నిలిచిన శ్రీశైలం సొరంగమార్గం తవ్వకం పనులు

ABN , First Publish Date - 2022-11-16T23:39:49+05:30 IST

ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలోని శ్రీశైలం సొరంగమార్గం(ఎస్‌ఎల్‌బీసీ) తవ్వకం పనులు నిలిచాయి.

నిలిచిన శ్రీశైలం సొరంగమార్గం తవ్వకం పనులు
ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం వద్ద నిలిచిన పనులు

మూడు నెలలుగా కార్మికులకు అందని వేతనాలు

దేవరకొండ, నవంబరు 16: ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలోని శ్రీశైలం సొరంగమార్గం(ఎస్‌ఎల్‌బీసీ) తవ్వకం పనులు నిలిచాయి. మూడు నెలలుగా కాంట్రాక్టర్‌ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు పనులు నిలిపివేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లా పరిధిలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో బీడు భూములను సస్యశ్యామలం చేయాలని, ఫ్లోరైడ్‌ పీడిత ప్రజలకు రక్షిత తాగునీటిని ఇవ్వాలనే యోచనతో 2007 సంవత్సరంలో శ్రీశైలం సొరంగమార్గం (ఎస్‌ఎల్‌బీసీ) తవ్వకం పనులు ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రూ.1925 కోట్ల అంచనా వ్యయంతో నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలలోని ఆయకట్టుకు సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీకి చెందిన జయప్రకాష్‌ అసోసియేట్‌, రాబిన్స్‌ కంపెనీ తవ్వకం పనులను కాంట్రాక్టు తీసుకున్నాయి. శ్రీశైలం ఎడమకాల్వపై 44 కిలోమీటర్ల మేర తవ్వి కృష్ణానీటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. సొరంగమార్గం మొత్తం నల్లమల అటవీ ప్రాంతం ఉండటంతో బ్లాస్టింగ్‌కు అటవీశాఖ నిరాకరించింది. దీంతో సొరంగమార్గం పనులకు టన్నెల్‌ బేరింగ్‌ మిషన్‌ (టీబీఎం) విధానాన్ని ఎంచుకున్నారు. ఇరువైపులా రెండు టీబీఎం మిషన్లతో కొండను తొలుస్తున్నారు. టన్నెల్‌-1 సొరంగమార్గం ఇన్‌లెట్‌ పనులు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా దోమలపెంట నుంచి ప్రారంభమై అచ్చంపేట మండలం మన్నెవరిపల్లి వద్ద ముగుస్తాయి. మొత్తం 44 కిలోమీటర్లు ఇరువైపులా టీబీఎం మిషన్లతో తవ్వకాలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 34 కిలోమీటర్లు ఇరువైపులా పనులు పూర్తయ్యాయి. ఇంకా 10 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. మొదటగా రూ.1925 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును ప్రారంభించగా ధరలు పెరుగుతుండటంతో కాంట్రాక్టర్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా ప్రాజెక్టు అం చనా వ్యయాన్ని రూ.3075 కోట్లకు పెంచారు. ఇప్పటివరకు రూ.1700 కోట్ల పనులు పూర్తయ్యాయి. కాగా ప్రాజెక్టును 2007లో ప్రారంభించి అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాని నేటి వరకు గడువులు పెంచుతున్నారే కానీ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంలేదు. ప్రాజెక్టు గడువు 2021 డిసెంబరు నాటికి తెలంగాణ ప్రభుత్వం గతంలో పొడిగించిన ప్రభుత్వం మళ్లీ సొరంగమార్గం తవ్వకాల పనులకు గడువు 2023 డిసెంబరు వరకు పొడిగించినట్లు అధికారులు తెలుపుతున్నారు.

బేరింగ్‌ మరమ్మతులు, నిధుల కొరతతో ఇక్కట్లు

టన్నెల్‌ బేరింగ్‌ మిషన్‌ తరచూ మరమ్మతులకు గురవుతుండటం, సాంకేతిక సమస్య, నిధుల కొరత, కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. 2018లో టన్నెల్‌ బేరింగ్‌ మిషన్‌ మరమ్మతులకు గురికాగా అమెరికా, జర్మనీ దేశాల నుంచి 2021 మేలో బేరింగ్‌ మిషన్‌ను తెప్పించి పనులు పునఃప్రారంభించారు. అప్పటి నుంచి తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో పనులు తరచూ నిలిచిపోతున్నాయి. జేపీ, రాబిన్స్‌ కంపెనీలకు చెందిన కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో టన్నెల్‌-1 తవ్వకం పనులు నిలిపివేశారు. నెల, నెలా వేతనాలు అందజేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై ఏఎమ్మార్పీ డీఈ చక్రపాణిని వివరణ కోరగా పనులు నిలిచిపోయిన మాట వాస్తవమేనని అన్నారు. త్వరలో సమస్య పరిష్కారమై పనులు పునఃప్రారంభమవుతాయని తెలిపారు. కాంట్రాక్టర్‌కు రూ.25 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని, త్వరలో సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

Updated Date - 2022-11-16T23:39:52+05:30 IST