మునుగోడు ఉప ఎన్నికకు కౌంట్‌డౌన్‌

ABN , First Publish Date - 2022-10-07T06:24:43+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు కేవలం 28 రోజులు మాత్రమే గడువు ఉండడంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ మరింత దూకుడు పెంచనున్నాయి. ఇప్పటికే ఈ మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో గడపగడపకు తిరుగుతున్నాయి.

మునుగోడు ఉప ఎన్నికకు కౌంట్‌డౌన్‌

పోలింగ్‌కు మిగిలింది 28 రోజులే 

ఇక ప్రచారంతో హోరెత్తనున్న పల్లెలు, పట్టణాలు

నేటి నుంచి చండూరులో నామినేషన్ల స్వీకరణ 

బీజేపీని నిలువరించేందుకు టీఆర్‌ఎస్‌, వామపక్షాల సమావేశం 


మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు కేవలం 28 రోజులు మాత్రమే గడువు ఉండడంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ మరింత దూకుడు పెంచనున్నాయి. ఇప్పటికే ఈ మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో గడపగడపకు తిరుగుతున్నాయి. ఎన్నికల సంఘం మునుగోడు ఉపఎన్నికకు శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న నేపథ్యంలో చండూరులో నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభంకానుంది. 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)


మునుగోడు ఉపఎన్నికకు ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 15న నామినేషన్ల పరిశీలన, 17న ఉపసంహరణకు గడువు ఉండగా 3వ తేదీన పోలింగ్‌ జరగనుంది. నామినేషన్లను చండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి రెండో శనివారం, ఆదివారం మినహా ప్రతీరోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఓటర్ల నమోదుపై సమావేశంతోపాటు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 


హోరెత్తనున్న పల్లెలు, పట్టణాలు 

నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుండడం, ఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో నేటి నుంచి పల్లెలు, పట్టణాలు, రాజకీయ పార్టీల సభలు, సమావేశాలతో హోరెత్తనున్నాయి. ఈ నెల 12వ తేదీన కమ్యూనిస్టులు మునుగోడులో సభ నిర్వహిస్తుండగా, త్వరలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ చండూరులో జరగనుంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటికే గ్రామాలు, మునిసిపాలిటీలను మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించగా కాంగ్రెస్‌, బీజేపీలు కూడా ఆ వైపుగా చర్యలు తీసుకున్నాయి. అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్‌ కూడా భారీ బహిరంగ సభలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ముఖ్య నాయకులంతా మండలకేంద్రాల్లో, సమీప పట్టణాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతున్నారు. ఎన్నికకు కేవలం 28 రోజులు మాత్రమే గడువు ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మునుగోడు గడ్డపై జెండా ఎగురవేయాలని, ఏ పార్టీకి ఆ పార్టీయే యోచిస్తూ ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. 


కమ్యూనిస్టులతో మంత్రి జగదీష్‌రెడ్డి సమావేశం

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ దగ్గర పడుతుండడంతో విద్యుత్‌శాఖ మంత్రి దసరా పండుగ మరుసటిరోజే నల్లగొండలో సీపీఎం, సీపీఐలతో కీలక సమావేశాన్ని నిర్వహించి సమన్వయ కమిటీలను ఏర్పాటుచేసుకున్నారు. ఈ మూడు పార్టీలు జిల్లాస్థాయితోపాటు నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటుచేశారు. యాదాద్రి, నల్లగొండ జిల్లాల ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వామపక్షాల నాయకులతో మంత్రి జగదీష్‌రెడ్డి ఉప ఎన్నికలో బీజేపీని ఒంటరి చేయడంతోపాటు నిలువరించి డిపాజిట్లు గల్లంతు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. గతంలో మునుగోడులో ఏ ఎన్నికల్లోనూ బీజేపీకి 15వేల ఓట్లకు మించి ఓట్లు రాలేదని, ఈసారి కూడా డిపాజిట్లు రానివ్వద్దని మూడు పార్టీలు నిర్ణయించాయి. ఈ మూడు పార్టీలు కూడా సమన్వయ కమిటీలను ఏర్పాటుచేశాయి. జిల్లాస్థాయిలో టీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి జగదీష్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, సీపీఐ నుంచి పల్లా వెంకట్‌రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావులను ప్రకటించారు. ఇక నియోజకవర్గస్థాయిలో సీపీఎం నుంచి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి జహంగీర్‌, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, శ్రీరాములు, టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, కంచర్ల రామకృష్ణారెడ్డిలను నియమించారు. ఈ కమిటీలు ఉప ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయనున్నాయి. 


