పటాన్‌చెరు వేదికగా టీయూడబ్ల్యూజే మహాసభ

ABN , First Publish Date - 2022-12-31T23:18:40+05:30 IST

జనవరి 8న టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల జాతీయస్థాయి ప్లీనరీ నిర్వహిస్తున్నామని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు.

పటాన్‌చెరు వేదికగా టీయూడబ్ల్యూజే మహాసభ
జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న అల్లం నారాయణ తదితరులు

ఐజేయూలో విలీనం సందర్భంగా జనవరి 8,9,10 తేదీల్లో జాతీయస్థాయి ప్లీనరీ

ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

పటాన్‌చెరు, డిసెంబరు 31: జనవరి 8న టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల జాతీయస్థాయి ప్లీనరీ నిర్వహిస్తున్నామని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. జాతీయ ప్లీనరీ కోసం పటాన్‌చెరు పట్టణంలోని జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు నిర్వహించే జాతీయ ప్లీనరీకి 22రాష్ట్రాల ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ మూడు రోజుల మహాసభలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ విలీనం చేస్తున్నామని వెల్లడించారు. సదస్సు ప్రారంభ తేదీ 8న టీయూడబ్ల్యూజే మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. 9, 10 రెండు రోజులు జాతీయ ప్లీనరీ కొనసాగుతుందన్నారు. ప్లీనరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత తదితరులు హాజరవుతున్నట్టు చెప్పారు. జాతీయ ప్లీనరీలో పత్రికా రంగంలో వర్ధమాన సవాళ్లపై చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు. చివరి రోజైన 9వ తేదీన సుప్రీం కోర్టు మాజీ ఛీఫ్‌ జస్టిస్‌ రమణ హాజరై పాత్రికేయులనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఆయనతో పాటు ఆల్‌ ఇండియా ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, ఇద్దరు సభ్యులు హాజరవుతున్నారని, జాతీయ స్థాయి ప్లీనరీకి హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వడం చారిత్రాత్మకమన్నారు. అన్ని వసతులు ఉన్న పటాన్‌చెరు జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సదస్సు నిర్వహించేందుకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గూడెంమహిపాల్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సదస్సు ఏర్పాట్లపై ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో చర్చించారు. సదస్సుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్క పాత్రికేయుడు సహకరించాలన్నారు. సదస్సు వేదికను పరిశీలించిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్‌, నాయకులు విష్ణు, యోగి, వేణు, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:18:41+05:30 IST