పోలీసుల అదుపులో వసూల్ రాజాలు?
ABN , First Publish Date - 2022-03-05T06:28:47+05:30 IST
అధిక వడ్డీల ఆశ చూపి ప్రజల నుంచి రూ.20 కోట్ల మేర వసూలు చేసిన ఇద్దరిని యాదాద్రిభువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
6న కువైట్ వెళ్లేందుకు ప్రధాన నిందితుడి ప్రయత్నం?
ముందస్తుగా ఇద్దరు నిందితుల పాస్‌పోర్టులు స్వాధీనం?
అధిక వడ్డీ ఆశ చూపి రూ.20 కోట్లు వసూలు చేసిన నిందితులు
భువనగిరి రూరల్, మార్చి 4 : అధిక వడ్డీల ఆశ చూపి ప్రజల నుంచి రూ.20 కోట్ల మేర వసూలు చేసిన ఇద్దరిని యాదాద్రిభువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనగిరి పట్టణంలోని పహడీనగర్కు చెందిన అబ్దుల్ రహమాన్ దుబాయ్‌లో ఉంటూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. దుబాయ్‌లో ఉంటూ భువనగిరికి వచ్చి వెళుతుంటాడు. రూ.50వేలు అప్పుగా ఇస్తే రూ.లక్ష, లక్షకు రూ.2 లక్షలు అధిక వడ్డీ ఇస్తానని రహమాన్ నమ్మబలికి డబ్బు వసూలు చేశాడు. భువనగిరి పట్టణంలోని ఖాజామహిల్లాకు చెందిన మహ్మద్ షాకీర్ ద్వారా పలువురు రహమాన్‌కు అప్పులు ఇచ్చారు. హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ, ఖమ్మం జిల్లాలకు చెందిన సుమారు 200మంది నుంచి మొత్తం రూ.20కోట్ల మేర వసూలు చేసినట్లు తెలిసింది. అప్పు ఇచ్చిన వారికి ప్రామిసరీనోట్లు, బాండ్లపై షాకీర్ సంతకం చేశాడు. ముందుగా అప్పు ఇచ్చిన వారిలో కొంతమందికి అధిక వడ్డీలు చెల్లించారు. అయితే పక్కాగా డబ్బులు వస్తున్నాయన్న నమ్మకంతో కొంతమంది ఎక్కువ మొత్తంలో అప్పు ఇచ్చారు. నెలలు గడుస్తున్నప్పటికీ తీసుకున్న డబ్బు ఇవ్వకపోగా, వడ్డీ కూడా చెల్లించకపోవటంతో బాధితులంతా గురువారం రాత్రి పోలీసుస్టేషన్‌కు చేరుకుని, న్యాయం చేయాలని ఫిర్యాదుచేశారు. తన వద్ద రహమాన్ రూ.20 కోట్లు తీసుకుని మోసంచేశారని మహ్మద్ షాకీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో బాధితులు ధర్నాకు దిగారు. పూర్తి ఆధారాలతో వచ్చి ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామని పట్టణ ఇన్స్పెక్టర్ బీ.సత్యనారాయణ హామీ ఇవ్వ టంతో బాధితులు ఆందోళన విరమించారు. ఈ క్రమంలో పలువురు బాధితులు పోలీ్‌సస్టేషన్‌లో ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి బ్యాంక్ పుస్తకాలతో పాటు పాస్‌పోర్టులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న రెహమాన్ కువైట్‌కు వెళ్లేందుకు సిద్ధపడుతుండటంతో ముందుగా అతడి పాస్‌పోర్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఏదిఏమైనప్పటికీ తమ డబ్బులను తమకు వారి వద్ద నుంచి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రజల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు చేయడంతో ఈ కేసును కమిషనర్ పర్యవేక్షణలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుల అరెస్టు, కమిషనరేట్‌లో విచారణను పోలీసులు ధ్రువీకరించడం లేదు.
