విద్య మిథ్య

ABN , First Publish Date - 2022-12-31T00:28:44+05:30 IST

కరోనా అనంతరం ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తిస్థాయిలో నడిచినా విద్యా వ్యవస్థ గాడినపడలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా ఉపాధ్యాయులు లేరు. నేటికీ పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. ‘మన ఊరు, మన బడి’ కింద ఎంపికైన పాఠశాలల్లో కొన్నింట్లోనే మౌలిక వసతుల పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇక స్కావెంజర్ల లేమితో పాఠశాలల్లో పారిశుధ్యం లోపించింది.

విద్య మిథ్య

విద్యార్థుల సంఖ్యకు సరిపడా లేని ఉపాధ్యాయులు

నేటికీ పూర్తిస్థాయిలో అందని పాఠ్యపుస్తకాలు

‘మన ఊరు, మన బడి’ పనులు నామమాత్రం

స్కావెంజర్ల లేమితో లోపించిన పారిశుధ్యం

అందని ఉపకార వేతనాలు

పది విద్యార్థులకు ఊరటనిచ్చిన పేపర్ల తగ్గింపు

కరోనా అనంతరం ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తిస్థాయిలో నడిచినా విద్యా వ్యవస్థ గాడినపడలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా ఉపాధ్యాయులు లేరు. నేటికీ పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. ‘మన ఊరు, మన బడి’ కింద ఎంపికైన పాఠశాలల్లో కొన్నింట్లోనే మౌలిక వసతుల పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇక స్కావెంజర్ల లేమితో పాఠశాలల్లో పారిశుధ్యం లోపించింది. ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేయలేదు. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఫీజు చెల్లిస్తేనే కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. ఫలితంగా పేద విద్యార్థులు పైచదువులకు దూరమవుతున్నారు.

- కోదాడ

విద్యావ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. 2019-20, 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ తరగతులు, చివరికి పరీక్ష లు లేకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేశారు. కరోనా తగ్గాక వచ్చిన ప్రస్తుత 2022-23 విద్యా సంవత్సరంలో ఆఫ్‌లైన్‌ తరగతులే నడిచినా సమస్యలు వెంటాడాయి. ఉమ్మడి జిల్లాలో 700మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. స్కావెంజర్లను నియమించకపోవడంతో పాఠశాలల్లో పారిశుధ్య పను లు నిర్వహించేవారు కరువయ్యారు. సకాలంలో బిల్లులు మంజూరవకపోవడంతో ‘మన ఊరు, మన బడి’ పనులు నిర్వహించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్‌ టీచర్ల కొరత ఉండగా, సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై పంపారు. ఫలితంగా ప్రాథమిక స్థాయిలో తరగతి గదికి ఒక టీచర్‌ ఉండాలనే నిబంధ న అమలుకాక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఇదిలా ఉండగా, ఏడేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేవు. ఈఏడాది విద్యార్థులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం పదో తరగతిలో 10పేపర్లను ఆరుకు కుదించడం విద్యార్థులకు ఊరట కలిగించే అంశం.

భర్తీకాని ఉపాధ్యాయ పోస్టులు

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 4,282 ఉండగా, ఆయా విద్యాసంస్థల్లో సుమారు 4లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఏళ్లుగా ఉపాధ్యాయ పో స్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఈ ఏడాది విద్యావలంటీర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో పీఎ్‌సల నుంచి హైస్కూళ్లకు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై సర్దుబాటు చేశారు. అయితే కరోనా అనంతరం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. వారిని డిప్యుటేషన్‌పై హైస్కూళ్లకు తరలించడంతో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందడం లేదు. 2015నుంచి ఉపాధ్యాయులకు పదోన్నతులు, 2018నుంచి బదిలీలు లేవు. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలల్లో లెసన్‌ ప్లానింగ్‌, యూడైస్‌, ఆడిట్‌, టీఎల్‌ఎం, ఇతర శిక్షణలతో బోధనేతర పనులతోనే ఉపాధ్యాయులకు సరిపోతోంది.

పూర్తిస్థాయిలో పుస్తకాలేవీ?

2022-23 విద్యాసంవత్సరం ఆరు నెలలు గడిచినా నేటికీ పార్ట్‌-2 కొన్ని సబ్జెక్‌ పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందలేదు. గతంలో ఇంగ్లిష్‌, తెలుగు మీడియం పుస్తకాలు వేర్వేరుగా ఉండేవి. కాగా, ఈ విద్యాసంవత్సరం రెండు మీడియాలను కలిపి పార్ట్‌-1, పార్ట్‌-2గా విభజించారు. ఒక పేజీలో ఇంగ్లిష్‌, రెండో పేజీలో తెలుగు ఉండేలా ముద్రించారు. అయితే పార్ట్‌-2 పుస్తకాలు విద్యార్థులకు అందలేదు.

పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణా లోపం

కరోనాకు ముందు పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లకు ప్రాథమిపాఠశాల అయితే రూ.2వేలు, హైస్కూల్‌ అయితే రూ2,500 ప్రభుత్వం చెల్లించింది. వారు పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేసేవారు. కాగా, కరోనా అనంతరం వారిని ప్రభుత్వం తొలగించి పంచాయతీ, మునిసిపల్‌ సిబ్బందికి పారిశుధ్య బాధ్యతలు అప్పగించింది. వారు చుట్టపుచూపుగా వస్తుండటంతో పాఠశాలల్లో పారిశుధ్యం లోపించింది.

అమలవ్వని ‘మన ఊరు, మన బడి’

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు, మన బడి’ పథకాన్ని ప్రారంభించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో కంప్యూటర్లు, విద్యుత్‌, ఫ్యాన్లు, భోజనం చేసేందుకు డైనింగ్‌ హాల్‌, ఇతర పనులు నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో కొన్ని పాఠశాలల్లోనే ‘మన ఊరు, మన బడి’ పనులు కొనసాగుతున్నాయి.

అందని ఉపకార వేతనాలు

2022-23 విద్యసంవత్సరం పూర్తి కావొస్తున్నా గత సంవత్సరం డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఎంటెక్‌, ఎంబీఏ పూర్తిచేసిన విద్యార్థులకు నేటికీ ఉపకార వేతనాలను ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో ఫీజు చెల్లించి సర్టిఫికెట్‌ తీసుకెళ్లాలని యాజమాన్యాలు చెబుతుండ గా, పేద విద్యార్థులకు ఇది భారమైంది. ప్రభుత్వం ప్రైవేటు కళాశాలలకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ డబ్బు విడుదలకు టోకెన్లు ఇచ్చి నెలలు గడుస్తు న్నా ట్రెజరీల్లో జమ కాకపోవడంతో కళాశాలలు నిర్వహించడం కష్టంగా ఉందని యాజమాన్యాలు వాపోతున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షి్‌పల దరఖాస్తునకు జనవరి వరకు ప్రభుత్వం గడువు ఇవ్వగా, గడువు సమయం చాలా ఉంటే, మరి ఎప్పుడు మంజూరు చేస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇం టర్‌ కళాశాల గుర్తింపునకు ఏటా ఏప్రిల్‌లో దరఖాస్తు చేసుకుం టే జూన్‌లో ప్రభుత్వం మంజూరు చేసేది. అయితే సెప్టెంబరు నెల వరకు గుర్తింపు రాకపోవడంతో ఏ కళాశాలలో చేరాలో తెలియక విద్యార్థులు ఆయోమయానికి గురయ్యారు. ఇక డిగ్రీలో ఇంజనీరింగ్‌ మా దిరిగా ప్రభుత్వం సెమిస్టర్‌ విధానాన్ని తీసుకు వచ్చింది. ఎంజీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీలో 30వేల సీట్లు ఉండగా, సెమిస్టర్‌ విధానం కారణం గా ఈ విద్యాసంవత్సరంలో కేవలం 9వేల మంది మాత్రమే చేరారు.

ఇంజనీరింగ్‌ చేసినా సర్టిఫికెట్‌ రాలేదు : పాషా, విద్యార్థి తండ్రి, కోదాడ

మా బాబు గత ఏడాది ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించి సర్టిఫికె ట్‌ తీసుకువెళ్లాలంది. ఫీజు చెల్లించే స్థోమత లేక సర్టిఫికెట్‌ తెచ్చుకోలేదు. ఇప్పటికైనా ప్రభత్వుం ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి.

విద్యావలంటీర్లను నియమించాలి : రామనర్సయ్య, ఉపాధ్యాయుడు, కోదాడ

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. ఉన్నవారిపై భా రం పడుతోంది. ప్రధానంగా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్‌ టీచర్ల కొరత ఉంది. ప్రాథమిక పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపడంతో ఇక్కడ విద్య కుంటుపడుతోంది. ఇప్పటికైనా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. విద్యాసంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలల సమయం ఉన్నందున విద్యావలంటీర్లను నియమించాలి.

Updated Date - 2022-12-31T00:28:45+05:30 IST