వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్యా యత్నం

ABN , First Publish Date - 2022-07-06T05:05:59+05:30 IST

వరకట్న వేధింపులతో మూడురోజులక్రితం పురుగుల మందుతాగిన వివాహిత సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది.

వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్యా యత్నం
దొంతి దివ్య(ఫైల్‌)

చికిత్స పొందుతూ మృతి

తూప్రాన్‌రూరల్‌, జూలై 5: వరకట్న వేధింపులతో మూడురోజులక్రితం పురుగుల మందుతాగిన వివాహిత సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తూప్రాన్‌ పోలీ్‌సస్టేషన్‌ వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. తూప్రాన్‌ ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్‌ మండలం కిష్టాపూర్‌కు చెందిన దొంతి అశోక్‌కుమార్‌కు మూడేళ్లక్రితం చేగుంట మండలం కరీంనగర్‌ గ్రామానికి చెందిన దివ్య(24)తో పెళ్లయింది. వీరికి ఒక కూతురు ఉంది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త తరచూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. శనివారం భర్తతో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన దివ్య అదేరోజు సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందినట్లు ఎస్‌ఐ వివరించారు. మృతురాలి సోదరుడు మహేశ్‌ ఫిర్యాదు మేరకు భర్త అశోక్‌కుమార్‌, అత్త మణెమ్మ, మామ యాదయ్య, మరిది అనిల్‌ నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ వివరించారు.  

Updated Date - 2022-07-06T05:05:59+05:30 IST