ఎందుకు మద్దతిస్తున్నామో చెప్పనున్నారు

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డదంటూ గతంలో పోరాటాలు చేసి ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడంపట్ల సీపీఎం, సీపీఐలపై విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తాము ఎందుకు మద్దతిస్తున్నామో ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు కామ్రేడ్లు సమాయత్తం అవుతున్నారు. మునుగోడు ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకుని కిందినుంచి పైస్థాయి వరకు వామపక్ష నాయకులపై డబ్బులకు అమ్ముడుపోయి బూర్జవ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారన్న ఆరోపణలు వస్తుండడంతో సీపీఎం, సీపీఐల నాయకత్వం అప్రమత్తమైంది. ఈ నెల 12న మునుగోడులో బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజలకు తాము టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడానికి గల కారణాలను వివరించే ప్రయత్నాలు చేయడానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈసభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరుకానున్నారు.


ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి : కలెక్టర్‌

 మునుగోడు ఉపఎన్నిక సాఫీ నిర్వహణకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం కలెక్టరేట్‌లో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం అక్టోబరు 3న ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసినందున, అదే రోజు నుంచి నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. మోడల్‌ కోడ్‌ అమలులో ఉన్నందున ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలపై ఎలాంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రాతలనైనా చెరిపి వేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ఎంసీసీ 16టీంలు ఏర్పాటు చేశామన్నారు. సభలు, సమావేశాలు వీడియోగ్రఫికి వీఎస్‌టీ 7టీంలు, డబ్బు, మద్యం పంపిణీ అరికట్టేందుకు వాహనాల తనిఖీకి ఎఫ్‌ఎస్‌టీ (ఫ్లయింగ్‌ స్క్వాడ్‌) 14టీంలు, ఎస్‌ఎస్‌టీ 18టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అతిథి గృహాలు, వాహనాలు ఎన్నికల ప్రచారినికి వాడకూడదని అన్నారు. నవంబరు 6న ఎన్నికల కౌంటింగ్‌ ఉంటుందని, నవంబరు 8వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ ముగింపు వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందన్నారు. సింగిల్‌విండో పద్దతిన చండూరు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో 48గంటల ముందు దరఖాస్తు చేస్తే 48గంటల లోపల ఫస్ట్‌కం ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిన అనుమతులు జారీ చేస్తామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పోటీ చేస్తున్న అభ్యర్థి గరిష్ఠ ఎన్నికల వ్యయ పరిమితి రూ.40లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, నాయకులు పాల్గొన్నారు. 


బీజేపీని ఓడించేందుకు కలిసి పనిచేస్తాం : మంత్రి జగదీష్‌రెడ్డి 

దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న బీజేపీని ఓడించేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి పనిచేస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో సీపీఎం, సీపీఐలతో మునుగోడు ఉపఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన అనంతరం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశంలో రాబోయే రోజుల్లో అనేక రాజకీయ మార్పులు చోటుచేసుకోనున్నాయని, బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచి ఉన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి కేంద్రం తట్టుకోలేక కుట్రలు పన్నుతోందన్నారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా తాము పనిచేస్తామన్నారు. సీపీఐ రాష్ట్రనేత పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ దేశానికి ప్రమాదకరంగా తయారైందని మతోన్మాద బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడులో అడ్డుకుంటామన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలు అమలు చేస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికలో ఓడించడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Read more