వేధింపుల బాధితులకు భరోసా కల్పించాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2022-11-16T00:40:34+05:30 IST

వేధింపులు, దాడులు, నిరాదరణ, హత్యాచారాలకు గురైన బాధితులకు ధైర్యం కల్పించి వారికి భరోసా ఇవ్వాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

వేధింపుల బాధితులకు భరోసా కల్పించాలి: ఎస్పీ
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేటక్రైం, నవంబరు 15 : వేధింపులు, దాడులు, నిరాదరణ, హత్యాచారాలకు గురైన బాధితులకు ధైర్యం కల్పించి వారికి భరోసా ఇవ్వాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోక్సో చట్టాలు, లైంగిక దాడులకు గురైన బాలలపై తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధిత మహిళలు, పిల్లలకు ఒకే చోట మెడికల్‌, న్యాయ సలహా, కౌన్సెలింగ్‌ కల్పిస్తూ మనోధైర్యం, సామాజిక భద్రత కల్పించేలా రాష్ట్ర పోలీస్‌ మహిళా అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. లైంగికదాడులకు గురవుతున్న బాలికలతో మానవతాదృక్పధంతో మెలగాలన్నారు. మహిళలు లైంగికదాడులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. భరోసా కేంద్రం రాష్ట్ర టెక్నికల్‌ డైరెక్టర్‌ మమతరఘువీర్‌, రాష్ట్ర భరోసా కేంద్రం అదనపు ఎస్పీ అశోక్‌ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దాడులను నివారించాలని తెలిపారు. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించడమే రాష్ట్ర పోలీస్‌ లక్ష్యమన్నారు. సమావేశంలో డీసీఆర్‌బీ డీఎస్పీ జి.రవి, ఎస్‌బీఐ తుల శ్రీనివాస్‌, లీగల్‌ అడ్వయిజర్‌ రాంరెడ్డి, డీసీపీవో రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T00:40:37+05:30 IST