బై..బై..గణేషా

ABN , First Publish Date - 2022-09-10T06:00:00+05:30 IST

జిల్లాలో తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం శోభాయమానంగా సాగింది.

బై..బై..గణేషా
సద్దుల చెరువులో శుక్రవారం రాత్రి గణేషుడిని నిమజ్జనం చేస్తున్న మునిసిపల్‌ సిబ్బంది

నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి జగదీ్‌షరెడ్డి 

పోలీసుల పటిష్ఠ బందోబస్తు 

రాత్రి వరకు కొనసాగిన నిమజ్జనం

(సూర్యాపేట కల్చరల్‌)

జిల్లాలో తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం శోభాయమానంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో గణేష్‌ విగ్రహాలను ఏర్పాటు చేసి డప్పు, చప్పుళ్లు, నృత్యాలు, కోలాటాలతో శోభాయాత్రను నిర్వహించి విగ్రహాలను నిమజ్జనం చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. 

జిల్లా కేంద్రంలో పోస్టాఫీస్‌ సెంటర్‌లో భజనమందిరం వద్ద శోభాయాత్రను మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రారంభించారు. మట్టి గణేష్‌ విగ్రహాన్ని ఉంచిన ట్రాక్టర్‌ను మంత్రి స్వయంగా నడుపుతూ సద్దుల చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ వరకు తీసుకెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేయించారు. అదేవిధంగా శోభాయాత్రలో కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.శోభాయాత్రలో చిన్నారులు, మహిళలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సద్దుల చెరువులో నిమజ్జనం

జైబోలో గణేష్‌ మహారాజ్‌కి జై..అంటూ డప్పు చప్పుళ్లు, నృత్యాలు, కోలాటాలు నడుమ రంగులు చల్లుకుంటూ గణనాథుల శోభాయాత్ర వైభవంగా సాగింది. వీధులన్నీ గణేష్‌ వాహనాలతో రంగురంగులతో కనిపించాయి. జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన గణేష్‌విగ్రహాలను సద్దుల చెరువులో నిమజ్జనం చేశారు. పలు విగ్రహాలను దూర ప్రాంతాలకు నిమజ్జనానికి తరలించారు. సద్దుల చెరువు వద్ద మూడు భారీ క్రేన్‌లతో గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేశారు. సద్దుల చెరువు వద్ద మునిసిపాలిటీ ఆధ్వర్యంలో అన్నిసౌకర్యాలు కల్పించారు. భక్తులకు తాగునీరు, మినీ ట్యాంక్‌ బండ్‌ వద్ద బ్యారీకేడ్లు, లైటింగ్‌, మర పడవలు, క్రేన్లు, గజ ఈతగాళ్లను ఏర్పాటుచేశారు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు తాగునీటి సౌకర్యం, అల్పాహారం అందజేశాయి. కోర్టు చౌరస్తా వద్ద ముస్లింలు తాగుగనీ ప్యాకెట్లు అందజేశారు. ఆలంకార్‌ బజార్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ అన్నప్రసాదాన్ని వితరణ చేసింది.

ట్రాఫిక్‌ మళ్లింపు

శోభాయాత్రతో పట్టణంలో పలువీధుల్లో రాకపోక లను పోలీసులు దారిమళ్లించారు. శోభాయాత్రకు అడ్డం కులు లేకుండా శంకర్‌విలాస్‌ సెంటర్‌ నుంచి మార్కెట్‌ రోడ్డుకు, కోర్టు సెంటర్‌ నుంచి సాయిబాబా మందిరం, పొట్టిశ్రీరాముల సెంటర్‌ నుంచి సద్దుల చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ వైపు దారిమళ్లించారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 700 మంది బందోబస్తు నిర్వహించారు.జిల్లాకేంద్రంలో డీఎస్పీ నాగభూషణం పర్యవేక్షణలో పట్టణ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో రాత్రి వరకు బందోబస్తు కొనసాగింది.

లడ్డూ వేలం రూ.1.50లక్షలు

జిల్లా కేంద్రంలోని భానుపురి గణేష్‌ మందిరం వద్ద లడ్డూ వేలం నిర్వహించగా, రైతు సమన్వయ సమితి సూర్యాపేట మండల కోఆర్డినేటర్‌ కెక్కిరేణి సత్యనారాయణగౌడ్‌ రూ.1,50,000కు దక్కించుకున్నారు. లడ్డూను ఆయనకు మంత్రి జగదీ్‌షరెడ్డి అందజేశారు. ఇదిలా ఉండగా, జిల్లా కేంద్రంలోని సీతారాంపురం ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని భక్తులు వినూత్నంగా ఎడ్ల బండిపై తీసుకెళ్లి సద్దుల చెరువులో నిమజ్జనం చేశారు.

నాగరిక సమాజాన్ని నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌ : మంత్రి జగదీష్‌రెడ్డి

నాగరిక సమాజాన్ని నిర్మిస్తూ సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలుపుతున్నారని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్‌ పోస్టాఫీస్‌ వద్ద గణేష్‌ శోభాయాత్రను శుక్రవారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఆహ్లాదకర, ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నవరాత్రులను, నిమజ్జన శోభాయాత్రను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అన్ని మతాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడంలో సూర్యాపేట ప్రజలు ముందున్నారన్నారు. గణేష్‌ నవరాత్రుల్లో ముస్లింలు భాగస్వాములై మద్దతు తెలపడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఎస్పీ నాగభూషణం, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్‌ బైరెడ్డి సత్యనారాయణరెడ్డ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత, గ్రంథాలయ సంస్థచైర్మన్‌  శ్రీనివా్‌సగౌడ్‌, కౌన్సిలర్‌ గండూరి రమేష్‌, తాహేర్‌పాష, జీడి భిక్షం, ఉప్పల ఆనంద్‌, భానుపురి గణేష్‌ ఉత్సవ సమితిసభ్యులు అనంతుల కృపాకర్‌, రుక్మారావు, వెంకన్నగౌడ్‌, చలమల్ల నర్సింహ పాల్గొన్నారు.



Updated Date - 2022-09-10T06:00:00+05:30 IST