కల్వర్టును ఢీకొట్టిన కారు
ABN , First Publish Date - 2022-10-18T05:15:57+05:30 IST
కొండపాక మండలం దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై కల్వర్టును కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది.
భార్యాభర్తలకు తీవ్రగాయాలు, భార్య పరిస్థితి విషమం
కొండపాక, అక్టోబరు 17: కొండపాక మండలం దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై కల్వర్టును కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. సిద్దిపేట భారతనగర్‌కు చెందిన సాయికృష్ణ(39), సునీత(36) భార్యాభర్తలు హైదరాబాద్‌లో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగి సిద్దిపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో దుద్దెడ శివారులో ఎల్లమ్మ ఆలయం వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది మహేందర్, శ్రీనివాస్ కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీసి ప్రథమ చికిత్స చేశారు. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. సునీతకు తీవ్రగాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.