మాస్టర్‌ప్లాన్ ఎప్పుడో?
ABN , First Publish Date - 2022-12-16T01:24:04+05:30 IST
అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడింది. ఇటీవల సూర్యాపేట మునిసిపాలిటీలో పలు గ్రామాలు విలీనమయ్యాయి.
పేట మునిసిపాలిటీలో విలీనమైన పలు గ్రామాలు
పెరిగిన విస్తీర్ణం, జనాభా
ప్రతిపాదనలు పంపి ఏడాదైనా అమలుకు నోచని వైనం
సూర్యాపేటటౌన్, డిసెంబరు 15: అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడింది. ఇటీవల సూర్యాపేట మునిసిపాలిటీలో పలు గ్రామాలు విలీనమయ్యాయి. అయితే రోజు రోజుకూ పట్టణంలో పెరుగుతున్న జనాభా ప్రకారం మాస్టర్‌ప్లాన్ అమలవడంలేదు. భవిష్యత్‌ను సుమారు 30 నుంచి 40 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని పట్టణ అబివృద్ధిపై మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తారు. 1982లో ఉన్న మాస్టర్‌ప్లానే ప్రస్తుతం జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో అమలవుతోంది. అయితే నూతన మాస్టర్‌ప్లాన్ అమలైతే పేట అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది. కోదాడ మునిసిపాలిటీకి ప్రస్తుతం మాస్టర్‌ప్లాన్ లేకపోవడంతో నూతనంగా రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. అదే విధంగా నూతనంగా ఏర్పడిన తిరుమలగిరి, నేరేడుచర్ల మునిసిపాలిటీల మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నారు. మాస్టర్ప్లాన్లపై గత ఏడాది ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, పుర ప్రముఖుల అభిప్రాయాలు తీసుకొని ఏడాది క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయినా నేటికీ ఆ ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడంలేదు.
విలీన గ్రామాలతో పెరిగిన విస్తీర్ణం
సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలో ఇటీవల పలు గ్రామాలు విలీనమయ్యాయి. గతంలో పట్టణంలో 34వార్డులు ఉండగా, ప్రస్తుతం 48వార్డులు ఉన్నాయి. మండల పరిధిలోని గాంధీనగర్, కుసుమవారిగూడెం, కుప్పిరెడ్డిగూడెం, చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ, బీబీగూడెం, దురాజ్పల్లితోపాటు పిల్లలమర్రి, రాయినిగూడెం గ్రామాలు పేట మునిసిపాలిటీలో విలీనం అయ్యాయి. గతంలో పట్టణంలో సుమారు 1.40లక్ష జనాభా ఉండగా విలీన గ్రామాలతో మరో 35,000 పెరిగింది. అదే విధంగా పేట విస్తీర్ణం చుట్టూ సుమారు 6కిలోమీటర్ల మేర పెరిగింది.
మాస్టర్‌ప్లాన్ అమలైతే అభివృద్ధి
సూర్యాపేట మునిసిపాలిటీలో మాస్టర్‌ప్లాన్ అమలైతే పట్టణం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గతంలో సూర్యాపేట మునిసిపాలిటీని 30 నుంచి 40 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని పట్టణానికి ప్రణాళిక రూపొందించారు. దాని అనుగుణంగానే ప్రధాన రహదారులు ఏర్పాటయ్యాయి. అదేవిధంగా పాదచారులకు రహదారిని కేటాయించారు. ప్రస్తుతం 1982లో రూపొందించిన మాస్టర్‌ప్లానే అమలవుతోంది. నూతన మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం తెలిపితే ఇంటి నిర్మాణాల విషయంలో అన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటేనే అనుమతులు లభిస్తాయి. దీంతోపాటు ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు సమకూరనున్నాయి. మునిసిపాలిటీ పరిధిలో మరో 10కిలోమీటర్ల మేర అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా పట్టణ ప్రకృతివనాలు, పార్కులు అభివృద్ధి చెందనున్నాయి. అంతేగాక అక్రమ వెంచర్లను అరికట్టవచ్చు. పరిశ్రమల నిర్మాణానికి పట్టణానికి దూరంగా అనువైన స్థలం కేటాయిస్తారు. దీంతో పట్టణం చుట్టూ పరిశ్రమలు విస్తరించే అవకాశం ఉంటుంది. పేటలో ప్రస్తుతం ఇరుకు రహదారులు, మురుగుకాల్వల ఆక్రమణలకు గురవుతున్నాయి. అక్రమ కట్టడాల నిర్మూలనకు మునిసిపాలిటీలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినా వీటిని నిలువరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్‌ప్లాన్ అమలైతే వీటికి చెక్ పడుతుందని, అభివృద్ధి విస్తరిస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
తుదిదశకు వచ్చింది : బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, సూర్యాపేట మునిసిపల్ కమిషనర్
సూర్యాపేట మునిసిపాలిటీ మాస్టర్‌ప్లాన్ తుదిదశకు వచ్చింది. మాస్టర్‌ప్లాన్‌తో పట్టణం మరింత అబివృద్ధి జరిగే అవకాశం ఉంది. 30నుంచి 40 ఏళ్ల ముందుచూపుతో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు కొనసాగుతాయి.