మోటార్‌ దొంగల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-04-10T06:28:59+05:30 IST

రైతుల మోటార్లను దొంగతనం చేస్తున్న ముఠాను అరెస్ట్‌ చేసినట్లు సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. కోదాడ రూరల్‌ సీఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మోటార్‌ దొంగల అరెస్ట్‌
మోటార్లను చూపుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

 రూ.2.15 లక్షలు స్వాధీనం 

కోదాడ రూరల్‌, ఏప్రిల్‌ 9: రైతుల మోటార్లను దొంగతనం చేస్తున్న  ముఠాను అరెస్ట్‌ చేసినట్లు  సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. కోదాడ రూరల్‌ సీఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిలుకూరు మండలం సీతారాంపురానికి చెందిన సంపంగి నవీన్‌, కోదాడ మండలం లక్ష్మీపురానికి చెందిన డారంగుల శ్రీను, డారంగుల శివ, సంపంగి యాదగిరి, యరగాని నాగరాజు, డారంగుల రాంబాబు, రాపాని మహేష్‌, పల్లపు రాజశేఖర్‌లు పాత ఇళ్ల స్లాబ్‌లను పగులగొట్టి జీవనం సాగించేవారు. గతంలో ఓ పాత ఇంటి స్లాబ్‌ పగులగొట్టేందుకు వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వ్యవసాయ మోటార్‌ను అపహరించారు. ఆ మోటార్‌ను అమ్మితే రూ.2500 రావడంతో అందరూ సమానంగా పంచుకుని దొంగతనాలకు పాల్పడితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో వ్యవసాయ మోటార్ల చోరీకి పాల్పడటం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇటీవల చోరీ చేసిన మోటార్లను అనంతగిరి మండలం మొగలాయికోట గ్రామ శివారులో దాచి ఉంచారు. ఎస్‌ఐ సత్యనారాయణ పికెటింగ్‌ నిర్వహిస్తుండగా నవీన్‌, శ్రీను, శివలు మోటార్లు తరలిస్తూ పట్టుబడ్డారు. అనంతరం విచారణ చేపట్టగా, నిందితులు చేసిన దొంగతనాలను ఒప్పుకోగా, మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. విక్రయించిన 35 మోటార్ల సొమ్ము రూ. 2.15 లక్షలను కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒక పల్సర్‌ మోటార్‌ సైకిల్‌, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకున్న అనంతగిరి ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బంది రమేష్‌, రామారావు, శ్రీనివాస్‌, జానీపాషా, శ్రీనులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ రఘు, రూరల్‌ సీఐ నాగదుర్గా ప్రసాద్‌, టౌన్‌ సీఐ నర్సింహారావు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.  

Read more