సాయంత్రం ఓపీ సేవలేవీ?

ABN , First Publish Date - 2022-08-01T05:45:35+05:30 IST

మెడికల్‌ కళాశాలలకు అనుసంధానంగా ఉన్న బోధనాస్పత్రుల్లో సాయంత్రం ఓపీ సేవలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అయితే జిల్లా కేంద్రంలోని బోధనాస్పత్రిలో మా త్రం నేటికీ సాయంత్రం ఓపీ సేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో రోగులు నిత్యం సాయంత్రం వరకు ఎదురుచూసి వెనుదిరుగుతున్నారు.

సాయంత్రం ఓపీ సేవలేవీ?
నల్లగొండ జిల్లాకేంద్ర ఆస్పత్రిలో ఓపీ కోసం ఎదురుచూస్తున్న రోగులు

జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అమలుకు నోచుకోని వైనం

నిత్యం పడిగాపులుకాసి వెనుదిరుగుతున్న రోగులు


నల్లగొండ అర్బన్‌: మెడికల్‌ కళాశాలలకు అనుసంధానంగా ఉన్న బోధనాస్పత్రుల్లో సాయంత్రం ఓపీ సేవలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అయితే జిల్లా కేంద్రంలోని బోధనాస్పత్రిలో మా త్రం నేటికీ సాయంత్రం ఓపీ సేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో రోగులు నిత్యం సాయంత్రం వరకు ఎదురుచూసి వెనుదిరుగుతున్నారు.


డీఎంఈ ఆదేశాల మేరకు బోధనాస్పత్రుల్లో సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు ఓపీ సేవలు అందించాలి. సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రికి రోగులు జిల్లాలో ని పలు ప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే సాయంత్రం 4గంటలు దాటినా ఓపీ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో రోగులు నిరాశ గా తిరిగివెళ్తున్నారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుండగా, చా లా మంది జ్వరాల బారిన పడుతున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగు ల సంఖ్య ఎక్కువైంది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా సాయంత్రం ఓపీ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో వైద్యుల తీరుపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో సాయంత్రం ఓపీ వైద్య చికిత్స ల సమయాన్ని ప్రదర్శిస్తూ చిన్న ప్లెక్సీని ఏర్పాటు చేశారు గానీ, ఓపీ రాసేందుకు సిబ్బంది, చూసేందుకు వైద్యులు లేరు. డాక్టర్ల ఓపీ గదుల కు తాళాలు దర్శనమిస్తున్నాయి. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ఓపీ రాసేందుకు ఒకరిని నియమించినా వైద్యులు మాత్రం లేరు.


రోగుల ఎదురుచూపు

సాయంత్రం వైద్య సేవల కోసం రోగులు ఎదురుచూస్తున్నారు. ఆస్పత్రిలో సాయంత్రం ఓపీ చూస్తున్నారని తెలుసుకొని పలు మండలాల నుంచి రోగులు వస్తున్నారు. రోజుకు పది మందికి పైగా సాయంత్రం వైద్యసేవల కోసం వస్తున్నారు. ఓపీ నమో దు చేసే సిబ్బంది, వైద్యులు లేకపోవడంతో రోగులు నిరాశతో వెనుతిరుగుతున్నారు.


ఉదయం వీలుకాని వారికి సాయంత్రం ఉపయోగం : రమేష్‌, నల్లగొండ

నేను ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నా. ఉద్యోగరీత్యా ఉదయం వీలు కాకపోవడంతో సాయంత్రం ఓపీ కోసం వచ్చా. చెవిపోటుతో బాధపడుతుండగా, ఇక్కడ ఓపీ రాసేవారు, డాక్టర్‌ లేరు. అధికారులు దృష్టిసారించి వెంటనే ఓపీ సేవలను అందుబాటులోకి తేవాలి.


జ్వరం వచ్చింది : ముత్తయ్య, కక్కిరేణి, రామన్నపేట మండలం

నాకు నాలుగైదు రోజులుగా జ్వరం వస్తోంది. కాళ్లు, చేతులు లాగుతున్నాయి. సాయంత్రం పూట ఇక్కడ చూస్తారని మా ఊరిలో చెప్పడంతో భార్యతో కలిసి వచ్చా. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే డాక్టర్లు లేరు. ఊరికి వెళ్లి రావాలం టే బస్సులు ఉండవు.రాత్రి ఇక్కడే ఉండి ఉదయం చూయించుకొని వెళ్తాం.


Updated Date - 2022-08-01T05:45:35+05:30 IST