ఉపకరణాలతో బోధన భళా

ABN , First Publish Date - 2022-12-31T00:30:27+05:30 IST

కరోనా కారణంగా రెండేళ్ల పాటు బడి ఈడు పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఏడా ది కాలంగా బడికి వెళ్తున్నా కనీసం చదవడం, రాయడం రాని పరిస్థితి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై తాజాగా నిర్వహించిన రెండు సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

ఉపకరణాలతో బోధన భళా
చండూరులో టీఎల్‌ఎం మేళాను సందర్శించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, నల్లగొండ డీఈవో భిక్షపతి (ఫైల్‌)

అభ్యసన సామర్థ్యాల పెంపునకు బోధనోపకరణాలు

జనవరి 3 వరకు ఉమ్మడి జిల్లాలో 10వేల బోధనాసామగ్రి ప్రదర్శన

నల్లగొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా కారణంగా రెండేళ్ల పాటు బడి ఈడు పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఏడా ది కాలంగా బడికి వెళ్తున్నా కనీసం చదవడం, రాయడం రాని పరిస్థితి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై తాజాగా నిర్వహించిన రెండు సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పాత విధానంలోనే పాఠాలు చెబితే చదవడం, రాయడం రాని విద్యార్థులు మరిన్ని ఇబ్బందులకు గురవుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాలతో అభ్యసనాన్ని మెరుగు పరిచేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ‘తొలిమెట్టు’గా నామకరణం చేసింది. ఉపాధ్యాయులు రూపొందించిన బోధనా సామగ్రిని ఒక చోట చేర్చి అత్యుత్తమమైన వాటికి బహుమతులు అందజేయాలని నిర్ణయించింది. అందుకు టీఎల్‌ఎం మేళాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మండల స్థాయిలో మేళాలు ప్రారంభం కాగా, త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో మేళాలు నిర్వహించనుంది.

ప్రారంభమైన టీఎల్‌ఎం మేళాలు

కరోనా కారణంగా కనీస అభ్యసన సామర్థ్యాలు కోల్పోయిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఫౌండేషన్‌ లిట్రసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమాన్ని ఈ ఏడాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల్లో ప్రారంభించారు. తొలిమెట్టు పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ను ఆకర్షించేలా పాటలు, నృత్యాలు, టీచింగ్‌, లెర్నింగ్‌ మెటీరియల్‌ సహకారంతో బోధించాలని నిర్ణయించారు. అందుకు రెండు దశల్లో ఉపాధ్యాయుల కు శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయుల మధ్య పోటీని పెంచే ఆలోచనతో టీఎల్‌ ఎం మేళాలకు శ్రీకారం చుట్టారు. ఈనెల 28 నుంచి మండల స్థాయిలో మేళాలు కొనసాగుతుండగా, జనవరి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జనవరి మొదటి వారంలో జిల్లాస్థాయిలో, సంక్రాంతి అనంతరం రాష్ట్ర స్థాయిలో మేళాలు నిర్వహించనున్నారు. స్థానికంగా ఉపాధ్యాయుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకుని మేళాల తేదీలను ఎంఈవోలు ఖరారు చేసి నిర్వహిస్తున్నారు. వీటిని డీఈవోలు, ఇతర అధికారులు సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు కనీసంగా ఒకటి లేదా రెండు టీచింగ్‌ మెటీరియల్‌ను సొంతంగా సిద్ధం చేసుకుని వస్తున్నారు. ఎక్కువలో ఎక్కువగా నాలుగు వరకు మెటీరియల్స్‌ను మేళాకు తీసుకురావచ్చు. మేళా సమయం లో పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది లేకుండా ఉదయం ఒక ఉపాధ్యాయుడు, మధ్యాహ్నం మరో ఉపాధ్యాయుడు హాజరయ్యేలా చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2,699 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, సుమారు 5,398 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు కనీసంగా రెండు మెటీరియల్స్‌ తీసుకెళ్లినా మొత్తంగా 10,796 నమూనాలు సిద్ధమవుతాయి. ప్రతీ మండలంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారిని జిల్లా స్థాయి, జిల్లా స్థాయిలో ఎంపికైన మొదటి మూడు మోడళ్లను రాష్ట్రస్థాయి మేళాకు పంపుతారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్నచోట మేళా సమయంలో సీఆర్పీ లేదా సమీపంలో ఎక్కువ స్టాఫ్‌ ఉన్న పాఠశాల నుంచి ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేస్తున్నారు.

టీఎల్‌ఎంతో మెరుగైన ఫలితాలు

ప్రభుత్వ పాఠశాలల్లో 90శాతానికి పైగా నిరుపేద విద్యార్థులే ఉన్నారు. వీరి తల్లిదండ్రుల విద్యాభ్యాసం అంతంత మాత్రమే. వ్యవసాయ కూలీలు, రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై పిల్లల చదువులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కనీస సామర్థ్యాలు పెంచేందుకు టీచింగ్‌, లెర్నింగ్‌ మెటీరియల్‌(టీఎల్‌ఎం) మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ విధానంలో తొలుత 45నిమిషాల పాటు ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తారు. ఆ తర్వాత మరో 45నిమిషాలు పాఠానికి సంబంధించిన బోధన సామగ్రిని ప్రదర్శించి విద్యార్థులతో ప్రాక్టీస్‌ చేయిస్తారు. ఉపాధ్యాయుల కొరతతో ఒకే టీచర్‌ బహుళ తరగతులకు బోధిస్తున్న సమయంలో టీఎల్‌ఎం విధానం ఉపయోగకరంగా ఉంటోంది. అంతేగాక విద్యార్థులు వేగంగా నేర్చుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ‘తొలిమెట్టు’లో భాగంగా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు తరగతి గదుల్లో ఆకర్షణీయమైన బొమ్మలు, పాఠ్యాంశాల్లోని చార్టులు, పెయింటింగ్‌ వేయించారు. వీటికి తోడు పెద్ద సంఖ్యలో టీచింగ్‌, లెర్నింగ్‌ మెటీరియల్‌ సమకూరుతుంది.

Updated Date - 2022-12-31T00:30:28+05:30 IST