వైకుంఠధామానికి దారేది..?

ABN , First Publish Date - 2022-10-08T04:34:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండేలా వైకుంఠధామాలు నిర్మించినప్పటికీ.. అధికారుల నిర్లక్ష్యంతో అవి నిరూపయోగంగా మారాయి.

వైకుంఠధామానికి దారేది..?
నంగునూరు శివారులో దారి లేకుండా నిర్మించిన వైకుంఠధామం

 భూమిలేని పేదోడికి తప్పని తిప్పలు

 నంగునూరులో ఆఖరి మజిలీకి ఇబ్బందులు

నంగునూరు, అక్టోబరు 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండేలా  వైకుంఠధామాలు నిర్మించినప్పటికీ.. అధికారుల నిర్లక్ష్యంతో అవి నిరూపయోగంగా మారాయి. చాలా గ్రామాల్లో భూమిలేని పేదలు ఎంతో మంది ఉన్నప్పటికీ వారి ఇళ్లల్లో ఎవరైనా మరణిస్తే వారి ఆఖరి మజిలీ ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల్లో రూ. లక్షలు వెచ్చించి వైకుంఠధామాలను నిర్మించింది. ముందు చూపులేని అధికారులు,  నాయకుల నిర్లక్ష్యం వల్ల  వైకుంఠధామాలు పేదలకు అందుబాటులోకి రాకుండా పోయాయి. మండల కేంద్రం నంగునూరులో  నిర్మించిన శ్మశానవాటికకు వెళ్లేందుకు దారిలేక భూమిలేని నిరుపేదలు మరణిస్తే వారి కుటుంబసభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంగునూరులో మూడేళ్ల క్రితం వైకుంఠధామాన్ని నిర్మించారు. కానీ ఆ వైకుంఠధామానికి మాత్రం దారి లేదు. వేసవిలో గ్రామానికి చెందిన నిరుపేదలు మరణిస్తే వారి అంత్యక్రియలు చేయడానికి కుటుంబసభ్యులు దారిలేని వైకుంఠధామానికి వెళ్లేందుకు పక్కనున్న రైతుల అనుమతితో శ్మశానవాటికకు సమీపంలో దహన సంస్కరాలు నిర్వహించేవారు. రెండు మూడేళ్లుగా భారీ వర్షాలు కురియడంతో శ్మశానవాటిక చుట్టూ నీరు నిలిచి లోపలికి వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో గ్రామానికి చెందిన కొంకటి మార్కండేయ అనారోగ్యంతో మృతి చెందగా ఆయనకు గ్రామంలో సెంటు భూమి లేదు. శ్మశానవాటికకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన  కొమురయ్య మానవతా దృక్పథంతో తన వ్యవసాయ పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. శ్మశానవాటికకు దారి చూపాలని గ్రామస్థులు గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అలాగే భూమిలేని మరో  మహిళ చుంచునకోట సత్తవ్వ గురువారం మృతి చెందింది. శ్మశానవాటికకు దారిలేక ఆమె అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు ఇబ్బందులు పడ్డారు. గ్రామానికి చెందిన మానవతామూర్తి ఆవుల పరశురాములు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన వ్యవసాయ పొలంలో అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు సహకరించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి శ్మశాన వాటికకు దారి చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.




Updated Date - 2022-10-08T04:34:35+05:30 IST