ఇంకో 40 ఏళ్లు ఉంటా..ఇలాగే పండుగలు చేస్తా!
ABN , First Publish Date - 2022-10-07T05:34:00+05:30 IST
సంగారెడ్డిలో నలభై ఏళ్లుగా దసరా, శ్రీరామనవమి, మహాశివరాత్రి, బోనాలు, వినాయకచవితి వంటి పండుగలన్నీ ఘనంగా జరుపుతున్నానని ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి తెలిపారు.
సంగారెడ్డి అంటే జగ్గారెడ్డిగా పేరు తీసుకువచ్చా
రాముడు నంబర్‌వన్ గ్రేట్
యుద్ధంలో గెలిచిన వారికే చప్పట్లు
రావణాసురుడు నంబర్ టూ గ్రేట్
కులాలు మతాలతో నాకు సంబంధం లేదు
దసరా వేడుకల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి : సంగారెడ్డిలో నలభై ఏళ్లుగా దసరా, శ్రీరామనవమి, మహాశివరాత్రి, బోనాలు, వినాయకచవితి వంటి పండుగలన్నీ ఘనంగా జరుపుతున్నానని ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి తెలిపారు. ఇంకో నలభై ఏళ్లు ఉంటానని, పండుగలు జరువుతానన్నారు. సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియం గ్రౌండ్‌లో బుధవారం రాత్రి నిర్వహించిన దసరా వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఆయన రామ్‌మందిర్‌లో సీతారామ, లక్ష్మణ, హనుమంతుడు, గరుత్మంతుడు విగ్రహాలకు పూజలు చేశారు. అక్కడి నుంచి స్టేడియం వరకు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ జమ్మి చెట్టుకు పూజలు చేసి, పాలపిట్టను ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. నలభై ఏళ్ల ముందు తొలుత డబ్బులు వేసుకుని ఈ కార్యక్రమం జరిపేవారమన్నారు. తర్వాత తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రతీ దసరాకు మిమ్మల్ని కలుస్తున్నానన్నారు. శ్రీరామనవమి రోజు సీతారాముల విగ్రహాలకు ముత్యాల తలంబ్రాలతో వివాహం జరిపిస్తున్న సంగతి తెలిసిందేనన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అనేలా చేశానన్నారు. మీరందరి సహకారం ఉంటే ఇంకా పేరు తీసుకొస్తానన్నారు. తనది ఏ కులం ఏ మతం చెప్పుకోనని, తనకు కులాలు, మతాలతోటి సంబంధం లేదన్నారు. అన్ని వర్గాల వారు చేసుకునే పండుగలకు సహకారం అందిస్తున్నానని జగ్గారెడ్డి తెలిపారు.
రాముడు నంబర్ వన్
రావణాసురుడు చాలా గొప్పవాడు, మహానుభావుడని జగ్గారెడ్డి అన్నారు. సీతమ్మను తీసుకుపోయినా ముట్టుకోలేదన్నారు. రావణాసురుడు శివభక్తుడని, ఆయనను ఎవరూ తక్కువ చేసి చూడొద్దన్నారు. అయినా రాముడు నంబర్ వన్ అని, రావణాసురుడు నంబర్ టూ అన్నారు. యుద్ధంలో గెలిచిన వారికే చప్పట్లు కొడతారని, ఓడిన వారికే కదా బాణాలు కొట్టేదని జగ్గారెడ్డి అన్నారు. స్టేడియంలో నిర్వహించిన దసరా వేడుకలకు ప్రముఖ సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్, గాయనీ సునీతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆపద్బాంధవుడు జగ్గారెడ్డి
ఎవరు కష్టాలో ఉన్నా ఆపద్బాంధవుడిలా ఆదుకునే వ్యక్తి జగ్గారెడ్డి అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. దసరా వేడుకల్లో తాళ్లపల్లి సర్చంచ్ అంకని ప్రవీణ్‌కుమార్, పార్టీ నాయకులు మహేశ్‌బాబు, చిన్నసాయి శ్రీరామ్, కూన సంతోశ్, శ్రీకాంత్, తదితరులు ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేతికి బంగారు కడియం తొడిగారు.