విద్యాధరి క్షేత్రం.. భక్తిపారవశ్యం

ABN , First Publish Date - 2022-08-22T05:14:41+05:30 IST

వర్గల్‌ విద్యాధరి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవురోజు, శ్రావణమాసం కావడంతో క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

విద్యాధరి క్షేత్రం.. భక్తిపారవశ్యం
వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో చిన్నారులకు చేయిస్తున్న సామూహిక అక్షర స్వీకారాలు

సరస్వతీ అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు 

సామూహిక అక్షర స్వీకారాలు

వర్గల్‌, ఆగస్టు 21: వర్గల్‌ విద్యాధరి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవురోజు, శ్రావణమాసం కావడంతో క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. విద్యా సరస్వతీ అమ్మవారి దర్శనం, చిన్నారులకు అక్షర స్వీకారాలు దిద్దించుకోవడం కోసం భక్తులు క్యూలో గంటల పాటు వేచి ఉన్నారు. ఆలయ అర్చకులు అక్షరాభ్యాస మండపంలో సామూహిక అక్షర స్వీకారాలను చేయించారు. మొదట విద్యా సరస్వతీ అమ్మవారి దర్శనంతో పాటు క్షేత్రంలోని లక్ష్మీగణపతి, స్వయంభు శంభులింగేశ్వరాలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు యావరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఏర్పాట్లు చేశారు. భోజన వసతిని కల్పించారు. 

నాచగిరిలో సత్యనారాయణ వ్రతాలు

వర్గల్‌ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ మండపంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. 

మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం భక్తజనమయంగా మారింది. ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి నిత్యకల్యాణం, ఆర్జిత సేవలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సంప్రదాయబద్ధంగా మట్టికుండలో పాయసం వండి నైవేద్యం సమర్పించారు. చెలక, నజరు, ముఖమండప పట్నాలు రచించి గంగిరేగుచెట్టుకు ముడుపు కట్టి తమ కోరికలు నెరవేర్చమని వేడుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ఒడిబియ్యం, పట్టువస్త్రాలు, బండారి సమర్పించారు. అలాగే మల్లన్న సహోదరి ఎల్లమ్మతల్లికి సాకపెట్టి బోనం నివేదించారు. ఒడిబియ్యం పోసి వేడుకున్నారు.

Updated Date - 2022-08-22T05:14:41+05:30 IST