నిబంధనలకు తూట్లు

ABN , First Publish Date - 2022-12-09T23:52:33+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా భవనాలను నిర్మిస్తున్నారు.

నిబంధనలకు తూట్లు
సంగారెడ్డిలోని గణేష్‌నగర్‌ ప్రధాన రహదారి పక్కన నిర్మిస్తున్న సెల్లార్‌

సంగారెడ్డిలో అడ్డగోలుగా సెల్లార్ల తవ్వకాలు

అనుమతులు లేకుండా నిర్మాణాలు

నోటీసులతో సరిపెడుతున్న మున్సిపల్‌ అధికారులు

సంగారెడ్డి టౌన్‌, డిసెంబరు 9: సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా భవనాలను నిర్మిస్తున్నారు. అడ్డగోలుగా సెల్లార్ల తవ్వకాలు జరుపుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ (పట్టణ ప్రణాళిక) విభాగం అధికారులు నోటీసులతో సరిపెడుతున్నారు. సంగారెడ్డి పట్టణంలోని సంజీవనగర్‌లోని గోకుల్‌ ఆస్పత్రి పక్కన, మార్క్స్‌నగర్‌లోని సెయింట్‌ ఆర్నాల్డ్‌ పాఠశాల ఎదుట, కలెక్టరేట్‌ సమీపంలోని గణే్‌షనగర్‌ ప్రధాన రహదారిపై, బైపాస్‌ రోడ్డులోని కాంగ్రెస్‌ కార్యాలయం సమీపంలో ఇలా అనేక చోట్ల నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవనాలకు సెల్లార్‌ తవ్వకాలు చేపట్టారు. వీటితో పాటు పోతిరెడ్డిపల్లి, విద్యానగర్‌, హౌసింగ్‌బోర్డు కాలనీల్లో విచ్చలవిడిగా సెల్లార్లు నిర్మిస్తున్నారు.

నిబంధనల ప్రకారం మున్సిపల్‌ నుంచి లేదంటే హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందిన బహుళ అంతస్థుల భవనాలకు సెల్లార్‌ తవ్వకాలు నిషేధం. 200 చదరపు గజాల నుంచి 750 చదరపు గజాల స్థలంలో భవనాలు నిర్మించాలంటే స్థలాన్ని పార్కింగ్‌ (స్టిల్ట్‌ఫ్లోర్‌) కోసం వదలాలి. 751 చదరపు గజాల నుంచి 2500 చదరపు గజాల స్థలంలో కొంత స్థలాన్ని పార్కింగ్‌కు, రెండు గదులు నిర్మించుకోవచ్చు. పట్టణంలో భవనాలకు గ్రౌండ్‌ఫ్లోర్‌ పేరిట భూమి లోపల 8 నుంచి 10 మీటర్ల లోతు వరకు తవ్వుతూ యథేచ్ఛగా సెల్లార్లు నిర్మిస్తున్నారు. 200 గజాల నుంచి 300 గజాల స్థలంలో కూడా సెల్లార్లు నిర్మించడం గమనార్హం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నిర్మాణదారులు జిమ్మిక్కులు చేస్తున్నారు. ముందుభాగంలో సెల్లార్‌ కనిపించకుండా తాత్కాలికంగా గోడలు నిర్మిస్తున్నారు. భవన నిర్మాణం పూర్తికాగానే ఆ గోడలను తొలగించి సెల్లార్లుగా మారుస్తున్నారు. ఇటీవల బీఎ్‌సఎన్‌ఎల్‌ కార్యాలయం ఎదురుగా నిర్మిస్తున్న భవనంలో సెల్లార్‌ కోసం తవ్వగా కొంతమంది కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు కూల్చివేశారు. ఆ భవన యజమాని సెల్లార్‌కు అడ్డుగా గోడను నిర్మించి భవన నిర్మాణాన్ని పూర్తిచేయడం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల కొందరు కౌన్సిలర్లు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్‌ అధికారులు సదరు భవన యజమానులకు నోటీసులు జారీ చేశారు. వారంలో సెల్లార్లు తొలగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ హెచ్చరిక చేశారు. అయినా రాజకీయ నాయకుల అండదండలతో కొందరు సెల్లార్ల తవ్వకాలు మాత్రం ఆపడంలేదు.

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం

-చంద్రశేఖర్‌, సంగారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌

సంగారెడ్డిలో సెల్లార్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు. ఒకవేళ నిబంధనలు ఖాతరు చేయకుండా ఎవరైన సెల్లార్లు తవ్వినా, సెట్‌బ్యాక్‌లు వదలకపోయినా నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తాం. తొలుత షోకాజ్‌ నోటిసులు ఇచ్చి వారే తొలగించుకోవాలని హెచ్చరిస్తాం. ఏడు రోజులు వరకు అవకాశం ఇస్తాం. వారు సెల్లార్లను తొలగించకపోతే మున్సిపల్‌ సిబ్బంది జేసీబీలతో సెల్లార్‌లను కూల్చివేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-12-09T23:52:34+05:30 IST