మీరు చెప్పినట్టు చేశా.. నష్టపోయా

ABN , First Publish Date - 2022-02-19T06:29:36+05:30 IST

ఎమ్మెల్యే సూచనలతో టెండర్లు దాఖలుచేసి ఆర్థికంగా నష్టపోయానంటూ ఓ వైస్‌ ఎంపీపీ రాసిన లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది

మీరు చెప్పినట్టు చేశా.. నష్టపోయా
తాళ్లూరి లక్ష్మీనారాయణ

మీనుంచి నాకు ఎటువంటి సహకారం లేదు

ఎమ్మెల్యే సైదిరెడ్డికి వైస్‌ ఎంపీపీ లేఖ

సోషల్‌ మీడియాలో వైరల్‌

నేరేడుచర్ల, ఫిబ్రవరి 18: ఎమ్మెల్యే సూచనలతో టెండర్లు దాఖలుచేసి ఆర్థికంగా నష్టపోయానంటూ ఓ వైస్‌ ఎంపీపీ రాసిన లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నేరేడుచర్ల  ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ తన బాధను ఎమ్మెల్యే సైదిరెడ్డికి లిఖితపూర్వకంగా తెలియజేయటంతో పలువురు నేతలు ఆ లేఖను ఫొటోతీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నేరేడుచర్ల వైస్‌ ఎంపీపీ లక్ష్మీనారాయణ మండలంలోని పలు అభివృద్ధి పనుల నిర్వహణకు ఎమ్మెల్యే సైదిరెడ్డి సూచనలతో టెండర్లు దాఖలు చేశారు. వాటిలో ఏ ఒక్కటీ దక్కకపోవటంతో ఆర్థికంగా నష్టపోయానని, ఇప్పుడు తన గోడు చెప్పుకుందామంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తనకు ఎమ్మెల్యే నుంచి ఎటువంటి న్యాయం జరగడం లేదని లేఖలో పేర్కొన్నాడు. దాచారం చెక్‌డ్యామ్‌ టెండర్‌కు బ్యాంకు గ్యారంటీ ఇవ్వటంతో రూ.80వేలు, రూ.26 కోట్ల చెక్‌డ్యాం పనులకు సుధాకర్‌రెడ్డి పేరిట టెండర్‌ వేయమని చెప్పటంతో బ్యాంకు గ్యారంటీతో రూ.1.50లక్షలు నష్టపోయినట్లు పేర్కొన్నారు. సింగారం చెక్‌ డ్యాం పనులకు రూ.7కోట్లకు 2.7 కోట్లు మాత్రమే మంజూరుకాగా, పని చేసి నష్టపోయానని, రైతువేదికల నిర్వహణతో నష్టం వచ్చిందని, హుజూర్‌నగర్‌ డీఎంఎ్‌ఫటీ పనుల పేమెంట్‌ ఆలస్యంతో వడ్డీ నష్టపోయానని, హుజూర్‌నగర్‌ మినీ ట్యాంకుబండ్‌ పనులకు టెండర్‌ దాఖలుచేసినా తనకు దక్కక నష్టపోయానన్నారు. ఇప్పుడు ఎస్‌డీఎఫ్‌ పనులకు కూడా తనకు సహాయం అందలేదు అంటూ లేఖలో పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం ఈ లేఖను ఆయన ఎమ్మెల్యే సైదిరెడ్డికి అందజేశారు. ఈలోగా కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు దానిని ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో విషయం వెలుగుచూసింది.


Read more