ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి

ABN , First Publish Date - 2022-05-24T07:04:41+05:30 IST

సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని అఖిలపక్షం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం సంస్థాన్‌ నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి
సంస్థాన్‌ నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అఖిలపక్షం నాయకులు, గ్రామస్థులు

 గ్రామపంచాయతీ ఎదుట అఖిలపక్షం ధర్నా 

 కడీలు, ఫెన్సింగ్‌ తొలగించిన గ్రామ పంచాయతీ సిబ్బంది

సంస్థాన్‌ నారాయణపురం, మే 23: సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని అఖిలపక్షం నాయకులు కోరారు. ఈ మేరకు  సోమవారం సంస్థాన్‌ నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 25 ఏళ్ల క్రితం 1997లో  ఇంటి నెం.5-25  గడీకి చెందిన భూమిలో ఫకీర్‌ హైమద్‌ లేఅవుట్‌ వేశాడు. ఆ సందర్భంగా గడీ ముందు భాగంలో ఉన్న 675 గజాల స్థలాన్ని గ్రామ పంచాయతీకి కేటా యించారు. గ్రామపంచాయతీ రివిజన్‌ రికార్డుల్లో కూడా ఆ స్థలం ఆర్టీసీదని నమోదైంది.  ఈ స్థలాన్ని 2015లో కొనుగోలు చేసినట్లు మండల కేంద్రానికి చెందిన గుత్త ప్రేమ్‌చందర్‌ రెడ్డి చెబుతున్నాడు. ఆది గ్రామ పంచాయతీకి, ఆర్టీసీ బస్‌స్టేష న్‌కు కేటాయించిన స్థలమని, దీనిని స్వాధీనం చేసుకోవాలని అఖిలపక్షం నాయకులు  డిమాండ్‌ చేస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గానికి, రెవెన్యూ అధికారులకు గతంలో వినతిపత్రం ఇవ్వడంతో పాటు పలు ఆందోళన కార్య క్రమాలు నిర్వహించారు. గుత్త ప్రేమ్‌చందర్‌రెడ్డి తాను కోనుగోలు చేసినట్లు చెబుతున్న ఈ స్థలంలో ఈనెల22వ తేదీన రాతి కడీలు నాటి ఫెన్సింగ్‌ వేశారు.  విషయం తెలుసుకున్న అఖిలపక్ష పార్టీల నాయకులు సోమవారం గ్రామంలో దండోరా వేయించి గ్రామ పంచాయతీ కార్యాయం ఎదుట ధర్నా నిర్వహించారు. అన్యాక్రాంతమైన భూమిలో కడీలు నాటి ఫెన్సింగ్‌ వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గ్రామపంచాయతీ పాలక వర్గానికి వినతిపత్రం అందజేశారు.

ఫెన్సింగ్‌ తొలగించాలని పంచాయతీ తీర్మానం

 ఈ నేపథ్యంలో సర్పంచ్‌  శికెలమెట్ల శ్రీహరి అత్యవసర గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి చెందిన స్థలంలో నాటిన కడీలతో కూడిన ఫెన్సింగ్‌ను తొలగించాలని తీర్మానం చేశారు.  అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష నాయకులు ఆ స్థలం వద్దకు వెళ్లి గ్రామ పంచాయతీ సిబ్బందితో  ట్రాక్టర్‌ ద్వారా  కడీలు ఫెన్సింగ్‌ను తొలగించారు.  ఎస్‌ఐ యుగేందర్‌గౌడ్‌ ఘటనా స్థలానికి వచ్చి  అక్రమంగా కడీలను తొలగించడం సరికాదని, ఈ సమస్యను చట్టపరంగా పరిష్కరించుకోవాలని సర్పంచ్‌కు, అఖిలపక్షాల నాయకులకు సూచించారు. అనంతరం ఆర్డీవో సూరజ్‌కుమార్‌ను గ్రామ పంచాయతీ పాకవర్గ సభ్యులు, అఖిలపక్ష నాయకులు, గుత్త ప్రేమ్‌చందర్‌ రెడ్డి కలిసి తమ వద్ద ఉన్న స్థలం రికార్డులను అందజేశారు. ఇరువర్గాల వద్ద ఉన్న స్థలం రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరి స్తామని, అప్పటివరకు ఎవరూ భూమిలోకి వెళ్లొద్దని ఆర్డీవో ఆదేశించారు.  దీంతో అందరూ వెనుదిరిగారు.




Updated Date - 2022-05-24T07:04:41+05:30 IST