గౌడ ఓటర్లపై బీజేపీ నజర్‌

ABN , First Publish Date - 2022-10-17T06:01:16+05:30 IST

మునుగోడు ఉపఎన్నికకు సమయం సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఓ వైపు పార్టీలో చేరికల ను ముమ్మరం చేసి మరోవైపు సామాజికవర్గాల ఓటర్లపై నాయకులు దృష్టిసారించారు.

గౌడ ఓటర్లపై బీజేపీ నజర్‌
బీసీ ముఖ్యనేతలతో మాట్లాడుతున్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

త్వరలో మునుగోడులో గౌడ గర్జనకు సన్నాహాలు


యాదాద్రి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉపఎన్నికకు సమయం సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఓ వైపు పార్టీలో చేరికల ను ముమ్మరం చేసి మరోవైపు సామాజికవర్గాల ఓటర్లపై నాయకులు దృష్టిసారించారు. నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. మొత్తం 2,41,367మంది ఓటర్లు ఉండగా, వీటిలో 40వేలకు పైగా ఓటర్లు గౌడ సామాజికవర్గానికి చెందినవారున్నారు. ఆ తర్వాతి స్థానంలో గొల్ల, కుర్మలు, పద్మశాలీలు, ముదిరాజు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సామాజికవర్గాల వారీగా ఓటర్లపై ప్రధాన పార్టీల నేతలు దృష్టి సారించారు.ఆయా వర్గాల నుంచి మెజార్టీ ఓట్లు సాధించేందుకు ఎత్తుకు,పైఎత్తులు వేస్తున్నారు. గౌడ సామాజికవర్గానికి చెందిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఇటీవల టీఆర్‌ఎ్‌సకు రాజీనామ చేశారు.ఆయన త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అదేవిధంగా అన్ని పార్టీల అధిష్ఠానాలు కులసంఘాల నేతలో చర్చిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.


గౌడ గర్జనకు బీజేపీ సన్నాహాలు

మునుగోడులో గౌడ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటం, టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ బీజేపీలో చేరనుండటంతో ఆ వర్గానికి చెం దిన ఓటర్లపై బీజేపీ దృష్టిసారించింది. అందులో భాగంగా ఈ నెల 20నుంచి 23వ తేదీ మధ్యలో గౌడ గర్జన సభను మనుగోడులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని మెజార్టీ గౌడకులస్థులను తరలించేలా ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, తదితరులు సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్‌లో బీసీ సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేతలతో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారీగా సీనియర్‌ నేతలు బాధ్యత తీసుకుని, గౌడ సామాజికవర్గానికి చెందిన ఓటర్లను ఆకర్షించే ప్రయ త్నం చేస్తున్నారు. బూర నర్సయ్యగౌడ్‌ బీజేపీలో చేరనుండటంతో, ఆయనతో పాటు సీనియర్‌ నాయకులు నియోజకవర్గవ్యాప్తంగా ప్రచారం నిర్వహించేలా బీజేపీ ప్రణాళికలు రూపొందించింది.

Updated Date - 2022-10-17T06:01:16+05:30 IST