రుణమాఫీని విస్మరించిన టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-12-06T00:10:12+05:30 IST

టీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు అడ్డాకూలీలుగా మారిపోయారని, రుణమాఫీని కేసీఆర్‌ విస్మరించి రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు

రుణమాఫీని విస్మరించిన టీఆర్‌ఎస్‌
సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పడే రుణమాఫీ

టీఆర్‌ఎస్‌ హయాంలో అడ్డా కూలీలుగా రైతులు

కాంగ్రెస్‌ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి

ధరణి పోర్టల్‌ను రద్దు చేసే వరకు పోరాడుతాం

సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి

సిద్దిపేటఅర్బన్‌, డిసెంబరు 5: టీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు అడ్డాకూలీలుగా మారిపోయారని, రుణమాఫీని కేసీఆర్‌ విస్మరించి రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రైతు రుణమాఫీ జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ రైతుల కోసం పనిచేస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయిందని చెప్పారు. ధరణిలో నెలకొన్న రైతుల సమస్యలు పరిష్కరిస్తామని పైలెట్‌ ప్రాజెక్టు తీసుకుని నెలలు గడుస్తున్నా ఇంత వరకు అతీగతీ లేదని విమర్శించారు. మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్ల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు అడ్డా కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతు సమస్యలు, ధరణి పోర్టల్‌ సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ శాంతియుతంగా వినతిపత్రం సమర్పించడానికి వస్తే పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. కలెక్టరేట్‌ వద్ద నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేస్తుండగా కాంగ్రెస్‌ యువజన మహిళా జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పోలీసులను తప్పించుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లి అధికారికి వినతిపత్రం సమర్పించారు.

ధరణి పోర్టల్‌ను రద్దు చేసే వరకు పోరాడుతాం

సంగారెడ్డి రూరల్‌ : రైతులకు నష్టం కలిగించే ధరణి పోర్టల్‌ను రద్దు చేసే వరకు తాము పోరాడుతూనే ఉంటామని సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి అన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట టీపీసీసీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టి 2022 వరకు సుమారు 20 లక్షల కుటుంబాల పట్టా భూములను నిషేధిత భూములుగా ప్రకటించిందని, కౌలు రైతులకు సమాన హక్కు కల్పించాలని అటవీ ప్రాంతంలోని ఆదివాసులు సాగుచేసుకునేందుకు కాంగ్రెస్‌ చట్టం తెస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులు ఆదివాసులను భయబ్రాంతులకు గురి చేసి వారి భూములను ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని ఆదివాసీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. వెంటనే ధరణి పోర్టల్‌ను రద్దు చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ధర్నాలో మెదక్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్‌, టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంతకిషన్‌, టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T00:10:13+05:30 IST