Komatireddy Rajagopal Reddy పార్టీ మారనున్నారా..మునుగోడు కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది..!?
ABN , First Publish Date - 2022-06-03T17:21:20+05:30 IST
మునుగోడు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్‌కు మిగిలిన ఏకైక నియోజకవర్గం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్‌లో

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడులో కాంగ్రెస్ రాజకీయాలు సందిగ్థంలో పడ్డాయి. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. కానీ ఆయన తీరు పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. ఆయన పార్టీ మారిపోతారనే ప్రచారంతో కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ముందుజాగ్రత్తగా మునుగోడు టిక్కెట్ తమకే ఇవ్వాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారుట. మరి ఆనేతలు ఎవరు... రాజగోపాలరెడ్డి నిజంగానే పార్టీ మారాతారో లేదో మరిన్ని విషయాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
రాజగోపాల్ తీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తి
మునుగోడు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్‌కు మిగిలిన ఏకైక నియోజకవర్గం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో అనే అనుమానాన్ని నిరంతరం కలిగిస్తుంటారు. ఎప్పడూ స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తుంటారు. వీలుచేసుకుని మరీ బీజేపీని పొగుడుతుంటారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఏకంగా రాహూల్‌గాంధీ వరంగల్ సభకు కూడా డుమ్మా కొట్టారు. దీంతో మునుగోడులో పార్టీ కేడర్ రాజగోపాల్ తీరుపై సందిగ్థంలో పడిపోయింది. ఆయన పార్టీలో ఉన్నారా లేరా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతోంది. ఆయనేమో అధికారికంగా ఏమీ ప్రకటించరు. కేడర్కేమో సందేహం తీరదు.
పార్టీ స్టార్ కాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాజగోపాల్‌రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో నల్లగొండ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక వెంకటరెడ్డి స్థానంలో భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని రాజగోపాలరెడ్డి సిద్ధమవుతున్నారని సమాచారం. అయితే ఆయన పోటీ కాంగ్రెస్ నుంచా, బీజేపీ నుంచా అనే క్లారిటీ లేదు. ఇప్పటికే రాజగోపాలరెడ్డి తీరు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. దీంతో వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ నుంచి టిక్కెట్ దక్కడం కష్టం కావచ్చనే ప్రచారం ఉంది. దీంతో రాజగోపాలరెడ్డి పార్టీ మారడం పక్కా అంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీకి నెక్ట్స్ లీడర్ ఎవరు అనే చర్చ ఊపందుకుంది.

వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ పక్కా అని స్రవంతి ఫిక్స్
2014, 2018 మునుగోడు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించిన వారిలో పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్, పున్న కైలాస్ ఉన్నారు. వీరిలో పాల్వాయి స్రవంతి రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె. ఆమె ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. కేడర్‌తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు.ఈమె గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 30 వేల ఓట్లు పొందారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఈమెకు దగ్గరి బంధుత్వం ఉంది. పైగా తండ్రి పలుకుబడి ఎటూ ఉండనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ పక్కా అని స్రవంతి ఫిక్స్ అయ్యారంటున్నారు.

జేఏసీలో చురుకైన పాత్ర పోషించిన కైలాష్ పద్మశాలి
ఇక పున్న కైలాష్కు విద్యార్థినాయకుడిగా పేరుంది. జేఏసీలో చురుకైన పాత్ర పోషించిన అనుభవమూ ఉంది. ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో ఓయూ జేఏసీ నేతగా జాతీయస్థాయి నేతల దృష్టిని ఆకర్షించారు. మునుగోడులో బీసీల ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నాయి. కైలాష్ పద్మశాలి వర్గానికి చెందినవారు. బీసీల ఓట్ షేర్ రీత్యా తనకు కాంగ్రెస్ టిక్కెట్ కేటాయిస్తే గెలుపు సునాయసమని ఆయన నమ్ముతున్నారు. ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ అధినేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నా పల్లె రవికుమార్
ఇక మరో నేత పల్లె రవికుమార్ గౌడ్ తెలంగాణ జర్నలిస్టు ఫోరం నేతగా ప్రసిద్ధి పొందారు. తెలంగాణ ఉద్యమంలో పని చేశారు. ధూమ్ ధామ్ కార్యక్రమాలు నిర్వహించిన అనుభం ఉంది. నాటి ప్రజారాజ్యం పార్టీ నుండి నేటి వరకు ఎలాగైనా టికెట్ సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారు . 2018 ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన భార్య కళ్యాణి గెలిపించి చండూరు ఎంపీపీగా చేశారు. రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారట.
మరి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగితే వీరి ఆశలపై నీళ్ళు చల్లినట్టే... లేదంటే ఈ ముగ్గురిలో ఎవరికి టిక్కెట్ కేటాయించాలనే విషయం కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా సమస్యగా మారొచ్చు.
