కార్మికులకు న్యాయం చేసేవరకూ అండగా ఉంటా

ABN , First Publish Date - 2022-08-05T05:17:07+05:30 IST

సదాశివపేట పట్టణ పరిధిలో మూతపడ్డ ప్రియదర్శిని స్పిన్నింగ్‌మిల్‌ కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

కార్మికులకు న్యాయం చేసేవరకూ అండగా ఉంటా
అనిరుద్‌ ఫార్మా కంపెనీ యజమానిపై మండిపడుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సదాశివపేట, ఆగస్టు 4: సదాశివపేట పట్టణ పరిధిలో మూతపడ్డ ప్రియదర్శిని స్పిన్నింగ్‌మిల్‌ కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కంపెనీ క్వార్టర్స్‌లో ఉంటున్న 70 మంది కార్మికులకు చట్టపరంగా రావాల్సిన డబ్బులను చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు. మూతపడిన పరిశ్రమను కొనుగోలు చేసిన యజమాన్యం గురువారం ఎక్స్‌కవేటర్లను పెట్టి క్వార్టర్స్‌ను కూల్చేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. కార్మికులకు న్యాయపరంగా వచ్చే డబ్బులు వచ్చేంతవరకు క్వార్టర్స్‌ను ఖాళీ చేసే ప్రసక్తే లేదని, కొత్త యజమాన్యం కార్మికులకు సెటిల్‌మెంట్‌ చేసేంత వరకు కార్మికుల పక్షాన నిలబడతానని, ఎవడు అడ్డుకుంటాడో తాను చూస్తానని, ఎమ్మెల్యే జగ్గారెడ్డి యజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం స్థానిక పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లే బాధిత కార్మికులతో పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ స్పిన్నింగ్‌ మిల్‌ కంపెనీ యజమాని రాజు, బ్యాంక్‌ యాక్షన్‌లో దక్కించుకున్న అనిరుద్‌ ఆగ్రో ఫార్మా కంపెనీ యజమాని సుధీర్‌రెడ్డి వెంటనే కార్మికులకు సెటిల్‌మెంట్‌ చేయాలన్నారు. 40 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి సెటిల్‌మెంట్‌ చేయకుండా, రావాల్సినవి ఇవ్వకుండా ఎక్స్‌కవేటర్‌తో ఎలా ఇళ్లు కూలగొట్టిస్తారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగునెలల కిందట 110 మంది కార్మికులు వారికి రావాల్సిన బెనిఫిట్స్‌ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నాయకులు ఫ్యాక్టరీ ఎదుట ఽధర్నా నిర్వహించారని, అప్పుడు కేవలం 60 మందికి డబ్బులు ఇచ్చారని, మిగితా 70 మందికి ఇవ్వకుండా టీఆర్‌ఎస్‌ నాయకులు కార్మికుల చేత ఎలా సమ్మెను విరమింపజేశారని మండిపడ్డారు. వెంటనే స్పిన్నింగ్‌ మిల్‌ కంపెనీలో పనిచేసిన 70 కుటుంబాలకు కంపెనీ ఓనర్‌ రాజు, బ్యాంకు నూతన యజమాన్యం కలిసి సెటిల్‌మెంట్‌ చేయాలన్నారు. లేకుంటే ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనలు, సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. 

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత చేయాలి: ఎమ్మెల్యే

సంగారెడ్డి రూరల్‌, ఆగస్టు 4: వచ్చే వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద దీక్ష చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులకు గురువారం జగ్గారెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. వర్గీకరణ జరిగితే దళితులు సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగాల పకంగా, రాజకీయంగా అనేక రంగాల్లో ఎదుగుతారని అన్నారు. గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్‌ వర్గీకరణకు మద్దతు తెలపడంతో పాటు ఒక కమిటీ వేసి వర్గీకరణ అవసరమనే రిపోర్టును కూడా అందించిందని గుర్తుచేశారు. మొదటి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ ఏ, బీ, సీ, డీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 14 రోజులుగా ఎమ్మార్పీఎస్‌ నాయకులు దీక్ష చేస్తున్నారని, వర్గీకరణ జరిగే వరకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గంగేరి శ్రీనివాస్‌, తాళ్లపల్లి సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:17:07+05:30 IST