హరీశ్‌రావు వద్దకు తూప్రాన్‌ అసమ్మతి వర్గం

ABN , First Publish Date - 2022-10-08T05:09:29+05:30 IST

మున్సిపల్‌ చైర్మన్‌ సహకరించడంలేదంటూ శుక్రవారం టీఆర్‌ఎస్‌ నాయకులతోపాటు, కౌన్సిలర్లు మంత్రి హరీశ్‌రావు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు.

హరీశ్‌రావు వద్దకు తూప్రాన్‌ అసమ్మతి వర్గం
మంత్రి హరీశ్‌రావును కలిసిన అసమ్మతి వర్గం నేతలు

తూప్రాన్‌, అక్టోబరు 7: మున్సిపల్‌ చైర్మన్‌ సహకరించడంలేదంటూ శుక్రవారం టీఆర్‌ఎస్‌ నాయకులతోపాటు, కౌన్సిలర్లు మంత్రి హరీశ్‌రావు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. తూప్రాన్‌లో మున్సిపల్‌ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. కార్యక్రమాలను కూడా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దసరా రోజు ఓ వర్గానికి చెందిన యాదవ సంఘం నాయకుడు అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ఏర్పాటు చేయగా, చైర్మన్‌ వర్గం అడ్డుకున్నది. కార్యక్రమం నిర్వహించే ప్రదేశంలో మున్సిపల్‌ చెత్త ట్రాక్టర్లు ఏర్పాటు చేయడం గొడవకు దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేసి పంపించారు. శుక్రవారం పట్టణ అధ్యక్షుడు సతీ్‌షచారీ ఆధ్వర్యంలో సుమారు 100 మంది టీఆర్‌ఎస్‌ నాయకులు, కౌన్సిలర్లు మంత్రి హరీశ్‌రావు వద్దకు వెళ్లారు. చైర్మన్‌ వైఖరి సక్రమంగా లేదని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి హరీశ్‌రావు ఐదారుగురు ముఖ్యమైనవాళ్లు వస్తే మాట్లాడదామని పేర్కొన్నట్టు తెలిసింది. అనంతరం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వద్దకు సైతం వెళ్లి ఫిర్యాదు చేశారు. వారిని కలిసిన వారిలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు ఉన్నారు. 

Read more