యాదగిరిగుట్టలో భక్తుల కోలాహలం
ABN , First Publish Date - 2022-10-17T06:07:20+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం భక్తులతో ఆదివారం కోలాహలంగా మారింది. వారాంతపు సెలవు రోజు కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్య లో దేవదేవుడి దర్శనాల కోసం తరలివచ్చారు.
కిటకిటలాడిన ఉభయ దర్శన క్యూలైన్లు
స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటల సమయం
నిత్యకల్యాణ వేడుకలకు స్వర్ణ సింహాసనం
యాదగిరిగుట్ట, అక్టోబరు 16: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం భక్తులతో ఆదివారం కోలాహలంగా మారింది. వారాంతపు సెలవు రోజు కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్య లో దేవదేవుడి దర్శనాల కోసం తరలివచ్చారు. ఆలయ తిరువీధులు.. ఆర్జిత సేవా మండపాలు భక్తనులతో కోలాహలంగా కనిపించాయి. ఉభయ దర్శనాల క్యూ లైన్లు, ప్రసాదాల విక్రయశాల వద్ద క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిశాయి. కొండకింద కల్యాణకట్టలో మొక్కు తలనీలాలు సమర్పించిన భక్తులు లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి కొండపైకి ఇష్టదైవాల దర్శనాల కోసం ఆర్టీసీ బస్సులు, తమతమ వాహనాల్లో తరలివచ్చారు. ఉభయ దర్శనాల క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచివుండి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఆర్జిత సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ధర్మదర్శనాలకు సుమారు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారి దర్శనానంతరం భక్తులు ప్రసాదాల కొనుగోలు కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.19.88లక్షలు, కొండకింద దీక్షాపరుల మండపంలోని సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో సుమారు 182 మంది దంపతులు పాల్గొనగా రూ.1.45లక్షలు, కొండపైకి సుమారు 1100వాహనాలు రాగా రూ.5.50లక్షల ఆదాయం ఆలయ ఖజానాలో జమ అయినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. పాతగుట్ట ఆలయంలో స్వయంభువులను దర్శించుకుని సేవోత్సవాల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా ఉండగా క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులు కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు సకాలంలో అందక ఇబ్బందులకు గురయ్యారు. కాగా, వివిధ విభాగాల ద్వారా రూ.40,72,463 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరింది.
స్వామికి శాస్త్రోక్తంగా నిత్యారాధనలు
యాదగిరీశుడికి నిత్యారాధనలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా జరిగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు గర్భాలయంలోని స్వయంభువులను, ప్రతిష్టా అలంకారమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చనలు జరిపారు. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో సు దర్శన హోమం,నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడి నిత్య పూజ లు శైవాగమ పద్దతిలో జరిపారు. సాయంత్రం ప్రధానాలయంలో అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు జరిగాయి.
నిత్యకల్యాణ వేడుకలకు స్వర్ణ సింహాసనం
స్వామివారి నిత్యకైంకర్యాల నిర్వహణ కోసం వినియోగించే ప్రతీ సామగ్రికి దాతల సాయంతో స్వర్ణ తాపడం చేయిస్తున్నారు. అందులో భాగంగా స్వామివారి శయనోత్సవ పీఠం, అష్టోత్తర పూజల నిర్వహణకు స్వర్ణ తాపడం చేసిన సింహాసనాన్ని తయారు చేయించారు. తాజాగా, స్వామివారి నిత్యతిరుకల్యా ణోత్సవం నిర్వహణకు అధికారులు దాతల సాయంతో ప్రత్యేకంగా స్వర్ణ సింహాసనాన్ని తయారు చేయించారు. ఈ సింహాసనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వైదిక పర్వాలు నిర్వహించనున్నట్టు, అదే సమయంలో దాతల పేర్లు, తయారీ వివరాలను వెల్లడించనున్నట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు. అదేవిధంగా ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో కల్యాణోత్సవం నిర్వహించే మండపాన్ని, కల్యాణోత్సవానికి ముందుగా గజవాహన సేవను నిర్వహించే సేవ పీటలను కూడా స్వర్ణ తాపడం చేయించనున్నట్టు ఈవో తెలిపారు.