రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించండి : మాజీ మంత్రి రాంరెడ్డి
ABN , First Publish Date - 2022-08-19T05:54:17+05:30 IST
రాజకీయ భిక్షపెట్టిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉపఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అన్నారు.

చండూరు/ మునుగోడు, ఆగస్టు 18 : రాజకీయ భిక్షపెట్టిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉపఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అన్నారు. చండూరు, మునుగోడు మండల కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పదవులు అనుభవించిన రాజగోపాల్‌రెడ్డి పార్టీకి తీరని ద్రోహం చేశాడని విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపి వద్ద తాకట్టు పెట్టాడన్నారు. భవిష్యత్తులో నియెజకవర్గ ప్రజల చేతిలో ఘోర పరాజయానికి గురవుతాడని జోస్యం చెప్పారు. ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసమే పనిచేయాలని, కాంట్రాక్టుల కోసమే పార్టీ మారడం దారుణమన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన రాజకీయ అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదిగి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పులకుప్ప రాష్ట్రంగా మార్చాడని విమర్శించారు. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేసి సిట్టింగ్ సీటు తిరిగి సాధించుకుంటామన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ జైలుకు వెళ్లిన వ్యక్తి కింద తాను పనిచేయనని రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.గుజరాత్ అల్లర్లకేసులో అమిత్‌షా జైలుకు పోలేదా అని ప్రశ్నించారు. అమిత్‌షాలా రేవంత్‌రెడ్డి ఎవరి చావులకు కారణం కాలేదన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని భరోసాఇచ్చారు. సంతల్లో పశువుల్లా టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఏఐసీసీ కార్యదర్శి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీలు కలిసి ఆడుతున్న రాజకీయ క్రీడల్లో భాగంగా మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. రెండు పార్టీలు ఒకే గూటి పక్షులని ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగే ఎన్నికల్లో బీజేపీని అడుగు పెట్టనీయమని అన్నారు.ప్రధాని మోదీ పన్నుల ప్రధానిగా చరిత్రకెక్కారని దుయ్యబట్టారు. హుజూరాబాద్ బైపోల్స్‌కు, మునుగోడు బైపోల్స్‌కు చాలా తేడా ఉండబోతుందని తెలిపారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడారు. నియోజకవర్గం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాదని అతని స్వప్రయోజనాల కోసమేనని పార్టీ మారుతున్నాడని రాజగోపాల్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. నేతలు మారినా కేడర్ మాత్రం బలంగానే ఉందన్నారు. సమావేశంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, పీసీసీ అధికార ప్రతినిఽధులు పున్న కైలా్‌షనేత, చలమల్ల కృష్ణారెడ్డి, ఎంపీపీ పల్లె కల్యాణి, ఉమ్మడి నల్లగొండ జిల్లాల డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్, చెవిటి వెంకన్న, చండూరు ఎంపీపీ పల్లె కల్యాణిరవికుమార్, బూడిద లింగయ్యయాదవ్, పన్నాల లిం గయ్య, బురుకల బిక్షం, మంచుకొండ సంజయ్, శ్యాం, పోలగోని సైదులుగౌడ్, పాల్వాయి చెన్నారెడ్డి, సాగర్ల లింగస్వామి, భాస్కర్, నర్సింహగౌడ్, అన్వర్, నర్సింహ, యాదగిరి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.