కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే వంట నూనెల ధరల్లో పెరుగుదల

ABN , First Publish Date - 2022-03-23T05:25:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగానే వంట నూనెల ధరలు పెరుగుతున్నాయని తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని ఆయిల్‌పామ్‌ నర్సరీని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం రంగనాయకసాగర్‌ గెస్ట్‌హౌ్‌సలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశీయ అవసరాలకు 22 మిలియన్‌ టన్నులు వంట నూనెలు అవసరం ఉండగా, దేశంలో కేవలం 7 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే వంట నూనెల ధరల్లో పెరుగుదల
చంద్లాపూర్‌లో ఆయిల్‌పామ్‌ నర్సరీని పరిశీలిస్తున్న రామకృష్ణారెడ్డి

దేశంలోనే తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ నంబర్‌వన్‌

ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి


చిన్నకోడూరు, మార్చి 22 : కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగానే వంట నూనెల ధరలు పెరుగుతున్నాయని తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని ఆయిల్‌పామ్‌ నర్సరీని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం రంగనాయకసాగర్‌ గెస్ట్‌హౌ్‌సలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశీయ అవసరాలకు 22 మిలియన్‌ టన్నులు వంట నూనెలు అవసరం ఉండగా, దేశంలో కేవలం 7 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. 15 మిలియన్‌ టన్నుల వంట నూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్‌ నూనె దిగుమతి ఆగిపోవడంతో నూనెల రేటు పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, దేశీయ ఉత్పత్తిపై దృష్టిసారించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సీఎం కేసిఆర్‌ ముందు చూపుతో రాష్ట్ర అవసరాలను తీర్చడం కోసమే పామాయిల్‌ సాగును ప్రోత్సహిస్తున్నారని తెలియజేశారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లు కేటాయించడం శుభపరిణామన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ నంబర్‌వన్‌ స్థానంలో ఉందని వెల్లడించారు. తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో నడిచే విజయ వంటనూనెల కంపెనీ రూ. 450 కోట్ల టర్నోవర్‌తో విజయవంతంగా కొనసాగుతున్నది స్పష్టం చేశారు. విజయ కారణంగా ప్రస్తుతం వంట నూనెల ధరలు రూ. 200 దగ్గర స్థిరంగా ఉన్నాయని వివరించారు. అనంతరం రంనాయకసాగర్‌ ప్రాజెక్టు సొరంగమార్గంలోని పంప్‌హౌస్‌, సర్జిపూల్‌, రిజర్వాయర్‌ మధ్యలోని గెస్ట్‌హౌ్‌సను పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ,  జిల్లా ఉద్యానవన శాఖ అధికారిణి రామలక్ష్మి, నియోజకవర్గ అధికారి భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ దుర్గారెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-23T05:25:03+05:30 IST