మాఊరి బిడ్డ ప్రధాని కావాలె

ABN , First Publish Date - 2022-12-15T00:37:55+05:30 IST

‘మాఊరి బిడ్డ తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రమంతటా మా చింతమడకకు పేరు తెచ్చారు. ఇక్కడ పుట్టిపెరిగినందుకు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నారు. హరీశ్‌రావు వంటి మంచి నాయకుడిని మాకు అప్పగించారు. ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టారు. అంతటా గెలిచి ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడి పథకాలన్నీ దేశమంతా అమలు చేయాలి.’ అని సీఎం కేసీఆర్‌ స్వగ్రామం చింతమడక వాసులు, జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

మాఊరి బిడ్డ ప్రధాని కావాలె
ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో మంత్రి హరీశ్‌రావు

బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటుపై సంబురాలు

జాతీయ పార్టీ ప్రస్థానం ప్రారంభంపై హర్షాతిరేకలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 14 : భారత రాష్ట్ర సమితి పేరిట జాతీయ పార్టీని ఏర్పాటు చేయడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని చింతమడకకు చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2001వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 14 ఏళ్ల ఉద్యమం అనంతరం తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో అడుగిడుతూ కొత్త పార్టీని ప్రారంభించారు. బుధవారం ఢిల్లీలో జాతీయ పార్టీకి సంబంధించిన భవన్‌ ప్రారంభోత్సవం జరగడంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఇదే ప్రాంతంలో పుట్టిపెరిగి, విద్యాభ్యాసం పూర్తిచేసి, రాజకీయ అరంగేట్రం చేసిన కేసీఆర్‌ మరింత ఉన్నస్థాయి పదవిని చేపట్టాలని ఆయన సన్నిహితులు, జిల్లా వాసులు కోరుకుంటున్నారు.

నాడు టీఆర్‌ఎ్‌సకు ఊపిరిలూది..

2001వ సంవత్సరంలో టీడీపీ పార్టీతోపాటు డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించారు. నాడు కేసీఆర్‌ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ సిద్దిపేట ప్రజలు వెన్నంటే నిలిచారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున బస్సు గుర్తుపై ఆయన ఎమ్మెల్యేగా పోటీచేయగా భారీ మెజార్టీతో గెలిపించారు. ఇదే విషయాన్ని కేసీఆర్‌ పదేపదే చెబుతుంటారు. ఆ తర్వాత అనేక పోరాటాలకు సిద్దిపేట ప్రాంతం వేదికైంది. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో జరిగిన ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసాయి. 2004లో కేసీఆర్‌ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో హరీశ్‌రావు సిద్దిపేటలో పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2008, 2010 ఉప ఎన్నికలు, 2009, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ మెజార్టీ దక్కింది. ఇలా టీఆర్‌ఎ్‌సకు ఆద్యంతం అండగా నిలిచిన గడ్డగా సిద్దిపేట పాత్ర కీలకమని చెప్పాలి.

తరలివెళ్లిన నేతలు

బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటుతో జిల్లా వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన పార్టీ భవనం ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ముఖ్యనేతలు, సీనియర్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కాగా కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చింతమడకలో పుట్టిపెరిగి, దుబ్బాకలో పాఠశాల విద్య, సిద్దిపేటలో ఇంటర్‌, డిగ్రీ చదివిన కేసీఆర్‌కు బాల్యమిత్రులు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత సిద్దిపేట ఎమ్మెల్యేగా 19 ఏళ్లు, ప్రస్తుతం గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్‌ ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు కల్పించారు. తన సన్నిహితులకు పదవుల్లో అవకాశం ఇచ్చారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు పెద్దసారుగా కేసీఆర్‌ను సంబోధిస్తుంటారు.

కేసీఆర్‌ చనిపోతడని ఏడ్చిన

నేను కేసీఆర్‌తో పొలం పనులు చేసిన. చిన్నప్పుడు ఇద్దం కలిసి తిరిగేవాళ్లం. ఆయన తెలంగాణ కోసం దీక్ష చేసినప్పుడు చనిపోతాడని చాలా ఏడ్చిన. కానీ జనం దీవెనలు ఉన్నాయి. మన తెలంగాణలో ఇస్తున్నట్లుగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఉచిత కరెంటును దేశమంతా ఇవ్వాలి.

-రాందేని రాజయ్య, కేసీఆర్‌ బాల్యమిత్రుడు, చింతమడక

రాజయోగం ఉందన్నారు

నేను, కేసీఆర్‌ కలిసి ఓసారి వేములవాడ వెళ్లాము. రెండు సైకిళ్లపై వాళ్ల అక్కవాళ్ల ఊరు గూడూరుకు చేరుకొని అక్కడ పడుకొని నారాయణపురం మీదుగా వస్తుండగా ఓ జ్యోతిష్కుడు కలిశాడు. భవిష్యత్తులో నీకు రాజయోగం ఉందని చెప్పడంతో కేసీఆర్‌ నవ్వి ఊరుకున్నాడు. పేదరికంలో ఉన్న మనకు రాజయోగం ఉంటుందా అని ఆనాడు అన్నాడు.

- కూర ప్రభాకర్‌, కేసీఆర్‌ క్లాస్‌మేట్‌, దుబ్బాక

అవమానాలు పట్టించుకోడు

చిన్నప్పుడు ఎన్ని అవమానాలు వచ్చినా పట్టించుకునేవాడు కాదు. అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉండేది. పాఠశాలలో అటెండర్‌గా వేషం వేసిన వ్యక్తి నేడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలిగేదాకా ఎదిగాడు. ఇద్దరం 6 నుంచి 9 వరకు కలిసి చదువుకున్నాం. తెలంగాణను ఏలినట్లుగానే దేశాన్ని ఏలుతాడనే నమ్మకం ఉంది.

- పొలిశెట్టి లక్ష్మీనారాయణ, స్నేహితుడు, దుబ్బాక

Updated Date - 2022-12-15T00:38:13+05:30 IST