By-Election: మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలనే పట్టుదలలో కమలదళం
ABN , First Publish Date - 2022-08-14T20:47:52+05:30 IST
మునుగోడు ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలిచి తీరాలని బీజేపీ నిర్ణయించింది.

హైదరాబాద్ (Hyderabad): మునుగోడు (Munugodu) ఉప ఎన్నికను (By-Election) సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న బీజేపీ (BJP) ఖచ్చితంగా గెలిచి తీరాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారాన్ని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21న మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రకటించారు. అయితే అమిత్ షా సభ వాయిదా పడిందని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అమిత్ షాకు వేరే కార్యక్రమాలు ఉండడంతో ఈనెల 29కి మారే అవకాశం ఉందని వార్తలొచ్చాయి.
అయితే మునుగోడు సభ యధావిధిగా ఈనెల 21న జరుగుతుందని బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. దీంతో బీజేపీ నేతలు సభ కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా సభను కమలనాథులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిలో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అమిత్ షాకు ఘనస్వాగతం పలకాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఒకవేళ అమిత్ షా రోడ్డు మార్గంలో వెళితే హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు భారీ కాన్వాయ్‌తో తీసుకువెళ్లాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది.