 ఎకరాల్లో బత్తాయి, 860 ఎకరాల్లో నిమ్మ తోటలు సాగువుతున్నాయి. నల్లగొండ జిల్లాలో 2,150 ఎకరాల్లో మామిడి, 43,672 ఎకరాల్లో బత్తాయి, 9వేల ఎకరా ల్లో నిమ్మ, సూర్యాపేట జిల్లాలో 11,886 ఎకరాల్లో మామిడి, 427 ఎకరాల్లో బత్తాయి, 4,473 ఎకరాల్లో నిమ్మ తోటలు సాగవుతున్నాయి.


మామిడి తోటల్లో రాలుతున్న పూత

మామిడి తోటలు ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్నా యి. కాగా, ఈ దశలో మామిడి పూతకు తామర పురుగు ఆశించి పూత రాలుతోంది. పగలు ఎండలు ఉన్నా, ఉదయం కురుస్తున్న మంచు కారణంగా మామిడి తోటల్లో తామర పురుగు ఉధృతి పెరిగింది. తామర పురుగు ప్రధానంగా పూతలోని రసాన్ని పీలుస్తోంది. ఫలితంగా పూత రాలి కాడ లు వాడిపోయి ఎండుతున్నాయి. ఇప్పటికే చెట్లకు పిందె రావల్సి ఉండగా, తోటలు ఇంకా పూత దశలోనే ఉన్నాయి. అక్కడక్కడ కంది గింజ సైజులో పిందెలు మాత్రమే కనిపిస్తున్నాయి. తామర పురుగుకు తోడు సాయంత్రం వేళ విపరీతమైన దోమ ఆశిస్తోంది. దోమలు సైతం రసాన్ని పీల్చి తోటలకు నష్టం చేస్తున్నాయని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూత రాలుతుండటంతో రైతులు పురు గు మందుల దుకాణాలకు వెళ్లి వారి ఇచ్చిన మందులు పిచికారి చేస్తున్నారు. దీంతో తెగులు తగ్గకపోగా, రైతులపై ఆర్థికభారం పడుతోంది.


నిమ్మను ఆశించిన గజ్జి తెగులు

నిమ్మ తోటలను గజ్జి తెగులు ఆశించింది. దీంతో నిమ్మ కాయలపై గోధుమ రంగులో బొడిపెలు వచ్చి మచ్చలు ఏర్పడుతున్నాయి. కాయపై తెలుపు, పసుపురంగులో మచ్చ లు ఏర్పడి నిమ్మకాయ నాణ్యత దెబ్బతింటోంది. ఫలితంగా మార్కెట్‌లో నిమ్మకాయలు అమ్ముడుపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


బత్తాయి రైతులను కుంగదీస్తున్న మంగు

బత్తాయికి మంగు తెగులు సోకింది. ఈ తెగులుతో కా య నల్లగా మారుతోంది. అంతేగాక పండు రుచిలో కూడా తేడా ఉంటుందని రైతులు చెబుతున్నారు. చూడటానికి నల్లగా మారడంతోపాటు, రుచిలోనూ తేడా ఉంటుండటం తో మంగు సోకిన బత్తాయి కాయలను  విక్రయించడం కష్టమని రైతులు ఆందోళన చెందుతున్నారు.


రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి

యాదాద్రి జిల్లాలోని మోత్కూరు, ఆత్మకూరు(ఎం), గుండాల, మోటకొండూరు మండలాల్లో పండ్ల తోటలను కొండమల్లేపల్లి ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ కె.వెంకటరమేష్‌ ఇటీవల పరిశీలించారు. మామిడిలో తామర పురుగు, నిమ్మలో గజ్జి తెగులు, బత్తాయికి మంగు తెగులు ఆశించినట్టు గుర్తించి రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకుంటే తెగుళ్ల నుంచి తోటలను కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. మామిడిలో తామర పురుగు నివారణకు లీటరు నీటికి 3ఎంఎల్‌ ఇమిడాక్లోప్రిడ్‌ కలిపి పిచికారీ చేయాలని, పూత, పిందె రాలడాన్ని తగ్గించేందుకు 200లీటర్ల నీటికి 50ఎంఎల్‌ ప్లానోఫిక్స్‌ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. నిమ్మలో గజ్జి తెగులు నివారణకు ఒక లీటరు నీటికి 3గ్రాముల బైటాక్స్‌ కలిపి పిచికారీ చేయాలని, బత్తాయిలో మంగు నివారణకు ఒక లీటర్‌ నీటికి 3ఎంఎల్‌ డైకోఫోల్‌ఓమైట్‌ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. దీంతో తెగుళ్ల ఉధృతిని అరికట్టడంతోపాటు తోటలను కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు.


మామిడి పూత రాలుతోంది : చంద్రయ్య, మామిడి రైతు, కొండాపురం

నాకు అర ఎకరం మామిడి తోట ఉండగా, మరో మూడు ఎకరాల తోటను కౌలుకు తీసుకున్నా. మామిడి పూతకు తామరపురుగు ఆశించింది. తామర పురుగు రసం పీల్చడంతో పూత ఉన్న కాడ పూర్తిగా వాడి ఎండిపోతోం ది. దూరం నుంచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. పూత కాడ పట్టుకుని దులిపితే పురుగు రాలి కిందపడుతోంది. పూత కాడలు ఎండుతుండటంతో పిందెలు పడటం లేదు. దీంతో దిగుబడి తగ్గి కౌలు కూడా వెళ్లేలా లేదు.


వరికి తెగుళ్ల బెడద

పాలకవీడు: యాసంగి వరి పంటకు తెగుళ్ల బెడద అధికమైంది. ప్రస్తుతం పంటు ఏపుగా పెరగ్గా, అగ్గి, పాముపొడ, నల్ల, ఆకు ముడత తెగుళ్లతోపాటు దోమకాటు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా యాసంగిలో తెగుళ్లును తట్టుకునే 1010 రకం ధాన్యాన్ని రైతులు సాగు చేసేవారు. అయితే వీటికి డిమాండ్‌ తగ్గడంతో సన్న రకాలైన చింట్లు, పూజ, హెచ్‌ఎంటీ రకాలను మండల రైతులు అధికంగా సాగుచేశారు. వీటి పంటకాలం 110 రోజులు కాగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను ఇవి తట్టుకోలేక తెగుళ్ల బారిన పడుతున్నాయి. దీనికి తోడు జింకు ధాతు లోపం కూడా కారణమైంది. రైతులు ఎన్ని పురుగు మందులు పిచికారీ చేస్తున్నా తెగుళ్లు అదుపులోకి రాకపోవడంతో పలువురు రైతులు పంటపై ఆశలు వదులుకుంటున్నారు. తెగుళ్లను నివారించేందుకు రైతులు మూడు నుంచి నాలుమార్లు పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. ఒక సారి పురుగు మందు పిచికారీకి సుమారు రూ.3000లకు పైగా ఖర్చవుతోంది. దీంతో పెట్టుబడి పెరిగడంతోపాటు తెగుళ్లు అదుపులోకి రాక నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-03-05T06:36:22+05:30 IST