క్షేత్రపాలకుడికి శాస్త్రోక్తంగా ఆకుపూజ

ABN , First Publish Date - 2022-12-06T23:46:05+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, స్వామికి నిత్యపూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద ఆంజనేయస్వామికి వేదమంత్రాలతో పంచామృతాభిషేకం నిర్వహించి సింధూరం, వివిధ రకాల పూలమాలలతో అర్చకులు అలంకరించారు. ఆంజనేయుడి సహప్రనామ పఠనాలతో నాగవల్లీ దళార్చనలు నిర్వహించారు.

క్షేత్రపాలకుడికి శాస్త్రోక్తంగా ఆకుపూజ
నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

వైభవంగా ఆళ్వార్‌ తిరునక్షత్రోత్సవాలు

యాదగిరీశుడిని దర్శించుకున్న కైలాస్‌ మఠ్‌ పీఠాధిపతి

యాదగిరిగుట్ట, డిసెంబరు6: యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, స్వామికి నిత్యపూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద ఆంజనేయస్వామికి వేదమంత్రాలతో పంచామృతాభిషేకం నిర్వహించి సింధూరం, వివిధ రకాల పూలమాలలతో అర్చకులు అలంకరించారు. ఆంజనేయుడి సహప్రనామ పఠనాలతో నాగవల్లీ దళార్చనలు నిర్వహించారు. ప్రధానాలయంలోని స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు నిజాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించారు. అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. కొండపైన అనుబంధ ఆలయం శివాలయంలో రామలింగేశ్వరస్వామికి, ముఖమండపంలోని స్ఫటికమూర్తులకు నిత్యపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. పాతగుట్ట ఆలయంలో పుష్కరిణి, ప్రధానాలయంలోని, కొండపైన శివాలయంలోని ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆళ్వార్‌ తిరునక్షత్రోత్సవాలు

యాదగిరిక్షేత్రంలో మంగళవారం తిరుమంగైయాళ్వార్‌ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఉదయం తిరుమంగైయాళ్వార్లకు వేదమంత్రాలతో స్నపన తిరుమంజనాలు నిర్వహించి సేవలో తీర్చిదిద్ది పురప్పాట్టు సేవలో ఊరేగించారు. సాయంత్రం నిర్వహించిన వేడుకలతో తిరుమంగైయాళ్వార్‌ తిరునక్షత్ర పర్వాలు ముగిశాయని, ఆళ్వారాచార్యుల్లో మరో ప్రముఖులు తిరుప్పాణి ఆళ్వార్‌ తిరునక్షత్రోత్సవాలు సాయంత్రంవేళ ఆగమ శాస్త్రరీతిలో తొళక్కంతో(తొలి పూజలతో) ఆరంభమైనట్లు, మూడు రోజులపాటు తిరుప్పాణి ఆళ్వార్ల తిరునక్షత్రోవాలు కొనసాగుతాయని ఆచార్యులు వివరించారు. యాదాద్రీశుడిని నాసిక్‌ త్రయంబకేశ్వర్‌ కైలా్‌సమఠ్‌ పీఠాధిపతి సంవిదానంద సరస్వతీ స్వామీజీ దర్శించుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, ధిల్లీ ఐఏఎస్‌ అధికారి వైవీవీజే.రాజశేఖర్‌లు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:46:06+05:30 IST