డిండి ఎత్తిపోతల పూర్తయ్యేదెన్నడో?
ABN , First Publish Date - 2022-06-12T06:21:12+05:30 IST
ఇంటికి రెండు ఉద్యోగాలు అన్నారు. ఇచ్చిన భూమికి రెట్టింపు ఇస్తామన్నారు. ఇంకేముంది నిర్వాసితుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఇక తమ కష్టాలు తీరుతాయనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నాయి హామీలు నెరవేరడంలేదు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడేళ్లు పూర్తయినా డిండిపోతల పథకం పనులూ పూర్తికాలేదు, నిర్వాసితుల ఆశలు నెరవేరలేదు.
నేటితో ప్రాజెక్టు శంకుస్థాపనకు ఏడేళ్లు పూర్తి
రెండున్నరేళ్లకే పూర్తి చేస్తామని అప్పట్లో కేసీఆర్ హామీ
ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తామన్నారు..
భూమికి రెట్టింపు అన్న హామీల అమలేదీ?
ఇంకా ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే
ముంపు గ్రామాలకు పునరావాసం కరువు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): ఇంటికి రెండు ఉద్యోగాలు అన్నారు. ఇచ్చిన భూమికి రెట్టింపు ఇస్తామన్నారు. ఇంకేముంది నిర్వాసితుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఇక తమ కష్టాలు తీరుతాయనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నాయి హామీలు నెరవేరడంలేదు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడేళ్లు పూర్తయినా డిండిపోతల పథకం పనులూ పూర్తికాలేదు, నిర్వాసితుల ఆశలు నెరవేరలేదు.
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసి ఆదివారం నాటికి ఏడేళ్లు పూర్తవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత 2015 సంవత్సరం జూన్ 12వ తేదీన ప్రాజెక్టు పనులకు శంకుస్థాన చేశారు. మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఈ ప్రాజెక్టు పనులకు అంకురార్పణ చేశారు. శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు గుప్పించారు. ప్రాజెక్టును రెండున్నరేళ్లలోనే పూర్తిచేసి ఉమ్మడి జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగు, తాగు నీరు ఇస్తామని ప్రకటించారు. ఫ్లోరిన్ పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.6,200 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంది. అయితే శంకుస్థాపన చేసి ఏడేళ్లు పూర్తవుతు న్నా ఈ ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైంది. ఈ ప్రాజెక్టు పూర్తయి తే వెనుకబడిన ప్రాంతాలైన నల్లగొండ, దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాలతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందుతాయని ప్రజలు ఎంతో ఆశించారు. కానీ ప్రజలకు నిరాశ తప్పడం లేదు. అదేవిధంగా భూ నిర్వాసితులకు సైతం ఇప్పటికీ ఎలాంటి పరిహారం అందలేదు.
ప్రాజెక్టు నుంచి నీటి తరలింపునకు ప్రణాళిక ఇలా
కృష్ణాజలాలను శ్రీశైలం జలాశయంనుంచి లిఫ్ట్ చేసి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించాలనే లక్ష్యంగా పెట్టుకుని ఏడేళ్ల కిందట ప్రాజెక్టు పనులు చేపట్టినప్పటికీ నేటి కీ పరిస్థితి అధోఃగతిగా ఉంది. శ్రీశైలం జలాశ యం నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పు న 60రోజుల వరద నీటిని నార్లాపూర్ జలాశయంలోకి ఎత్తి పోసి అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా డిం డి జలాశయంలోకి గ్రావిటీ ద్వారా నీటిని తరలించా ల్సి ఉంటుంది. అక్కడి నుంచి 93 కిలోమీటర్లు ప్రధాన కాల్వల ద్వారా ఇటు నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోని భూములకు నీటి కేటాయింపులు చేయాలని యోచించా రు. నల్లగొండ జిల్లాలో 3,09,950 ఎకరాలకు, మహబూబ్‌నగర్ జిల్లాలోని 31,550 ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉంటుంది. ఈ ప్రధాన కాల్వల పరిధి లో రిజర్వాయర్లు నిర్మించి వాటి ద్వారా ఆయకట్టుకు నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. దేవరకొండ నియోజకవర్గంలోని గుండ్లపల్లి పరిధిలో 24,300 ఎకరాలకు, చందంపే ట మండలంలో 14వేల ఎకరాలు, దేవరకొండ మండలంలో 49,120 ఎకరాలు, పీఏపల్లి మండలం లో 12,020 ఎకరాలు, చింతపల్లి మండలంలో 29,985 ఎకరాలు, మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు మండలానికి 24,515 ఎకరాలు, చండూరు మండలంలో 31,685 ఎకరాలు, నాంపల్లి మండలంలో 49వేల ఎకరాలు, మర్రిగూడెం మండలంలో 22వేల ఎకరాలు, చౌటుప్పల్ మండలంలో 2వే ల ఎకరాలకు, సంస్థాన్‌నారాయణపురం మండలంలో 22 వేల ఎకరాలకు, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలానికి 25,467 ఎకరాలు, నల్లగొండ నియోజకవర్గంలోని కనగల్ మండలంలో 2,855 ఎకరాలు, నల్లగొండ మండలంలో వెయ్యి ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంటుంది. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని వెలిదండ మండలానికి 2,400 ఎకరాలకు, మాడ్గులపల్లి మండలానికి 16,050 ఎకరాలు, అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట మండలానికి వెయ్యి ఎకరాలకు, వంగూరు మండలానికి 9,100 ఎకరాలు, ఉప్పునూతల మండలానికి 3వేల ఎకరాల కు నీరు అందించాల్సి ఉంది.
నెరవేరని హామీలతో ప్రజల్లో నిరాశ
ఇంటికి రెండు ఉద్యోగాలు, భూమికి రెట్టింపు పరిహారం ఇస్తామని భూ నిర్వాసితులకు హామీలిచ్చినా హామీలు నెరవేరలేదు. 2వేల ఉద్యోగాలను కల్పిస్తామన్న హామీ అటకెక్కిపోయింది. హామీలు నెరవేరకపోగా ప్రాజెక్టు కూడా పూర్తికాలేదు. మరోపక్క భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందక, పునరావాసం లేక ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం లో భాగంగా నిర్మించే చర్లగూడెం, క్రిష్ణరాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు పరిహారం అం దక అనేక ఆందోళనలు చేపట్టారు. ఈ ప్రాజెక్టును 30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఇక ప్రధాన కాల్వలో 92 కిలోమీటర్లు ఉండనుండగా కాల్వల సామర్థ్యం 6వేల క్యూసెక్యుల వరకు ఉండే విధంగా చేపట్టాల్సి ఉంది. నల్లగొం డ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు, 14 మండలాలకు సాగు, తాగు నీరు అందా ల్సి ఉంది. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు నియోజకవర్గాలకు ఐదు మండలాలకు ఈ నీరు చేరాలన్న లక్ష్యంతో డిజైన్ రూపొందించారు.
డిండి ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది : నెల్లికంటి సత్యం, సీపీఐ జిల్లా కార్యదర్శి
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు శంకుస్థాపనచేసి ఏడేళ్లు కావస్తు న్నా కనీసం భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుచేయలేదు. అసలు ఈ ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీరు వస్తుందనే దానిపై కూడా ప్రభుత్వానికి అవగాహనలేదు. డీపీఆర్ కూడా లేదు. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం కృష్ణాజలాలను తమ ఆధీనంలోకి తీసుకెళ్తూ గెజిట్‌ను విడుదల చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా జలాలపై పట్టు కూడా లేదు. ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తక్కు వ కాలంలో చేపట్టి పూర్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో తట్టెడు మట్టిని ఈ ప్రాజెక్టు ఎత్తిపోయలేదు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం : జక్కలి ఐలయ్య యాదవ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇప్పటివరకు భూ పరిహారం ఇవ్వలేదు. ఒక ఉద్యోగం కూడా కల్పించలేదు. దీనికి ప్రధాన కారణం ఉత్తర తెలంగాణపై ఉన్న శ్రద్ధ దక్షిణ తెలంగాణ ప్రజలపై లేదనేది స్పష్టమవుతుంది. కాళేశ్వరం ఎప్పుడో పూర్తి చేసిన ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి ఏడే ళ్లు కావస్తున్నా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తోంది.