550పడకల ఆస్పత్రికి ఒకే రేడియాలజిస్ట్
ABN , First Publish Date - 2022-12-16T01:40:52+05:30 IST
వైద్య కళాశాలకు అనుసంధానంగా ఉన్న జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో 550 పడకలు ఉన్నాయి. నిత్యం 500 నుంచి 600 ఓపీ ఉంటుంది.
జిల్లా కేంద్ర జనరల్ ఆస్పత్రిలో ఇదీ పరిస్థితి
నల్లగొండ అర్బన్, డిసెంబరు 15: వైద్య కళాశాలకు అనుసంధానంగా ఉన్న జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో 550 పడకలు ఉన్నాయి. నిత్యం 500 నుంచి 600 ఓపీ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్క రేడియాలజిస్ట్ మాత్రమే ఉన్నారు. అంతేగాక రెండు ఎక్స్‌రే యంత్రాల్లో ఒకటి మరమ్మతులకు గురైంది. దీంతో ఇక్కడి వచ్చే రోగులు ఎక్స్‌రే కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇన్పేషంట్లకు ఎక్స్‌రే తీయాల్సి వస్తే వారి బాధ వర్ణనాతీతం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్, టెక్నీషియన్ల కొరత వేధిస్తోంది. ఆస్పత్రికి ప్రతీరోజు సుమారు 500 నుంచి 600 మంది ఓపీ వైద్యం కోసం వస్తుంటారు. నిత్యం 100 నుంచి 150 మందికి ఎక్స్‌రే అవసరం ఉంటుంది. కాగా, ఆస్పత్రి మొత్తానికి ఒక్క రేడియాలజిస్టే ఉన్నాడు. ఆ ఒక్కడే ఎక్స్‌రే విభాగంతోపాటు, ఐసీయూ, సీటీస్కాన్ విభాగానికి సైతం సేవలందిస్తున్నాడు. నిబంధనల ప్రకారం కనీసం ఆరుగురు రేడియాలజిస్టేలు, ఐదుగురు టెక్నీషియన్లు ఉండాలి. కానీ ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. ఒక్కడిపైనే పనిభారం పడుతుండగా, అతడు సెలవు తీసుకుంటే ఆ రోజు ఎక్స్‌రే సేవలు బంద్ అవుతున్నాయి. సూర్యాపేట ఆస్పత్రిలో ఎక్స్‌రే విభాగంలో 12 మంది సిబ్బంది ఉండగా, ఇక్కడ మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నిత్యం వందలాది మంది వచ్చే ఆస్పత్రిలో ఎక్స్‌రే విభాగంలో అధునాతన యంత్రాలు ఉన్నా సరైన సిబ్బంది, యంత్రాలు మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్ లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరమ్మతుకు గురవుతున్నా
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెండు ఎక్స్‌రే యంత్రాలు ఉన్నాయి. ఒకటి ఊపిరితిత్తులకు ఎక్స్‌రే తీసేది కాగా, ఇంకొకటి ఎముకలను ఎక్స్‌రే తీసే యంత్రం. కాగా, ఊపిరితిత్తులకు ఎక్స్‌రే తీసే యంత్రం మరమ్మతులకు గురై చాలా రోజులైనా సిబ్బంది లేక పట్టించుకునే నాథుడే లేడు. ఆస్పత్రికి నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వైద్యం కోసం వస్తున్నారు. ఆర్థో, నరాల సమస్యలతో వచ్చే వారికి ఎక్స్‌రే తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. రోగులు ఎక్స్‌రే కోసం వెళ్తే మరమ్మతులకు గురైందని చెబుతుండటంతో బయట ఉన్న ప్రైవేటుకు ల్యాబ్‌లకు వెళ్లి ఎక్స్‌రే తీయించుకుంటున్నారు. ఆస్పత్రిలోని ఎక్స్‌రే విభాగంలో సీఆర్ మిషన్, ఫిలిం ప్రింటర్ మరమ్మతులకు గురై 10రోజులకుపైగా అయింది. వాటిని మరమ్మతు చేయించాలనే ఆలోచన సంబంధిత అధికారులకు రాకపోవడమేంటని రోగులు ప్రశ్నిస్తున్నారు. మరమ్మతులకు ఆస్పత్రిలో టెక్నీషియన్లు లేరు. దీంతో సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం ఉండటం లేదు. ఇప్పటికైనా యంత్రాలకు మరమ్మతులు చేయించడంతోపాటు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని రోగులు, వారి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
మెడనొప్పి వచ్చిందని ఆస్పత్రికి వస్తే : సింగం లక్ష్మీనారాయణ, నల్లగొండ
మెడనొప్పి వస్తుండడంతో రెండు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చా. డాక్టర్‌కు చూపించగా, ఎక్స్‌రే తీసుకురమ్మన్నారు. ఎక్స్‌రే కోసం వెళ్తే యంత్రం మరమ్మతులకు గురైందని, రెండు రోజుల తర్వాత రావాలని చెప్పారు. రెండు రోజుల తర్వాత వస్తే అదే మాట మళ్లీ చెప్పారు. అసలు యంత్రం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదంటున్నారు. దీంతో ప్రైవేట్ ల్యాబ్‌లో ఎక్స్‌రే తీయించి డాక్టర్‌కు చూపించా.
సిబ్బంది కొరత వాస్తవమే : డాక్టర్ లావుడి లచ్చు, ఆస్పత్రి సూపరింటెండెంట్
ఎక్స్‌రే విభాగంలో రేడియాలజిస్టులు, టెక్నీషియన్ల కొరత ఉన్నది వాస్తవమే. మూడు షిఫ్ట్‌ల ప్రకారం విధులు నిర్వహించేందుకు సరిపడా సిబ్బంది లేక కొంత ఇబ్బంది ఎదురవుతోంది. అయినా రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్న సిబ్బందికి డ్యూటీలు వేస్తున్నాం. సిబ్బంది కొరత విషయం ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించాం. అనుమతి వస్తే కొత్త సిబ్బందిని నియమిస్తాం. ఎక్స్‌రే యంత్రానికి మరమ్మతు చేయించేందుకు సంబంధిత ఇంజనీర్‌కు సమాచారం ఇచ్చాం. త్వరలో ఎక్స్‌రే సేవలు రోగులకు అందుబాటులోకి వస్తాయి.