తరుగు పేరుతో ఏటా రూ.13 కోట్ల దోపిడీ

ABN , First Publish Date - 2022-04-05T07:08:19+05:30 IST

తరుగుల పేరుతో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని రైస్‌ మిల్లర్లు ఏటా రూ.13కోట్లు దోపిడీ చేస్తున్నాయని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.

తరుగు పేరుతో ఏటా రూ.13 కోట్ల దోపిడీ

హుజూర్‌నగర్‌ , ఏప్రిల్‌ 4: తరుగుల పేరుతో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని రైస్‌ మిల్లర్లు ఏటా రూ.13కోట్లు దోపిడీ చేస్తున్నాయని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. రైతు సమస్యలపై ఆర్డీతో నాయకులు సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఒక్కో మిల్లులో లక్ష బస్తాల మేర ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, బస్తాకు కేజీ చొప్పున తరుగు తీస్తున్నారన్నారు. దీంతో 30 మిల్లుల్లో సుమారు రూ.13కోట్ల ధాన్యాన్ని మిల్లర్లు దండుకుంటున్నారని ఆరోపించారు. దీంతో పాటు మిల్లర్లు వేబ్రిడ్డిలలో తప్పుడు తూకాలు, ట్రాక్టర్‌కు 40కిలోల తరుగు, క్యాష్‌ కటింగ్‌ చేస్తూ రైతులను కోట్లలో మోసం చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. మిల్లర్లతో సమాశేం ఏర్పాటుచేసి రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సూర్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాసు, మేకల నాగేశ్వరరావు, దొంగరి వెంకటేశ్వర్లు, జక్కుల వెంకటేశ్వర్లు, అంబటి వెంకయ్య, కీతా మల్లికార్జున్‌రావు, ముల్కలపల్లి సీతయ్య పాల్గొన్నారు.

 తరుగులు తీస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే

 హుజూర్‌నగర్‌: మిల్లర్లు ఇష్టం వచ్చినట్లు తరుగులు తీసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే సైదిరెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.   బస్తాకు కేజీ తరుగు మాత్రమే తీయాలని, బోరాలలో ధాన్యం తెస్తే 5 కేజీల తరుగు మాత్రమే తీయాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ వెంకటరెడ్డి, మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నర్సింహారావుు పాల్గొన్నారు.



Updated Date - 2022-04-05T07:08:19+05:30 IST