‘దోస్త్‌’తో మొదలైన అడ్మిషన్ల ప్రక్రియ

ABN , First Publish Date - 2022-07-07T05:27:42+05:30 IST

ఇంటర్‌, డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి జారీ చేసిన దోస్త్‌ నోటిఫికేషన్‌ ఈ నెల 1వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. అదే సమయంలో ఇంటర్‌ కళాశాలలకు కేటాయించాల్సిన లాగిన్స్‌ ఇవ్వకపోవడంతో అడ్మి షన్లు కావడంలేదు.

‘దోస్త్‌’తో మొదలైన అడ్మిషన్ల ప్రక్రియ
రామన్నపేటలోని డిగ్రీ కళాశాల

 డిగ్రీలోకి కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు 

 ఇంటర్‌ అడ్మిషన్లకు లాగిన్‌ సమస్య

 నిలిచిన విద్యార్థుల నమోదు

భువనగిరి టౌన్‌, జూలై 6: ఇంటర్‌, డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి జారీ చేసిన దోస్త్‌ నోటిఫికేషన్‌ ఈ నెల 1వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. అదే సమయంలో ఇంటర్‌ కళాశాలలకు కేటాయించాల్సిన లాగిన్స్‌ ఇవ్వకపోవడంతో అడ్మి షన్లు కావడంలేదు. దీంతో ఇటు విద్యార్థులతో పాటు యాజమాన్యాలు సైతం అయోమయంలో పడ్డారు. ఇదిలా ఉండగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యార్థులతో పోలీస్తే సీట్లు రెట్టింపుగా ఉండటం గమనార్హం. 

ప్రైవేట్‌ కళాశాలల చేతుల్లో సర్టిఫికెట్లు

ప్రైవేట్‌ డిగ్రీ, ఇంటర్‌ కళాశాలల యాజమాన్యాలు ఎప్పటిమాదిరిగానే మొదటి సంవత్సరంలో ప్రవేశాలను పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల ఇళ్లను లక్ష్యం చేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దోస్త్‌ విధానంలో విద్యార్థులు కళాశాలను, కోర్సును ఎంపిక చేసుకోవాల్సి ఉన్నా ప్రైవేట్‌ యాజమాన్యాల ప్రతినిధులు ఆ విద్యార్థుల సర్టిఫికెట్లను తీసుకుంటున్నారు. తమ కళాశాల ఆప్షన్‌ను పేర్కొంటూ దోస్త్‌లో పేర్లను రిజిస్ర్టేషన్‌ చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే మొదటగా ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలకు లాగిన్‌ కేటాయించిన రెండు వారాల తర్వాత ప్రైవేట్‌ కళాశాలలకు లాగిన్‌ ఇవ్వడం పరిపాటి. కానీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా నేటికి ప్రభుత్వ కళాశాలలకు కూడా లాగిన్స్‌ను ఇంటర్‌ బోర్డు కేటాయించలేదు. దీంతో విద్యార్థుల రిజిస్ట్రేషన్స్‌ కావడం లేదు. ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లను పెంచే లక్ష్యంతో సంబంధిత లెక్చరర్లు విద్యార్థులకు నచ్చచెబుతున్నప్పటికీ ప్రైవేట్‌ యాజమాన్యాలు ముందుగానే విద్యార్థుల సర్టిఫికెట్లను ఒడిసి పట్టుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ డిగ్రీ,ఇంటర్‌ కళాశాలలో అడ్మిషన్లపై ప్రభావం చూపనుంది. జీరో అడ్మిషన్లు ఉండే కళాశాలలు, కోర్సులపై నిబంధనల మేరకు యూనివర్సటీ, ఇంటర్‌ బోర్డు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. 

అర్హులైన విద్యార్థుల కన్నా రెండింతల సీట్లు 

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల 96 ఉన్నాయి. వీటిలో 2022-23 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం కోర్సులో సుమారు 34 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇటీవల ప్రకటించిన ఇంటర్‌ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కేవలం 17,119మంది మాత్రమే ఉన్నారు. దీంతో డిగ్రీలో అవకాశం ఉన్న సీట్లతో పోలీస్తే అర్హులైన విద్యార్థులు సగమే ఉన్నారు. పైగా ఎంసెట్‌ ఆధారిత ఇంజనీరింగ్‌ కోర్సులతో పాటు మెడికల్‌ వైపు వెళ్లే వారు కూడా అధికంగానే ఉంటారు. మరికొద్ది మంది హైదరాబాద్‌ డిగ్రీ కళాశాలలో చేరేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో డిగ్రీ ప్రవేశాలపై అధికారులలో ఆందోళన నెలకొంది. అయితే గతేడాది కూడా డిగ్రీ ప్రవేశాలు 50శాతం దాటలేదని తెలిసింది. 

ఇంటర్‌లోనూ అదే పరిస్థితి

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ రెసిడెన్షియల్‌, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కళాశాలలు కలిపి 225వరకు ఉన్నాయి. వీటిలో 2022-23 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరంలో 60 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇటీవల ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో 38,848 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై ఇంటర్‌కు అర్హత సాధించారు. అయితే వీరిలో పలువురు పాలిటెక్నిక్‌, ఐటీఐ తదితర సమానకోర్సుల్లో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. ఉన్నత విద్య లక్ష్యంగా హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లోని కార్పొరేట్‌ కళాశాలలలో తమ పిల్లలను మరికొందరిని ఈపాటికే తల్లిదండ్రులు చేర్పించారు. అలాగే ప్రభుత్వ రెసిడెన్షియల్‌ కళాశాలలో అడ్మిషన్లకు యాజమాన్యం వారీగా ప్రవేశపరీక్షలు నిర్వహించగా త్వరలో ప్రవేశాలు కూడా చేపట్టనున్నారు. మిగతా విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలో చేరనున్నారు. దీంతో ప్రవేశాల కోసం ప్రైవేట్‌ యాజమాన్యాలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. 

డిగ్రీలో దోస్త్‌ షెడ్యూల్‌ ఇలా.. 

మొదటి దశ : ఈ నెల 1 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు, ఆగస్టు 6నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్లు, ఆగస్టు 6న సీట్ల కేటాయింపు, 7 నుంచి 18 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌. 

రెండో దశ : ఆగస్టు 7 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్లు, 7 నుంచి 22 వరకు వెబ్‌ఆప్షన్లు, ఆగస్టు 27న సీట్ల కేటాయింపు, 27 నుంచి 29 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌. 

మూడో దశ : ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 12 వరకు రిజిస్ట్రేషన్లు, ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 12 వరకు వెబ్‌ఆప్షన్లు, సెప్టెంబరు 16న సీట్ల కేటాయింపు, సెప్టెంబరు 16 నుంచి 22 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, అక్టోబరు 1 నుంచి తరగతులు ప్రారంభం. 

Updated Date - 2022-07-07T05:27:42+05:30 IST