సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2022-09-11T05:43:53+05:30 IST

సమాజంలో మార్పు రావాలన్న, సమ సమాజం నిర్మాణం కావాలన్నా ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ఉత్తమ ఉపాధ్యాయులతో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తం, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు

జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం


సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 10 : సమాజంలో మార్పు రావాలన్న, సమ సమాజం నిర్మాణం కావాలన్నా ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. సిద్దిపేట లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో విపంచి కళా నిలయంలో ఆచార్య దేవోభవ పేరుతో జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. చదువుతోనే అన్ని అంశాలు ముడిపడి ఉంటాయని తెలిపారు. ఆస్తులు, అంతస్తులు కాదని విజ్ఞానవంతుడైతే సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. చదువులో ముందంజలో ఉండే ప్రాంతమే అభివృద్ధిలోనూ ముందుంటుందన్నారు. సమాజంలో అందరూ సమానంగా ఉండాలంటే చదువుతోనే సాధ్యమన్నారు. విద్య, వైద్యం సమానంగా ఉచితంగా అందితే అభివృద్ధి సాధిస్తుందన్నారు. విద్య, వైద్యం అందరికీ అందేలా విద్యారంగంలో మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ సేవలను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు, లయన్స్‌ ప్రతినిధులు బాబురావు, ఏ.అమరనాథరావు, జ్యోతి, నాగరాజు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా 50 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-11T05:43:53+05:30 IST