చేర్యాల మార్కెట్‌లో రైతులకు తప్పని తూర్పార కష్టాలు

ABN , First Publish Date - 2022-05-24T05:03:38+05:30 IST

చేర్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డులోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూర్పార పట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

చేర్యాల మార్కెట్‌లో రైతులకు తప్పని తూర్పార కష్టాలు
చేర్యాల మార్కెట్‌యార్డులో మండుటెండలో ధాన్యం తూర్పార పడుతున్న రైతు

సాయంత్రం విద్యుత్‌ సరఫరా నిలిపివేతతో ఇబ్బందులు

మండుటెండల్లోనే నిర్వహణ

వంతు కోసం రోజుల తరబడి రైతుల పడిగాపులు

చేర్యాల, మే 23: చేర్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డులోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూర్పార పట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ సౌకర్యమున్నా కేంద్రం నిర్వాహకులు, మార్కెట్‌ అఽధికారులు అన్నదాతల గోడు పట్టకుండా సాయంత్రం కాగానే విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో తూర్పార పట్టుకోవడానికి వీలుపడని పరిస్థితి నెలకొనడం వల్ల వంతులకోసం రోజుల తరబడిగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. మార్కెట్‌లో 4 ప్యాడీ క్లీనర్లు ఉండగా.. చాలామంది రైతులు ధాన్యం తీసుకొచ్చారు. కేవలం ఉదయం వేళ మాత్రమే తూర్పార పట్టుకునేందుకు అనుమతిస్తుండగా, ఉన్న కొద్దిపాటి గంటల సమయంలో విద్యుత్‌ కోతలతో సతమతమవుతున్నారు. వచ్చిన అవకాశాన్ని జారవిడిస్తే మళ్లీ ఎన్నిరోజులకు తమవంతు వస్తుందోనని మండుటెండల్లో తంటాలు పడుతున్నారు. కొద్దిరోజులుగా ఎండలు విపరీతంగా కొడుతుండగా తల్లడిల్లిపోతున్నారు. పలువురు రైతులు యార్డుకు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు కావస్తున్నా తూర్పార పట్టేందుకు రోజులు గడుస్తుండగా, ఎన్నాళ్లకు కొనుగోళ్లు పూర్తిచేస్తారోనని ఉసూరుమంటున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి రాత్రివేళ కూడా తూర్పార పట్టుకునేందుకు వీలుగా విద్యుత్‌ సౌకర్యం కల్పించి ప్యాడీ క్లీనర్లను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2022-05-24T05:03:38+05:30 IST