నేత్రపర్వంగా ఊంజల్‌ సేవోత్సవం

ABN , First Publish Date - 2022-12-31T00:32:01+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం ఉదయం ధనుర్మాస వేడుకలు, నిత్యవిధి కైంకర్యాలు, సాయంత్రం ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవాపర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. ప్రభాతవేళ సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు గర్భగుడిలోని సువర్ణ ప్రతిష్ఠా అలంకార కవచమూర్తులను 108 బంగారు పుష్పాలతో అర్చించారు.

నేత్రపర్వంగా ఊంజల్‌ సేవోత్సవం
ఆలయ తిరువీధుల్లో ఆండాళ్‌ అమ్మవారిని ఊరేగిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, డిసెంబరు 30: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం ఉదయం ధనుర్మాస వేడుకలు, నిత్యవిధి కైంకర్యాలు, సాయంత్రం ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవాపర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. ప్రభాతవేళ సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు గర్భగుడిలోని సువర్ణ ప్రతిష్ఠా అలంకార కవచమూర్తులను 108 బంగారు పుష్పాలతో అర్చించారు. స్వయంభువులకు, ప్రతిష్ఠా అలంకారమూర్తుల నిజాభిషేకం, సహస్రనామార్చనలు, అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శ న నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణ పర్వాలు ఆస్థాన పరంగా కొనసాగాయి. కొండపైన అనుబంధ శివాలయంలో కొలువుదీరిన రామలింగేశ్వరుడికి, ముఖమండపంలోని స్పటిక మూర్తులకు నిత్యార్చనలు, రుద్రహవ న పూజా కైంకర్యాలు ఆస్థానంగానే నిర్వహించారు. కాగా రాష్ట్రపతి పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం వేళ ప్రధానాలయంలో ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాలు, వజ్రాభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని ప్రధానాలయ తిరువీధుల్లో ఊరేగించి అద్దాల మండపంలో వేదమంత్ర పఠనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనృసింహుడి సన్నిధిలో తిరుప్పావై పర్వాలు, స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం వైభవంగా నిర్వహించారు.

10.40గంటల నుంచి దర్శనాలు

యాదగిరిక్షేత్రంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పర్యటన ముంద స్తు షెడ్యూల్‌ కన్నా ముందుగా 20నిమిషాల ముందుగా ఉదయం 10.30 గంటలకు ముగిసింది. దీంతో దేవస్థాన అధికారులు రాష్ట్రపతి హెలీప్యాడ్‌కు చేరుకున్న అనంతరం ఉదయం 10.40గంటల నుంచి సామాన్య భక్తులను కొండపైకి అనుమతించి స్వయంభువుల దర్శనం కల్పించారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభం

యాదగిరిక్షేత్రంలో ఉత్తర దిశలో నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను శుక్రవారం రాచకొండ పోలీస్‌ కమీషనర్‌ మహేష్‌ ఎం.భగవత్‌, దేవస్థాన ఈవో గీతారెడ్డి ప్రారంభించారు. ముందుగా సంప్రదాయరీతిలో దేవస్థాన అర్చకబృందం పూజలు నిర్వహించగా వారు రిబ్బన్‌ కట్‌ చేసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభించి పనితీరును పరిశీలించారు.

Updated Date - 2022-12-31T00:32:02+05:30 IST