పరిహారం తిరిగిస్తాం.. భూములివ్వండి
ABN , First Publish Date - 2022-12-16T00:18:31+05:30 IST
తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి, దివంగత సీఎం వైఎ్‌స రాజశేఖర్‌రెడ్డి 2007లో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రద్దు చేయడం.. ఆ భూముల్లో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారనే సమాచారం ఉండడంతో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఇచ్చేస్తాం.. మా భూములు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు.
తోటపల్లి రిజర్వాయర్ భూనిర్వాసితుల డిమాండ్
ప్రాజెక్టు రద్దయినా 1503 ఎకరాలు ఇంకా ప్రభుత్వ ఆధీనంలోనే
కోహెడ, డిసెంబరు 15 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా తోటపల్లి - ఒగులాపూర్ మధ్య తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి, దివంగత సీఎం వైఎ్‌స రాజశేఖర్‌రెడ్డి 2007లో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆరు గ్రామాల పరిధిలోని 49 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా 3.959 టీఎంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించ తలపెట్టారు. ఇందుకోసం అవసరమైన భూములను సేకరించారు. బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్‌లో 300 ఎకరాలు, కోహెడ మండలంలోని రాంచంద్రపూర్, గొట్లమిట్ట, నారాయణపూర్, వరుకోలు ఒగులాపూర్ గ్రామాల్లో కలిపి మొత్తం 861 ఎకరాలు, చిగురుమామిడి మండలంలోని ఒగులాపూర్‌లో 442 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. భూములు కోల్పోయిన ఒక్కో రైతుకు మొదటివిడతలో రూ.2.10 లక్షలు, రెండో విడతలో రూ.3.15లక్షలు కలిపి మొత్తం రూ.5.25 లక్షల పరిహారం చెల్లించింది. అయితే ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మాణం కోసం 1603 ఎకరాల భూమిని సేకరించగా, కేవలం 100 ఎకరాల భూమిలో గ్రావిటి కెనాల్‌ను నిర్మించింది. మిగతా 1503 ఎకరాల భూమి నిర్మాణానికి సేకరించినా ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అయితే తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రద్దు చేయడం.. ఆ భూముల్లో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారనే సమాచారం ఉండడంతో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఇచ్చేస్తాం.. మా భూములు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు.