‘మన ఊరు- మన బడి’ పనులు 15 రోజుల్లో పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2022-10-12T04:49:02+05:30 IST
మన ఊరు-మన బడి’ పథకంలో చేపట్టిన పనుల వేగం పెంచాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు.
జిల్లావ్యాప్తంగా రూ. 10 కోట్ల పనులు పూర్తి
రూ.7 కోట్ల బిల్లులు చెల్లింపు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్
సంగారెడ్డి రూరల్, అక్టోబరు 11: ‘మన ఊరు-మన బడి’ పథకంలో చేపట్టిన పనుల వేగం పెంచాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ‘మన ఊరు-మన బడి’లో 331 పాఠశాలల్లో రూ.30 లక్షల లోపు పనులు చేపట్టామని, 104 పాఠశాలల్లో రూ.30 లక్షలకు పైబడిన పనులు చేపట్టామని తెలియజేశారు. ఇప్పటి వరకు రూ.10 కోట్ల విలువైన పనులు పూర్తికాగా, రూ.7 కోట్లు చెల్లించామని కలెక్టర్ తెలిపారు. విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పర్యవేక్షించి 15 రోజుల్లో పెండింగ్ పనులను పూర్తిచేయించాలని ఆదేశించారు. పూర్తయిన పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో కలెక్టర్ లాగిన్‌కి అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో అదనపు కలెక్టర్ రాజర్షిషా, డీఈవో రమేష్, ఈఈలు జగదీశ్వర్, శ్రీనివా్‌సరెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దాం
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి జిల్లాను ప్ల్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కలెక్టర్ ఎ.శరత్ కోరారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్లతో పాటు జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. జిల్లాలో వాడి పారేసే ప్లాస్టిక్ నియంత్రణకు మున్సిపల్ కమిషనర్లు చిత్తశుద్ధితో కృషిచేయాలని సూచించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, ఎగుమతి, నిల్వ, పంపిణీ, విక్రయాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షిషా, పరిశ్రమలశాఖ జీఎం ప్రశాంత్‌కుమార్, డీపీవో సురే్‌షమోహన్, డీఈవో రాజేష్, ఇంటర్మీడియట్ అధికారి గోవింద్‌రాం పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులను ఈనెల 26 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాల గ్రౌండింగ్ వంద శాతం పూర్తిచేయాలని సూచించారు.